News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Saturday 25th May 2019
news_main1558781491.png-25935

  • జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభం 48 శాతం డౌన్‌

రూ.15,700 కోట్ల పెట్టుబడులు 
మొత్తం ఆదాయం రూ.22,421 కోట్లకు

న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్‌లో 48 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.2,879 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,495 కోట్లకు తగ్గిందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తెలిపింది. వ్యయాలు పెరగడం, రియలైజేషన్లు తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.21,381 కోట్ల నుంచి రూ.22,421 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.17,794 కోట్ల నుంచి రూ.20,058 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని కంపెనీ తెలిపింది. వీటిల్లో రూ.5,700 కోట్ల ప్రతిపాదనలకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని వెల్లడించింది. 
ఏడాది ఆదాయం రూ.84,757 కోట్లు..
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.6,113 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,524 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.73,211 కోట్ల నుంచి రూ.84,757 కోట్లకు పెరిగింది. 
7 శాతం మేర వృద్ధి....
గత క్యూ4లో స్టీల్‌కు డిమాండ్‌ తగ్గిందని కంపెనీ తెలిపింది. వాహన రంగం నుంచి డిమాండ్‌ మందగించడం, నాన్‌ బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో సంక్షోభం, రుణ లభ్యత దుర్లభం కావడం, ఎగుమతులు పెరగడం దీనికి కారణమని వివరించింది. మధ్యంతర బడ్జెట్లో రూ. లక్ష కోట్ల కేటాయింపులు జరిపారని, వర్షాలు మామూలుగానే కురుస్తాయనే అంచనాలున్నాయని, పలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోగలదని ఈ కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టీల్‌ డిమాండ్‌ 6.5-7 శాతం మేర పెరగగలదని అంచనా వేస్తోంది. 

  • గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లాభం రూ.1,532 కోట్లు

- ఒక్కో షేర్‌కు రూ.7 డివిడెండ్‌
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018-19)నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,532 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.854 కోట్ల నికర లాభం ఆర్జించామని గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఆదాయం రూ.17,363 కోట్ల నుంచి రూ.20,965 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత క్యూ4లో మొత్తం వ్యయాలు రూ.18,747 కోట్లకు చేరాయని వివరించింది. గత క్యూ4లో ఫలితాల్లో సెంచురీ టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన విస్కోస్‌ ఫిలమెంట్‌ యార్న్‌ (వీఎఫ్‌వై) వ్యాపార ఆర్థిక ఫలితాలు కూడా కలసి ఉన్నాయని, అందుకని గత క్యూ4 ఫలితాలను, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.7 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. 
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ. 3,688 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,776 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఆదాయం రూ.57,034 కోట్ల నుంచి రూ.72,091 కోట్లకు ఎగసిందని పేర్కొంది. సిమెంట్‌ విభాగం ఆదాయం రూ.9,290 కోట్ల నుంచి రూ.10,905 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది.  విస్కోస్‌ విభాగం ఆదాయం రూ.2,231 కోట్ల నుంచి రూ.2,625 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 
సిమెంట్‌ అమ్మకాలు పెరుగుతాయ్‌...
చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) పదవికి సుశీల్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారని, కొత్త సీఎఫ్‌ఓగా అశీష్‌ అడుకియాను నియమించామని, ఈ ఏడాది జూలై 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని వివరించారు. మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుండటంతో సిమెంట్‌ అమ్మకాలు బాగా ఉంటాయని కంపెనీ అంచనా వేస్తోంది.

  • మూడింతలైన జీవీకే పవర్‌ లాభం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మార్చి క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో జీవీకే పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే మూడింతలై రూ.69 కోట్లకు చేరుకుంది. టర్నోవరు రూ.28 కోట్ల నుంచి రూ.34 కోట్లుగా ఉంది. 2018-19లో రూ.100 కోట్ల టర్నోవరుపై రూ.114 కోట్ల నికరలాభం సాధించింది. అంత క్రితం సంవత్సరం రూ.92 కోట్ల టర్నోవరుపై రూ.36 కోట్ల నష్టం ప్రకటించింది. 2018-19 కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.4,363 కోట్ల టర్నోవరుపై రూ.304 కోట్ల నష్టం వాటిల్లింది. 

