News


టాటా స్టీల్‌ లాభం రూ.3,302 కోట్లు

Thursday 7th November 2019
news_main1573097244.png-29405

  • క్యూ2లో 6 శాతం వృద్ధి 
  • రూ.34,763 కోట్లకు తగ్గిన ఆదాయం 
  • 57 శాతం తగ్గిన దేశీ నిర్వహణ లాభం

న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో(క్యూ2) రూ.3,302 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.3,116 కోట్లుతో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టాటా స్టీల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.41,258 కోట్ల నుంచి రూ.34,763 కోట్లకు తగ్గిందని పేర్కొంది. భారత్‌లోనూ, విదేశాల్లోనూ వ్యాపార వాతావరణం చాలా సమస్యాత్మకంగా ఉందని, ఉక్కు ధరలపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ టీవీ నరేంద్రన్‌ వ్యాఖ్యానించారు. వర్షాలు ముగియడం, పండగల డిమాండ్‌ కారణంగా వినియోగం ఊపందుకొని, ఉక్కుకు డిమాండ్‌ పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.., 
వంద డాలర్ల మేర తగ్గిన ఉక్కు ధరలు....
కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా కంపెనీకి రూ.4,233 కోట్ల పన్ను వ్యయాలు(దేశీ, విదేశీ అనుబంధ కంపెనీలను కలుపుకొని) తగ్గాయి. వ్యాపార పరిస్థితులు గడ్డుగా ఉండటంతో ఉక్కు ధరలు ప్రపంచవ్యాప్తంగా టన్నుకు వంద డాలర్లు తగ్గాయి. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నిర్వహణ లాభం రూ.4,018 కోట్లుగా ఉంది. భారత కార్యకలాపాల విషయానికొస్తే, నిర్వహణ లాభం 57 శాతం పతనమై  రూ.3,817 కోట్లకు చేరింది.  నిర్వహణ లాభ మార్జిన్‌ 18.9 శాతంగా నమోదైంది. 
పెరిగిన రుణ భారం...
వర్కింగ్‌ క్యాపిటల్‌ పెరగడంతో కంపెనీ స్థూల రుణభారం మరింతగా పెరిగింది. ఈ క్యూ2లో విదేశాల్లో 52.5 కోట్ల డాలర్ల రుణాలను సమీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి రూ.4,596 కోట్ల నగదు నిల్వలు, రూ.7,262 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లు ఉన్నాయి. టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌(గతంలో భూషణ్‌ స్టీల్‌) విలీన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ఈ విలీనం పూర్తి కానున్నది. మందగమనం ఉన్నప్పటికీ, బ్రాండెడ్‌ ఉత్పత్తులు, రిటైల్‌ సెగ్మంట్‌, పారిశ్రామిక, ప్రాజెక్ట్‌ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలనే సాధించామని కంపెనీ సంతృప్తి వ్యక్తం చేసింది. వాహన రంగం మందగమనం ప్రభావాన్ని ఎగుమతులు పెరగడం సర్దుబాటు చేయగలిగిందని కంపెనీ పేర్కొంది. 



You may be interested

విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వక ఎగవేతదారుడే..!

Thursday 7th November 2019

ఐడీబీఐ తాజా ప్రకటన న్యూఢిల్లీ: లిక్కర్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వక ఎగవేతదారుడని తాజాగా ఐడీబీఐ ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు హామీదారు, డైరెక్టర్‌ హోదాలో ఆయన బ్యాంక్‌ నుంచి రూ. 1,566 కోట్లను రుణంగా పొంది, ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని వివరించింది. అక్టోబర్‌ 2018 నాటికి ఈ మొత్తం చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. మాల్యా పాత పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను ముద్రించి బుధవారం ఈ మేరుకు ఒక ప్రకటనను ఐడీబీఐ

గోప్యతకు వాట్సాప్‌లో మరో ఫీచర్‌

Thursday 7th November 2019

న్యూఢిల్లీ: యూజర్ల వివరాల గోప్యతకు సంబంధించి మెసేజింగ్ యాప్‌.. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ ప్రవేశపెట్టింది. దీనితో యూజరు అనుమతించిన వారు తప్ప మిగతావారెవరు సదరు యూజరు అనుమతి లేకుండా వారి పేర్లను గ్రూప్స్‌లో చేర్చే వీలుండదు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం యాప్‌లో ఉన్న 'నోబడీ' ఆప్షన్‌ స్థానంలో 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌' అనే ఆప్షన్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీనితో గ్రూప్స్‌లో తనను చేర్చేందుకు ఎవరెవరికి అనుమతి ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వొద్దు

Most from this category