News


నిరాశపరిచిన టెక్‌ మహీంద్రా

Wednesday 22nd May 2019
news_main1558508851.png-25878

  • నికర లాభం 8 శాతానికి పైగా క్షీణత
  • రూ.1,126 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ టెక్‌ మహీంద్రా మార్చి త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతానికి పైగా క్షీణించి రూ.1,126 కోట్లకు పరిమితం అయింది. ఆదాయం మాత్రం 10 శాతం పెరిగి రూ.8,892 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,230 కోట్ల లాభాన్ని, రూ.8,054 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ.4,288 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 13 శాతం పెరిగి రూ.34,742 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. 
పనితీరుపై సంతృప్తి
‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మాకు సంతృప్తిని ఇచ్చింది. మార్జిన్లు మెరుగుపడ్డాయి. డిజిటల్‌ పోర్ట్‌ఫోలియో వృద్ది చెందడం, చెప్పుకోతగ్గ కాంట్రాక్టులను సొంతం చేసుకోవడం మేలు చేశాయి. కమ్యూనికేషన్‌ వ్యాపారం పుంజుకోవడం మాకు ఉత్సాహాన్నిచ్చింది’’ అని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి నాటికి 1,21,082కు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో నికరంగా 8,275 మంది ఉద్యోగులు పెరిగారు. కంపెనీ యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య మార్చి త్రైమాసికంలో 938గా ఉంది. ‘‘ఎన్నో విభాగాల్లో నిర్వహణ పనితీరు మెరగుపడిన సంవత్సరం ఇది(2018-19). దీనివల్ల ఎబిట్డా మార్జిన్‌ గణనీయంగా విస్తరించింది. తగినన్ని నగదు నిల్వలు ఉండడంతో వాటాదారులకు మెరుగైన విలువను తిరిగి అందించేందుకు షేర్ల బైబ్యాక్‌ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం’’ అని టెక్‌ మహీంద్రా సీఎఫ్‌వో మనోజ్‌భట్‌ పేర్కొన్నారు. ఒక్కో షేరుపై 2019 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.14 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు టెక్‌మహీంద్రా బోర్డు నిర్ణయం తీసుకుంది. 



You may be interested

ఏఏఐలో కేంద్రానికి షేర్లు

Wednesday 22nd May 2019

రూ.656 కోట్ల షేర్లివ్వాలని ఆర్థిక శాఖ సూచన ఏఏఐని కంపెనీగా మార్చే యోచన వాటాల విక్రయం, లిస్టింగ్ ప్రతిపాదనలు న్యూఢిల్లీ: కేంద్రం నుంచి లభించిన రూ.656 కోట్ల మూలధనానికి సరిపడా షేర్లు జారీ చేయాలంటూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు  (ఏఏఐ) కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. గడిచిన కొన్నేళ్లుగా ఈక్విటీకి ప్రతిగా కేంద్రం ఈ నిధులు అందిస్తూ వచ్చింది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు షేర్లను బైబ్యాక్ చేసే అంశంపై చర్చల

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 18శాతం డౌన్‌..!

Wednesday 22nd May 2019

ద్రవ్య కొరతతో రుణ సంక్షోభాన్ని ఎదుర్కోంటున్న ఫైనాన్సియల్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌హెచ్‌ షేర్లు బుధవారం 18శాతం నష్టపోయాయి. ద్రవ్య నిల్వల సంరక్షణలో భాగంగా కంపెనీ కొత్త డిపాజిట్లు స్వీకరించడాన్ని, పాత డిపాజిట్ల పునురద్ధణలు నిలిపివేస్తున్నట్లు మంగళవారం కస్టమర్లకు ఈ - మెయిల్‌ ద్వారా సందేశాన్ని పంపింది. వైద్య, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కాలపరిమితి పూర్తి కాని విత్‌డ్రాయిల్‌లు అనుమతించబడాయని కంపెనీ తెలిపింది. ఇటీవల రేటింగ్‌ సంస్థలు పలుమార్లు కంపెనీ రుణ

Most from this category