News


చెరో రూ.1,170 కోట్లు కట్టండి!

Saturday 16th November 2019
news_main1573874892.png-29626

  • ‘ర్యాన్‌బ్యాక్సీ’ సింగ్‌ సోదరులది కోర్టు ధిక్కారమే...
  • దైచీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు
  • ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో షేర్ల అమ్మకం తగదని స్పష్టీకరణ
  • ఎనిమిది వారాల్లో సొమ్ము కోర్టుకు జమచేయాలని ఆదేశం
  • తరువాతే శిక్షను నిర్ణయిస్తామన్న సుప్రీం

న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌లు (సింగ్‌ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ- ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు విక్రయించడం కోర్టు ధిక్కార అంశంగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పును సరిదిద్దుకునే క్రమంలో సింగ్‌ సోదరులు ఇరువురు రూ.1,170.95 కోట్ల చొప్పున మొత్తం రూ.2341.90 కోట్లను సుప్రీంకోర్టులో డిపాజిట్‌ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. డిపాజిట్‌ తర్వాతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్ష విషయంలో ‘కొంత వెసులుబాటు’ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది.  ‘‘కేసుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సింగ్‌ సోదరులు తెలిసీ, ఉద్దేశపూర్వంగానే ఉల్లంఘించారు. కనుక వీరు ఇరువురూ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగానే ఈ కోర్టు భావిస్తోంది’’అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తంమీద తాజా రూలింగ్‌ ఫోర్టిస్‌-ఐహెచ్‌హెచ్‌ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కేసు పూర్వాపరాల్లోకి వెళితే...
- సింగ్‌ సోదరులు 2008లో ర్యాన్‌బాక్సీని జపాన్‌ సంస్థ దైచీ శాంక్యోకి విక్రయించారు. అనంతరం ఈ కంపెనీని దైచీ నుంచి భారత్‌కే చెందిన సన్‌ఫార్మా 3.2 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 
- అయితే ర్యాన్‌బాక్సీ అమ్మకం వ్యవహారానికి సంబంధించి సింగ్‌ సోదరులపై దైచీ సింగపూర్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఈ విక్రయంలో కంపెనీకి సంబంధించి కొన్ని కీలక అంశాలను సింగ్‌ సోదరులు దాచిపెట్టారన్నది దైచీ ప్రధాన ఆరోపణ. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌తో పలు రెగ్యులేటరీ సమస్యలను ర్యాన్‌బాక్సీ ఎదుర్కొంటోందని, అయితే విక్రయ ఒప్పందాల సమయంలో ఈ అంశాలను సింగ్‌ సోదరులు వెల్లడించలేదన్నది ఆరోపణల్లో ప్రధానమైనది. ఈ కేసులో 2016లో రూ. 2,562 కోట్ల పరిహారాన్ని (అవార్డు) ట్రిబ్యునల్‌ నుంచి పొందింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సింగ్‌ సోదరులు భారత్‌, సింగ్‌పూర్‌ కోర్టుల్లో సవాలు చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో సింగ్‌ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్బిట్రల్‌ అవార్డును హైకోర్టు సమర్థించింది. 
- ఆర్బిట్రేషన్‌ ఉత్తర్వుల్లో భాగంగా వడ్డీసహా రూ.3,500 కోట్లు పొందడానికి దైచీ ఢిల్లీ హైకోర్టులో న్యాయ ప్రక్రియను చేపట్టింది. దీనితో ఆయా అంశాలపై సింగ్‌ సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు.  ఇక్కడ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 16న వారి అప్పీల్‌ను సుప్రీం తోసిపుచ్చింది.  ఈ కేసు విచారణలో భాగంగా వ్యక్తిగతంగా కూడా సింగ్‌ సోదరులను సుప్రీంకోర్టు పిలిపించింది. ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌లో తమకు ఉన్న వాటాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు సింగ్‌ సోదరులను ఆదేశించింది. దైచీకి చెల్లింపులకు సంబంధించి ప్రణాళికలను సమర్పించాలని కూడా తేల్చిచెప్పింది.
- అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో తమ వాటాలను సింగ్‌ సోదరులు మలేషియా సంస్థ- ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌కు  విక్రయించారు. 
- ఈ విషయాన్ని దైచీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో గత ఏడాది డిసెంబర్‌ 14న ఫోర్టీస్‌-ఐహెచ్‌హెచ్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 
-  మార్చిలో దైచీ సుప్రీంకోర్టులో సింగ్‌ సోదరులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా దాఖలు చేసింది. 
- ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌కు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు ‘ధిక్కరణ’ విచారణా పక్రియను చేపట్టింది. ఫోర్టిస్‌కు సంబంధించి ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ ఓపెన్‌ ఆఫర్‌పై ఇచ్చిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. ఈ ఓపెన్‌ ఆఫర్‌పై విచరణను తదుపరి విచారణ తేదీ... అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. 
- 2018 ఫోర్టిస్‌ హెల్‌కేర్‌ బోర్డ్‌ డైరెక్టర్లుగా సింగ్‌ సోదరులు రాజీనామా చేసిన విషయం ఈ కేసులో మరోఅంశం. అనంతరం సెప్టెంబర్‌లో సివిందర్‌ సింగ్‌ తన సోదరునిపై ఒక కేసు దాఖలు చేస్తూ, ఆయన ఆర్థిక అంశాల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 



You may be interested

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ పెట్టుబడులు

Saturday 16th November 2019

 6 శాతం వాటా కొనుగోలు డీల్‌ విలువ రూ.1,750 కోట్లు న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌)లో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థ బ్లాక్‌స్టోన్‌ రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌ హోల్డింగ్‌కంపెనీ రైకా కమర్షియల్‌ వెంచర్స్‌లో బ్లాక్‌స్టోన్‌ నిర్వహణలోని ఫండ్స్‌ ఈ మేరకు ఇన్వెస్ట్‌ చేశాయి. ఈ లావాదేవీలో భాగంగా ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎల్‌లో 6 శాతం వాటా బ్లాక్‌స్టోన్‌ పరమైంది. కాగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కారణంగా

ఆర్సెలర్‌ మిట్టల్ చేతికే ఎస్సార్‌ స్టీల్‌!!

Saturday 16th November 2019

 టేకోవర్‌కు మార్గం సుగమం ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు కొట్టేసిన సుప్రీం కోర్టు వాటాలపై సీవోసీదే అంతిమ నిర్ణయం బ్యాంకులకే మొదటి ప్రాధాన్యం రుణదాతలందరినీ ఒకే గాటన కట్టలేమని  అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరణ న్యూఢిల్లీ: దివాలా తీసిన ఎస్సార్‌ స్టీల్‌ను ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌ మిట్టల్‌ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించి ఆర్సెలర్‌ మిట్టల్‌ సమర్పించిన రూ. 42,000 కోట్ల బిడ్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. బిడ్‌ మొత్తాన్ని ఫైనాన్షియల్‌ రుణదాతలు (బ్యాంకులు

Most from this category