  • బాటా ఇండియా లాభం 69 శాతం అప్‌

ఒక్కో షేర్‌కు రూ.6.25 డివిడెండ్‌  న్యూఢిల్లీ: పాదరక్షల దిగ్గజం, బాటా ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్‌లో 69 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.52 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.88 కోట్లకు పెరిగిందని బాటా ఇండియా తెలిపింది. ఆదాయం రూ.632 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.679 కోట్లకు పెరిగింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6.25 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. 
మెరుగుపడిన లాభదాయకత....
ఈ కామర్స్‌ చట్టాల్లో మార్పులు కారణంగా తమ ఈ కామర్స్‌ చానెల్‌ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగలేదని పేర్కొంది. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా లాభదాయకత మెరుగుపడిందని వివరించింది. 

  • అశోక్‌ లేలాండ్‌ లాభం రూ.653 కోట్లు

- 12 శాతం డౌన్‌
- ఒక్కో షేర్‌కు రూ.3.10 డివిడెండ్‌

న్యూఢిల్లీ: వాణిజ్య వాహన దిగ్గజం, అశోక్‌ లేలాండ్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.743 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.653 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.8,652 కోట్ల నుంచి రూ.8,723 కోట్లకు పెరిగిందని అశోక్‌ లేలాండ్‌ చైర్మన్‌ ధీరజ్‌ హిందుజా తెలిపారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.10 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. 
ఏడాది లాభం 21 శాతం అప్‌...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.1,814 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం వృద్ధితో రూ.2,195 కోట్లకు పెరిగిందని ధీరజ్‌  వెల్లడించారు. మొత్తం ఆదాయం రూ.29,522 కోట్ల నుంచి రూ.32,753 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయని,  వాహనాలకు సంబంధించి నిబంధనల్లో మార్పులు కఠినతరం అవుతున్నాయని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్‌ వాటాను కోల్పోలేదని వివరించారు. ప్రస్తుత వృద్ధి జోరును కొనసాగించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. 
నికర లాభం తగ్గినప్పటికీ, మార్కెట్‌ వాటా కోల్పోకపోవడంతో  అశోక్‌ లేలాండ్‌ షేర్‌ లాభపడింది.

  • ఎన్‌సీసీ లాభం రూ.172 కోట్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో ఎన్‌సీసీ నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే 682 శాతం అధికమై రూ.172 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.2,642 కోట్ల నుంచి రూ.3,811 కోట్లకు ఎగసింది. 2018-19లో రూ.13,020 కోట్ల టర్నోవరుపై రూ.560 కోట్ల నికరలాభం సాధించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 డివిడెండు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32  పాయింట్లు డౌన్‌

Monday 27th May 2019

ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత్‌ మార్కెట్‌ బుధవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు 32  పాయింట్ల నష్టంతో 11,837 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,869  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ మినహా సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై, కొరియా కోస్పి

చైనాతో వాణిజ్యలోటు తగ్గింపుపై భారత్‌ దృష్టి

Saturday 25th May 2019

న్యూఢిల్లీ: చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటును తగ్గించడంపై భారత్‌ దృష్టి సారిస్తోంది. ఎగుమతులు- దిగుమతుల మధ్య ఉన్న నికర వ్యత్యాసాన్ని వాణిజ్య లోటుగా వ్యవహరిస్తుంటారు. 2017-18లో చైనాతో భారత్‌ వాణిజ్యలోటు విలువ 53.56 బిలియన్‌ డాలర్లు. చైనాకు ఎగుమతులు పెంపు, దిగుమతులను తగ్గించుకోవడం ప్రధాన అంశాలుగా వాణిజ్యలోటు సమస్యను అధిగమించవచ్చని వాణిజ్యమంత్రిత్వశాఖ రూపొందించిన ఒక వ్యూహాత్మక నివేదిక పత్రం పేర్కొంది. ఈ పత్రాన్ని ఇప్పటికే వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి

Most from this category