News


రంగాలవారీగానే తోడ్పాటు..

Monday 19th August 2019
news_main1566192333.png-27847

  • ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కేంద్రం విముఖత
  •  ఆటోమొబైల్ రంగానికి విధానాలపరమైన వెసులుబాట్లు
  • సూపర్ రిచ్‌ పన్ను కొన్నాళ్ల పాటు వాయిదా యోచన
  • ఎన్‌బీఎఫ్‌సీలకూ ఊరటనిచ్చే చర్యలు పరిశీలనలో

న్యూఢిల్లీ: డిమాండ్ మందగించి, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వివిధ రంగాలు ఉద్దీపన ప్యాకేజీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలన్నీ పరిశీలిస్తోంది. ఖజానాకొచ్చే ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలాంటిది కాకుండా.. సంక్షోభంలో ఉన్న విభాగాలకు మాత్రమే పరిమితమయ్యేలా రంగాలవారీగానే రాయితీలు, తోడ్పాటు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రంగాలవారీ విధానపరమైన ప్యాకేజీలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రధాని కార్యాలయం, రిజర్వ్ బ్యాంక్‌లతో ఆర్థిక శాఖ ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్‌ తదితర రంగాలు కోరుతున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ప్రత్యేక రీఫైనాన్స్‌ విండో ప్రారంభించఽడం వంటి విధానపరమైన చర్యల గురించి చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటోమొబైల్ రంగం కోరుతున్నట్లు ద్విచక్రవాహనాలపై జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది. ఒకవేళ తగ్గించిన పక్ష౾ంలో ప్రభుత్వానికి ఏటా రూ. 6,000 కోట్ల మేర ఆదాయం తగ్గనుండటంతో ప్రభుత్వం దీనివైపు మొగ్గు చూపడం లేదని సమాచారం. గరిష్ట శ్లాబు 28 శాతం పరిధిలో గతంలో 235 ఉత్పత్తులు ఉండగా.. ప్రస్తుతం 30 ఉత్పత్తుల స్థాయికి సంఖ్య తగ్గింది. అయితే ఆటోమొబైల్‌, అనుబంధ రంగాలకు రుణ సౌలభ్యాన్ని మెరుగుపర్చేలా ప్రభుత్వ బ్యాంకులతో ఆర్‌బీఐ, కేంద్రం కూడా చర్చలు జరుపుతున్నాయి. మొండిబాకీల పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకుంటూ.. ఈ రంగాల సంస్థల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్డ్‌ రుణాలను అందించే అంశాన్ని పరిశీలించాలంటూ బ్యాంకులకు ప్రభుత్వం సూచించనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలు పరిష్కరించి.. ఆటోమొబైల్ రంగానికి రుణ లభ్యత మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్‌ అశ్విన్ మహాజన్ చెప్పారు. ఒకవేళ ప్యాకేజీలు ఇచ్చేలా ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే.. విధానపరమైన తోడ్పాటు చర్యలైనా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఎన్‌బీఎఫ్‌సీల సమస్యలకు పరిష్కార మార్గాలు ..
నిధులు దొరక్క నానా తంటాలు పడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఆర్థిక రంగం అభివృద్ధి మండలి (ఎఫ్‌ఐడీసీ) ఇందుకోసం కేంద్రం ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. ఎన్‌బీఎఫ్‌సీలకు కూడా ముద్రా స్కీమ్‌ కింద రీఫైనాన్స్ సదుపాయం లభించేలా చూడటంతో పాటు నేషనల్ హౌసింగ్‌ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లాగా ఆర్‌బీఐలో శాశ్వత ప్రాతిపదినక రీఫైనాన్స్ విండో కూడా ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీల అవసరాలకు అనుగుణంగా నిధుల లభ్యత మెరుగుపడగలదని వివరించింది. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాల నుంచి కూడా ఎన్‌బీఎఫ్‌సీలు నిధులు సమీకరించుకునే వెసులుబాటు ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఇటీవలే ఆర్థిక శాఖకు ఎఫ్‌ఐడీసీ తెలిపింది. మందగమన ప్రభావాలను అత్యధికంగా ఎదుర్కొంటున్న ఆటోమొబైల్‌ రంగంలోని చిన్న సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) కూడా ఇది తోడ్పాటునివ్వగలదని పేర్కొంది. 

