News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Thursday 30th May 2019
news_main1559204361.png-26001

  • 18 శాతం వృద్ధి చెందిన ఐస్‌ మేక్‌ లాభం

హైదరాబాద్‌: మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ నికర లాభం రూ.7.83 కోట్లుగా నమోదయింది. గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలానికి లాభం రూ.6.63 కోట్లుగా ఉంది. ఏడాదిలో 18.11 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం 27.44 శాతం వృద్ధితో రూ.129.58 కోట్లకు చేరుకుంది. 2018 ఆర్ధిక సంవత్సరంలో ఇది రూ.101.68 కోట్లుగా ఉంది. 2019 ఆర్ధిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఈక్విటీ షేర్‌కు రూ.1.20 డివెడెండ్‌ను ప్రకటించారు.

  • అదానీ పవర్‌ లాభం రూ.635  కోట్లు

-రూ.8,078 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: అదానీ పవర్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.635 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అధిక ఆదాయం కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని అదానీ పవర్‌ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.653 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొత్తం ఆదాయం రూ.4,161 కోట్ల నుంచి రూ.8,078 కోట్లకు పెరిగింది. 

  • పవర్‌గ్రిడ్‌ లాభం రూ.3,053 కోట్లు

మార్చి త్రైమాసికంలో 52 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ మార్చి త్రైమాసికానికి ఆకట్టుకునే ఫలితాలను ప్రకటించింది. కంపెనీ స్టాండలోన్‌ లాభం 52 శాతం పెరిగింది. రూ.9,610 కోట్ల ఆదాయంపై రూ.3,053 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఆదాయం రూ.8,100 కోట్లు, నికర లాభం రూ.2,010 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ స్టాండలోన్‌ లాభం రూ.8,244 కోట్ల నుంచి రూ.9,938 కోట్లకు పెరిగింది. ఆదాయం సైతం రూ.30,766 కోట్ల నుంచి రూ.35,618 కోట్లకు వృద్ధి చెందింది. ఇక పవర్‌గ్రిడ్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.10,033 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంతవ్సరంలో ఇది రూ.8,204 కోట్లుగానే ఉంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ. 30,430 కోట్ల నుంచి రూ.36,661 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుకు రూ.2.50 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. మద్యంతర డివిడెండ్‌ కూడా కలుపుకుని చూస్తే 2018-19 సంవత్సరానికి షేరుపై మొత్తం రూ.8.33 డివిడెండ్‌ ప్రకటించినట్టు అవుతుంది. 

  • 20 శాతం తగ్గిన మహీంద్రా లాభం

-ఒక్కో షేర్‌కు రూ.8.50 డివిడెండ్‌ 
-నిర్వహణ లాభం రూ.1,883 కోట్లు
-2 శాతం క్షీణత

ముంబై: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం(స్డాండ్‌అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో 20 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18 క్యూ4లో రూ.1,059 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.849 కోట్లకు తగ్గిందని మహీంద్రా కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.13,308 కోట్ల నుంచి రూ.14,035 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.8.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.  నిర్వహణ లాభం రూ.1926 కోట్ల నుంచి  2 శాతం తగ్గి రూ.1,883 కోట్లకు తగ్గిందని వివరించింది. ఈ కంపెనీ షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌)  రూ.8.90 నుంచి రూ.7.13కు తగ్గిపోయింది. 

10 శాతం పెరిగిన ఏడాది లాభం...

పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.4,356 కోట్లుగా ఉన్న నికర లాభం గతార్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధితో రూ.4,796 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. కార్యకలాపాల ఆదాయం రూ.49,445 కోట్ల నుంచి రూ.53,614 కోట్లకు చేరిందని పేర్కొంది. మొత్తం వాహన విక్రయాలు 1.56 లక్షల నుంచి 1.63 లక్షలకు పెరిగాయని తెలిపింది. ప్రయాణీకుల వాహన అమ్మకాలు 7 శాతం పెరిగి 77,607కు చేరాయని,   ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం 15 శాతం పతనమై 56,903కు తగ్గాయని పేర్కొంది. 
ఏడాది నష్టాలు రూ.984 కోట్లు...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.2,103 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.984 కోట్లకు తగ్గాయని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.21,093 కోట్ల నుంచి రూ.26,362 కోట్లకు పెరిగింది. సగటు ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) 55 శాతం నుంచి 64 శాతానికి చేరింది. 
రూ.7,000 కోట్లు సమీకరణ 
రూ,.7,000 కోట్ల నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని కంపెనీ పేర్కొంది. ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టబుల్‌ బాండ్లు, ఇతర కన్వర్టబుల్‌ సెక్యూరిటీలు లేదా క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ లేదా జీడీఆర్‌, ఏడీఆర్‌ లేదా ఎఫ్‌సీసీబీ, ఎఫ్‌సీఈబీల ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని వివరించింది. కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా సురేశ్‌ జైన్‌ను నియమించామని, ఈ నియామకం నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

