News


ఐఆర్‌సీటీసీ....4 నెలలు... 5 రెట్లు

Friday 14th February 2020
news_main1581648798.png-31771

  • ఐఆర్‌సీటీసీ షేర్‌ జోరు ఆపతరమా ! 
  • దలాల్‌ స్ట్రీట్‌లో దూసుకుపోతున్న రైల్వే కంపెనీ 
  • లిస్టింగ్‌లోనే రెండింతలైన షేరు​
  • నాలుగు నెలల్లో ఐదు రెట్ల లాభం

ఐఆర్‌సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌లో స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్‌... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత ట్రేడింగ్‌లోనూ రికార్డ్‌ల మీద రికార్డ్‌ల సృష్టిస్తూ సాగిపోతోంది. ఈ రికార్డ్‌లకు, లాభాల పరుగుకు కారణాలు, షేరు భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు తదితర విశేషాలు సాక్షి బిజినెస్‌ పాఠకుల కోసం... 

ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ నాలుగు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం, రైల్వే కేటరింగ్‌ సర్వీసులు నిర్వహించడం, టూరిజమ్‌ సర్వీసులు నిర్వహణ, రైల్‌ నీర్‌ బ్రాండ్‌ కింద ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ను విక్రయించడం. టూరిజం సర్వీసులు కాకుండా మిగిలిన మూడు విభాగాల్లో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఇక రైల్వేయేతర కేటరింగ్‌ సర్వీసులు, ఈ-కేటరింగ్‌, బడ్జెట్‌ హోటళ్ల రంగంలోకి కూడా విస్తరిస్తోంది. ఈ బుధవారమే ఈ కంపెనీ క్యూ3 ఫలితాలను వెల్లడించింది. నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ.206 కోట్లకు చేరగా,  మొత్తం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ఇవ్వనుంది. దీనికి రికార్డ్‌ డేట్‌గా ఈ నెల 25ను నిర్ణయించింది. ఆర్థిక ఫలితాలు అదరగొట్టటంతో ఐఆర్‌సీటీసీ షేర్‌ జోరుగా పెరిగింది. గురువారం ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట ‍స్థాయి, రూ.1,609ను తాకింది. చివరకు 11 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఐఆర్‌సీటీసీ షేర్‌ 394 శాతం పెరగ్గా, ఈ కాలంలో సెన్సెక్స్‌ 9 శాతమే లాభపడింది. 
ఐపీఓ... అదిరిపోయే ఆరంభం...
గత ఏడాది సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3ల మధ్య వచ్చిన ఐఆర్‌సీటీసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఇప్పటివరకూ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం ఇదే మొదటిసారి. రూ.320 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేరు దాదాపు రెట్టింపు ధరకు రూ.626 వద్ద అక్టోబర్‌ 14న స్టాక్‌ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్‌ రోజునే రూ.744 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆ రోజు రూ.729 వద్ద ముగిసింది. లిస్టింగ్‌లో కూడా ఈ షేర్‌ రికార్డ్‌లే సృష్టించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో లిస్టింగ్‌ లాభాలు రావడం కూడా ఇదే మొదటిసారి. ఐపీఓలో షేర్లు దక్కని వాళ్లు జోరుగా ఈ షేర్లు కొన్నారు. ఆ ఒక్కరోజే రూ.3,500 కోట్ల విలువైన షేర్లు చేతులు మారాయి. ఇటీవల కాలంలో మంచి లాభాలు గడించిన ఐపీఓ ఇదేనని చెప్పవచ్చు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.645 కోట్లు సమీకరించింది.
23వ స్థానం....
అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఈ కంపెనీ 23వ స్థానంలో ఉంది. మార్కెట్‌ క్యాప్‌ రూ.24,000 కోట్లు. స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి టాప్‌50లో కూడా ఈ షేర్‌ లేదు. ఇప్పుడు మాత్రం ఆయిల్‌ ఇండియా, భెల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీలను అధిగమించింది.


