News


కార్వీపై 'ఆంక్ష'లను సమీక్షించండి

Saturday 30th November 2019
Markets_main1575086164.png-29971

  • పీవోఏపై డిసెంబర్‌ 2లోగా నిర్ణయం తీసుకోండి
  • సెబీకి శాట్‌ సూచనలు

న్యూఢిల్లీ: క్లయింట్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోనివ్వకుండా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్వీపై విధించిన ఆంక్షలను పునఃసమీక్షించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సెక్యూరిటీస్‌ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) సూచించింది. డిసెంబర్‌ 2లోగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. క్లయింట్ల షేర్లను సొంత అవసరాలకు ఉపయోగించుకుందన్న ఆరోపణలతో కార్వీపై సెబీ ఆంక్షలు విధించడం తెలిసిందే. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని, ప్రస్తుత క్లయింట్ల పీవోఏలను ఉపయోగించరాదని సెబీ హోల్‌టైమ్‌ సభ్యుడు (డబ్ల్యూటీఎం) అనంత బారువా నవంబర్‌ 22న ఇచ్చిన ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ కార్వీ గురువారం శాట్‌ను ఆశ్రయించింది. పీవోఏలను ఉపయోగించుకోలేకపోవడం వల్ల లావాదేవీల సెటిల్మెంట్‌ విషయంలో సమస్యలు వస్తున్నాయని, క్లయింట్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. పీవోఏలను ఉపయోగించడానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టతనివ్వాలని కోరింది. తరుణ్‌ అగర్వాలా, ఎంటీ జోషిలతో కూడిన శాట్‌ ద్విసభ్య బెంచ్‌ దీనిపై శుక్రవారం ఉత్తర్వులిస్తూ... కార్వీ కోరుతున్నట్లుగా సెబీ ఈ అంశాన్ని పరిశీలించాలని, సంస్థ తన వాదనలు వినిపించేందుకు అవకాశమిచ్చి.. ఆ తరవాత తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సెబీ మాజీ లీగల్‌ ఆఫీసర్‌ కేఆర్‌సీవీ శేషాచలం పార్ట్‌నర్‌గా ఉన్న విశేష లా సర్వీసెస్‌ సంస్థ ఈ కేసులో కార్వీ తరఫున వాదనలు వినిపిస్తోంది. మరోవైపు, ప్రస్తుత తరుణంలో కార్వీకి వెసులుబాటు కల్పించడమనేది మరింతగా పీవోఏల దుర్వినియోగానికి దారి తీయొచ్చని సెబీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 



You may be interested

హైదరాబాద్‌లో అగ్రిటెక్‌ సదస్సు

Saturday 30th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వ్యవసాయ సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహించే ‘అగ్రిటెక్‌ సౌత్‌ 2020 ప్రదర్శన’, ‘అగ్రి విజన్‌ 2020’ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక అవుతోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 మధ్య ఈ కార్యక్రమం జరుగనుంది. 150 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటవుతాయి. 

టాప్‌-10లో ముకేశ్‌ అంబానీ

Saturday 30th November 2019

రూ. 4.3 లక్షల కోట్ల సంపదతో 9వ స్థానం ఫోర్బ్స్‌ కుబేరుల్లో నెంబర్‌-1 జెఫ్‌ బెజోస్‌ న్యూఢిల్లీ: ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌’ తాజాగా ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 60 బిలియన్‌ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్‌’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్‌

Most from this category