  • క్యాడిలా హెల్త్‌కేర్‌ లాభం రూ.460 కోట్లు

- ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌
న్యూఢిల్లీ: క్యాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం (2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.460 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూలో రూ.591 కోట్ల నికర లాభం వచ్చిందని క్యాడిలా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,238 కోట్ల నుంచి రూ.3,733 కోట్లకు పెరిగింది. గత క్యూ4 ఫలితాల్లో హెంజ్‌ ఇండియా కార్యకలాపాలు కూడా జతయ్యాయని, అందుకే ఈ ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. దాదాపు 102 కోట్ల షేర్లకు డివిడెండ్‌ చెల్లించాల్సి ఉందని పేర్కొంది. 
ఏడాది లాభం రూ.1,859 కోట్లు....
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.1,776 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,859 కోట్ల నికర లాభం వచ్చిందని క్యాడిలా హెల్త్‌కేర్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.11,954 కోట్ల నుంచి రూ.13,166 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఎఫ్‌డీఏకు 29 అండాలు(అబ్రివియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌)లు సమర్పించాయని, దీంతో మొత్తం ఎఫ్‌డీఏకు సమర్పించిన అండాల సంఖ్య 360కు పెరిగిందని  వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 74 అండాలు ఆమోదం పొందాయని, దీంతో ఆమోదం పొందిన అండాల సంఖ్య 254కు పెరిగిందని వివరించింది. 

  • రెండున్నర రెట్లు పెరిగిన పీఎఫ్‌సీ లాభం

- రూ.796 కోట్ల నుంచి రూ.2,118 కోట్లకు
- మొత్తం ఆదాయం రూ.7,703 కోట్లకు
- విద్యుత్‌ రుణాల్లో అతిపెద్ద సంస్థ ఇదే

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) నికర లాభం స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి- మార్చి క్వార్టర్‌లో రెండున్నర రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.796 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.2,118 కోట్లకు పెరిగిందని పీఎఫ్‌సీ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,255 కోట్ల నుంచి రూ.7,703 కోట్లకు పెరిగిందని వివరించింది. 
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.4,387 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,953 కోట్లకు పెరిగిందని పీఎఫ్‌సీ తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.25,980 కోట్ల నుంచి రూ.28,851 కోట్లకు పెరిగింది. ఇవి స్టాండ్‌అలోన్‌ ఫలితాలు. ఇక కన్సాలిడేటెడ్‌ ఫలితాలను చూస్తే, నికర లాభం రూ.8,797 కోట్ల నుంచి రూ.12,640 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.48,645 కోట్ల నుంచి రూ.54,157 కోట్లకు చేరింది. భారత విద్యుత్తు రంగంలో అతి పెద్ద రుణ వితరణ సంస్థగా పీఎఫ్‌సీ అవతరించిందనే విషయాన్ని కన్సాలిడేటెడ్‌  ఫలితాలు సూచిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అంతే కాకుండా భారత్‌లో హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత అత్యధిక లాభదాయక ఆర్థిక సంస్థ ఇదేనని, మూడో అతి పెద్ద లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇదేనని వారంటున్నారు. 
2.67 శాతానికి ఇంటరెస్ట్‌ స్ప్రెడ్స్‌...
ఇంటరెస్ట్‌ స్ప్రెడ్స్‌ 24 బేసిస్‌ పాయింట్లు పెరిగి 2.67 శాతానికి ఎగసిందని పీఎఫ్‌సీ తెలిపింది. మంజూరు చేసిర రుణాలపై వసూలైన వడ్డీ నుంచి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీల మధ్య ఉన్న తేడాను ఇంటరెస్ట్‌ స్ప్రెడ్స్‌గా పరిగణిస్తారు. గత క్యూ4లో మరో ప్రభుత్వ రంగ విద్యుత్తు సంస్థ, ఆర్‌ఈసీ విలీనం పూర్తయిందని పీఎఫ్‌సీ తెలిపింది. దీంతో లోన్‌ అసెట్‌ బుక్‌ రూ.5,95,877 కోట్లకు, నెట్‌వర్త్‌రూ.63,484 కోట్లకు పెరిగాయని వివరించింది.