షేర్‌ ధర ఎందుకు పెరుగుతోందంటే...
ఈ కంపెనీ బిజినెస్‌ మోడల్‌ వినూత్నంగా ఉండటం వల్ల షేర్‌ విలువ మదింపు చేయడం  కొంచెం కష్టమేనన్నది నిపుణుల మాట. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, రైల్వే కేటరింగ్‌ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీదే. అసెట్‌- లైట్‌ బిజినెస్‌ మోడల్‌ను అనుసరిస్తున్న ఈ కంపెనీ ఫ్లోటింగ్‌ షేర్లు (ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య) చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. ధర కూడా పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే కేటరింగ్‌ ఉత్పత్తుల ధరలను పెంచింది. మార్జిన్లు అధికంగా ఉండే తేజస్‌ రైళ్లను మూడు రూట్లలో నడుపుతోంది. మరిన్ని తేజస్‌ రైళ్లను తెచ్చే యోచనలో ఉంది. బిజినెస్‌ మోడల్‌ నిలకడగా ఉండటం, డివిడెండ్‌ చెల్లింపులు బాగుండటం (గత మూడేళ్లలో సగటున 50 శాతం మేర డివిడెండ్‌ చెల్లించింది), రూ.1,100 కోట్ల మేర పుష్కలంగా నగదు నిల్వలు ఉండటం... ఇవన్నీ సానుకూలాంశాలు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇది ఉత్తమ షేరుగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడేళ్లలో అమ్మకాలు 23 శాతం, నికర లాభం 49 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. 


బహుపరాక్‌...
ఈ షేర్‌ ధర జోరుగా పెరుగుతోంది. అయితే డెలివరి అయ్యే షేర్ల నిష్పత్తి 11- 13 శాతం మేర మాత్రమే ఉంది. ఈ షేర్‌లో డే ట్రేడింగ్‌ బాగా జరుగుతోందనడానికి ఇది నిదర్శనమన్నది నిపుణుల మాట. ఈ షేర్‌తో మొమెంటమ్‌ గేమ్‌ ఆడాలనుకుంటే ఇన్వెస్టర్ల చేతులు కాలవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కంపెనీ వేల్యూయేషన్లు భారీగా పెరిగాయని, కంపెనీ ఈపీఎస్‌కు 80 రెట్ల వద్ద ట్రేడవుతోందని , ఒకింత ​‍అప్రమత్తంగా ఉండాలని వారంటున్నారు. ఇంటర్నెట్‌ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్‌ కంపెనీలకు ఈ విలువ సమంజసమైనదే. అయితే ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి మాత్రం ఈ విలువ చాలా అధికమన్నది వారి విశ్లేషణ. వేల్యూయేషన్లు అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ కంపెనీలో వాటా విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని,  ఈ రెండూ ప్రతికూలాంశాలని వారంటున్నారు. అయితే ఈ కంపెనీలో మరింత వాటా విక్రయానికి మరో ఏడాది పాటు సమయం ఉంది. 


తేజస్‌ రైళ్లతో మరింత దూకుడు.. 
ఈ కంపెనీ తొలి తేజస్‌ రైలును లక్నో- ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్‌ రైలును అహ్మదాబాద్‌ - ముంబై సెంట్రల్‌కు ప్రారంభించింది. ఆ రోజే ఈ షేర్‌ నాలుగంకెల ధరకు చేరింది. ఇక మూడో తేజస్‌ రైలును త్వరలోనే ఇండోర్‌- వారణాసి మధ్య నడిపించనుంది. తేజస్‌ రైళ్ల దూకుడుతో ఈ షేర్‌ ధర మరింత జోరుగా పెరగనుంది. 

 

ఐఆర్‌సీటీసీ జైత్రయాత్ర
క్రమసంఖ్య విషయం ధర(రూ.లలో)
1 ఇష్యూ ధర 320
2 లిస్టింగ్‌ ధర 626
3 ప్రస్తుత ధర 1,580
4 ఆల్‌టైమ్‌ హై ధర 1,609



You may be interested

భారత్‌ వృద్ధి ఊపందుకుంటుంది!

Friday 14th February 2020

ఎస్‌అండ్‌పీ అంచనా ద్రవ్య, పరపతి, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషణ స్టేబుల్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’  సావరిన్‌ రేటింగ్‌ కొనసాగింపు 2020-21లో 6 శాతం వృద్ధికి అవకాశం అటుపై రెండేళ్లలో మరింత పెరుగుదల...  న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం మందగమనంలో కొనసాగుతున్నా... దేశ ఆర్థిక మూలాల పటిష్టతపై విశ్వాసాన్ని గ్లోబల్‌ దిగ్గజ రేటింగ్‌ సంస్థ- స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) ‍వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే,  భారత్‌ ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఐడియా నష్టాలు రూ.6,439 కోట్లు

Friday 14th February 2020

ఏజీఆర్‌, తరుగుదల ప్రభావం  5 శాతం తగ్గిన ఆదాయం  న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌

Most from this category