ఎఫ్‌పీఐలకు ఊరట...
అధికాదాయ వర్గాలపై అదనపు పన్ను (సూపర్ రిచ్ ట్యాక్స్‌) పరిధి నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) పూర్తి మినహాయింపు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ.. ప్రత్యామ్నాయంగా ఇతరత్రా మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సూపర్ రిచ్ ట్యాక్స్‌ నోటిఫై చేయడాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయడం లేదా దీన్ని వర్తింపచేసే గడువును మరికొన్నాళ్ల పాటు పొడిగించడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సూపర్ రిచ్ ట్యాక్స్‌ను పూర్తిగా ఎత్తివేయకుండా ప్రస్తుత పరిస్థితులకు అనువుగా ప్రత్యామ్నాయంగా ఏయే చర్యలు తీసుకోవచ్చన్న దానిపై ప్రధాని కార్యాలయం, ఆర్థిక శాఖ మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వీటిపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని వివరించాయి. సూపర్ రిచ్ ట్యాక్స్ భయాలతో ఎఫ్‌పీఐలు అమ్మకాలకు తెగబడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. 

చిన్న స్థాయి వారికి రుణమాఫీ..
సంక్షోభంలో చిక్కుకున్న చిన్న స్థాయి రుణగ్రహీతలకు దివాలా స్మృతి (ఐబీసీ) పరిధిలో రుణ మాఫీని అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) చెందిన ఈ తరహా రుణగ్రహీతలకు రుణమాఫీ ప్రతిపాదనపై సూక్ష్మ రుణ పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. ఐబీసీలో 'ఫ్రెష్ స్టార్ట్' నిబంధన కింద ఈ మాఫీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని కింద ఒకసారి రుణ మాఫీని గానీ వినియోగించుకున్న పక్షంలో మరో అయిదేళ్ల పాటు మరోసారి ఉపయోగించుకోవడానికి ఉండదని, మైక్రోఫైనాన్స్ పరిశ్రమ ప్రయోజనాలన్నీ పరిరక్షించే విధంగా తగు జాగ్రత్త చర్యలన్నీ ఈ నిబంధనలు రూపొందించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. సొంత ఇల్లు లేకుండా ‍ఆస్తుల విలువ కేవలం రూ. 20,000 లోపే ఉండి, మొత్తం రుణాలు రూ. 35,000 దాటని మాత్రమే ఫ్రెష్ స్టార్ట్ కింద రుణ మాఫీకి అర్హులయ్యే అవకాశం ఉంది. You may be interested

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Monday 19th August 2019

బుధవారం ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశపు మినిట్స్‌ వెల్లడి శుక్రవారం జరిగే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక సదస్సులో పావెల్‌ ప్రసంగం ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్‌ ఈవారంలోనే.. ముంబై: సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తేల్చిచెప్పకపోడం, ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపే విధంగా ప్రకటనలు చేయకపోవడం వంటి నిరాశాపూరిత వాతావరణంలో గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు నష్టాలను నమోదుచేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)

లాభాల్లో డా. రెడ్డీస్‌, సన్‌ ఫార్మా

Monday 19th August 2019

దేశియ మార్కెట్‌లు సోమవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 10.04  సమయానికి 1.72 శాతం లాభపడి 7,816.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన డా. రెడ్డీస్‌ 1.93 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 1.78 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 0.48 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో సన్‌ ఫార్మా 3.54 శాతం, లుపిన్‌ 1.82 శాతం, సిప్లా 1.50 శాతం, గ్లెన్‌మార్క్‌

Most from this category