  • హావెల్స్‌  లాభం 8 శాతం డౌన్‌

- 9 శాతం పెరిగిన మొత్తం ఆదాయం 
- ఏడాది ఆదాయం రూ.10,185 కోట్లకు

న్యూఢిల్లీ: కన్సూమర్‌ ఎలక్ట్రికల్‌ వస్తువులు తయారు చేసే హావెల్స్‌  ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 2018-19 నాలుగో త్రైమాసిక కాలంలో 8 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.226 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.207 కోట్లకు తగ్గినట్లు హావెల్స్‌ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.2,561 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.2,783 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ అనిల్‌ రాయ్‌ గుప్తా తెలిపారు. నిధుల కొరత, శీతాకాలం ఎక్కువ కాలం కొనసాగడం, సుదీర్ఘమైన ఎన్నికల దశలు. గత క్యూ4 ఫలితాలపై ప్రభావం చూపాయని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.2,220 కోట్ల నుంచి రూ.2,474 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. 

ఏడాది లాభం రూ.792 కోట్లు...

పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.713 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.792 కోట్లకు పెరిగిందని అనిల్‌ రాయ్‌ గుప్తా తెలిపారు. మొత్తం ఆదాయం రూ.8,377 కోట్ల నుంచి రూ.10,185 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో లాయిడ్‌ కన్సూమర్‌ డివిజన్‌ను కొనుగోలు చేసినందున, పూర్తి ఆర్థిక సంవత్సరం ఫలితాలను పోల్చడానికి లేదని వివరించారు.

  • 18 శాతం పెరిగిన టీటీకే ప్రెస్టీజ్‌ లాభం

న్యూఢిల్లీ: గృహోపకరణాల సంస్థ టీటీకే ప్రెస్టీజ్‌ మార్చి త్రైమాసికానికి రూ.452 కోట్ల స్టాండలోన్‌ ఆదాయంపై రూ.43.80 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.422 కోట్లు, నికర లాభం రూ.37 కోట్లుగా ఉండడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.190 కోట్లకు తగ్గింది. 2017-18లో లాభం రూ.257 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం మాత్రం రూ.1,760 కోట్ల నుంచి రూ.1,993 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుపై రూ.30 డివిడెండ్‌ను 2018-19 ఆర్థిక సంత్సరానికి ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. 

  • వీల్స్‌ ఇండియా లాభం రూ.20 కోట్లు

చెన్నై: టీవీఎస్‌ గ్రూపులో భాగమైన స్టీల్‌ చక్రాల తయారీ సంస్థ వీల్స్‌ ఇండియా మార్చి క్వార్టర్‌కు సంబంధించి ఫ్లాట్‌ ఫలితాలను ప్రకటించింది. రూ.19.7 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.19.5 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం మాత్రం రూ.705 కోట్ల నుంచి రూ.855 కోట్లకు వృద్ధి చెందింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.3,188 కోట్ల ఆదాయంపై రూ.75 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.2,517 కోట్లు, లాభం రూ.72 కోట్లుగా ఉన్నాయి. ఒక్కో షేరుపై రూ.4.75 తుది డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Thursday 30th May 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌లో 31,256.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ భారీ లాభంలో 1శాతం ర్యాలీతో 31619.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో యస్‌బ్యాంక్‌ అత్యధికంగా 2.50శాతం పెరిగింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.50శాతం, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌బీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. మరోవైపు బ్యాంక్‌

ఎఫ్‌ఐఐలు వచ్చేస్తున్నారు!

Thursday 30th May 2019

ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు  (ఎఫ్‌ఐఐలు) భారత మార్కెట్లోకి క్యూ కడుతున్నారు. సంస్కరణల కొనసాగింపుపై ఆశలు, వ్యాపారనుకూల వాతావరణం, ఎకానమీ బలోపేతం చేయడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకొని ఇతర వర్ధమాన మార్కెట్ల కన్నా భారత్‌వైపే విదేశీ మదుపరులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి మే మొదటివరకు చురుగ్గా వ్యవహరించిన ఎఫ్‌ఐఐలు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాల వరకు

Most from this category