News


టాటా-మిస్త్రీ కేసులో ఆర్‌వోసీకి చుక్కెదురు

Tuesday 7th January 2020
news_main1578367297.png-30712

  • గత తీర్పును సవరించేందుకు నిరాకరించిన ఎన్‌సీఎల్‌ఏటీ

న్యూఢిల్లీ: టాటా-మిస్త్రీ కేసులో తీర్పును సవరించాలంటూ నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటీషన్ వేసిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ)కి చుక్కెదురైంది. ఆర్‌వోసీ పిటీషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును సవరించేందుకు తగిన కారణాలేమీ లేవని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూప్ చైర్మన్‌గా పునఃనియమించాలంటూ డిసెంబర్ 18న ఇచ్చిన తీర్పులో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. టాటా సన్స్‌ను 'పబ్లిక్ కంపెనీ' నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడంలో ఆర్‌వోసీ సహకారం అందించిందని, ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. అయితే తాము చట్టప్రకారమే నడుచుకున్నామని, తమపై చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరుతూ ఎన్‌సీఎల్‌ఏటీలో ఆర్‌వోసీ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపైనే ఎన్‌సీఎల్‌ఏటీ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు, మిస్త్రీ కేసులో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును సవాల్‌ చేస్తూ టాటా సన్స్.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ జరగలేదు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని సుప్రీం కోర్టును కోరుతున్నట్లు టాటా సన్స్ తరఫు న్యాయవాది గతంలో తెలిపినప్పటికీ.. సోమవారం దీన్ని లిస్ట్‌ చేయలేదు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తమ క్లయింట్ నుంచి తదుపరి సూచనల కోసం వేచి చూస్తున్నట్లు లాయర్ వివరించారు. 



You may be interested

నిఫ్టీ నిరోధం 12,123

Tuesday 7th January 2020

 నేడు లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌! పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా రెండు రోజులపాటు పతన బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 68 పాయింట్లు ఎగసి 12,111 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,043 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే.

డిసెంబర్‌లో ‘సేవలు’ బాగున్నాయ్‌: పీఎంఐ

Tuesday 7th January 2020

న్యూఢిల్లీ: సేవల రంగం డిసెంబర్‌లో చక్కటి పనితీరు కనబరిచినట్లు ఐహెచ్‌ఎస్‌ పర్చేజింగ్‌ మార్కిట్‌  ఇండియా (పీఎంఐ) సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ పేర్కొంది. సూచీ 53.3గా నమోదయినట్లు వివరించింది. నవంబర్‌లో ఈ సూచీ 52.7గా ఉంది. గడచిన ఐదు నెలల్లో సూచీ ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. నవంబర్‌లో సూచీ 52.7గా ఉంది. అయితే పీఎంఐ సూచీ 50 ఎగువన ఉంటే, దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది.

Most from this category