News


టెల్కోలకు 'సుప్రీం' షాక్‌

Friday 17th January 2020
news_main1579232039.png-30979

  • ఏజీఆర్‌పై రివ్యూ పిటీషన్‌ డిస్మిస్‌
  • పునఃసమీక్షకు తగిన కారణాల్లేవని వ్యాఖ్య
  • వడ్డీ, జరిమానాల విధింపు సరైనదేనని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. టెలికం కంపెనీలపై విధించిన వడ్డీ, జరిమానాలు సరైనవేనని అభిప్రాయపడింది. దీనిపై తదుపరి లిటిగేషనేదీ ఉండబోదని, టెలికం కంపెనీలు కట్టాల్సిన బకాయిల లెక్కింపు, చెల్లింపునకు నిర్దిష్ట గడువు ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్‌ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్ ఎంఆర్‌ షాతో కూడుకున్న బెంచ్ గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటీషన్‌పై విచారణను ఓపెన్‌ కోర్టు విధానంలో నిర్వహించాలని టెల్కోలు కోరినప్పటికీ.. ఇన్‌-ఛాంబర్‌ విధానంలోనే జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. 

వివాదమిదీ...
టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్‌ నిర్వచనం సరైనదేనంటూ గతేడాది అక్టోబర్‌ 24న కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల బాకీలు తడిసి మోపెడు కావడంతో టెలికం సంస్థలకు శరాఘాతంగా మారింది. దీని ప్రకారం చూస్తే వడ్డీలు, జరిమానాలు కలిపి.. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికం కంపెనీలు జనవరి 23లోగా ఏకంగా రూ. 1.47 లక్షల కోట్ల మేర కట్టాల్సి రానుంది.  ప్రభుత్వపరంగా మినహాయింపేదైనా లభిస్తుందేమోనని టెల్కోలు ఆశించినప్పటికీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల బకాయీలు కట్టాల్సి ఉందంటూ గతేడాది నవంబర్‌లో పార్లమెంటుకు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బకాయీల కింద రూ. 92,642 కోట్లు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) కింద రూ. 55,054 కోట్లు కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వడ్డీ, పెనాల్టీలను మాఫీ చేసే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు, టెలికం శాఖ లెక్కింపు ప్రకారం.. వొడాఫోన్ ఐడియా బాకీలు రూ. 53,038 కోట్లు (రూ. 24,729 కోట్ల ఎస్‌యూసీ, రూ. 28,309 కోట్ల లైసెన్సు ఫీజు) కాగా, భారతి ఎయిర్‌టెల్ బకాయీలు రూ. 35,586 కోట్ల మేర (రూ. 21,682 కోట్ల లైసెన్సు ఫీజు, రూ. 13,904 కోట్లు ఎస్‌యూసీ) మేర ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్‌లో విలీనమైన టెలినార్‌, టాటా టెలిసర్వీసెస్‌ బాకీలు విడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ‍అక్టోబర్‌ 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెలికం సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వడ్డీ, పెనాల్టీ, జరిమానాపై మళ్లీ వడ్డీ విధింపునకు సంబంధించిన అంశాలను పునఃసమీక్షించాలంటూ భారతీ ఎయిర్‌టెల్‌ కోరింది. ఈ రివ్యూ పిటీషన్‌లపైనే సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. బాకీల విషయంలో ఊరట లభించకపోతే కంపెనీని మూసివేయకతప్పదంటూ వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించడంతో .. ప్రైవేట్ రంగంలో రెండే సంస్థలు మిగిలే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. 

తీర్పు నిరాశపర్చింది: భారతి ఎయిర్‌టెల్‌
ఏజీఆర్‌ బకాయీలపై పునఃసమీక్ష పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తమను నిరాశపర్చిందని భారతి ఎయిర్‌టెల్ వెల్లడించింి. దీనిపై క్యూరేటివ్ పిటీషన్‌ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. "టెలికం పరిశ్రమ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడం, స్పెక్ట్రం కొనుగోలు చేయడం, 5జీ వంటి కొంగొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం మొదలైన వాటిపై భారీగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ఈ తీర్పు కారణంగా టెలికం పరిశ్రమ లాభదాయకత పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. అయితే దీనిపై మా నిరాశ కూడా తెలియజేదల్చుకున్నాం. ఏజీఆర్‌పై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదంపై మా వాదనలు సరైనవేనని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం" అని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇంటర్నెట్ సంస్థలకు దెబ్బ: ఐఎస్‌పీఏఐ
సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు .. టెలికం సంస్థలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని, వాటిపై ఆధారపడిన ఇంటర్నెట్ సంస్థలకు ఇది పెద్ద దెబ్బని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌పీఏఐ) ప్రెసిడెంట్ రాజేశ్ ఛారియా వ్యాఖ్యానించారు. "రివ్యూ పిటీషన్ తిరస్కరణతో టెలికం రంగం మొత్తం రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వినియోగదారులకు ఎంత మాత్రం మంచిది కాదు. ఏజీఆర్‌ నిర్వచనాన్ని సమీక్షించే విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోకపోతే చిన్న స్థాయి ఐఎస్‌పీల మనుగడ కష్టమవుతుంది" అని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

నేడు ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 17th January 2020

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌, బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి.   

మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’

Friday 17th January 2020

బీఎస్‌-6 ప్రమాణాలతో 110 సీసీ స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 63,912 ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్‌ స్టాండర్డ్‌, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912- 65,412 (ఎక్స్‌-షోరూం,

Most from this category