News


ఇన్ఫీపై సెబీ విచారణ

Thursday 24th October 2019
news_main1571886682.png-29090

  • సీఈవో మీద ఆరోపణలపై దృష్టి
  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కోణంలోనూ దర్యాప్తు
  • విచారణకు మేనేజ్‌మెంట్‌ను పిలిచే అవకాశం

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇన్ఫోసిస్‌ షేర్లలో ట్రేడింగ్ డేటాతో పాటు డెరివేటివ్‌ పొజిషన్ల గురించిన వివరాలు ఇవ్వాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించినట్లు వివరించాయి. ఈ వివాదంపై ఇన్ఫీ టాప్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇతరత్రా కీలక వ్యక్తులను కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇన్వెస్టిగేషన్ పురోగతిని బట్టి ఆడిటింగ్ సహా ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలు చూసే బోర్డు కమిటీల నుంచి కూడా సెబీ వివరాలు తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

స్వతంత్ర డైరెక్టర్లపైనా దృష్టి...
ఈ వ్యవహారంలో ఇన్ఫీ స్వతంత్ర డైరెక్టర్ల తీరుపైనా సెబీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజావేగు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఇన్ఫీ యాజమాన్యం.. స్టాక్‌ ఎక్స్చేంజీలకు, సెబీకి సత్వరం తెలియజేసేలా, తక్షణ చర్యలు తీసుకునేలా చూడటంలో స్వతంత్ర డైరెక్టర్లు ఏ విధంగా వ్యవహరించారన్నది తెలుసుకోనుంది. మరోవైపు, ప్రజావేగు ఫిర్యాదు గురించి సత్వరం ఎందుకు తెలియజేయలేదో వివరణనివ్వాలంటూ ఇన్ఫోసిస్‌కు బుధవారం బోంబే స్టాక్ ఎక్స్చేంజీ (బీఎస్‌ఈ) సూచించింది. కంపెనీ లాభాలు పెంచి చూపించేందుకు సీఈవో సలిల్ పరేఖ్‌, సీఎఫ్‌వో నీలాంజన్‌ రాయ్‌లు అనైతిక విధానాలను అవలంబించారంటూ 'నైతిక ఉద్యోగుల బృందం' పేరిట కొందరు ఉద్యోగుల నుంచి ఇన్ఫోసిస్ బోర్డుకు ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అటు అమెరికాలోని ఆఫీస్‌ ఆఫ్‌ ది విజిల్‌బ్లోయర్‌ ప్రొటెక్షన్ ప్రోగ్రాంకు కూడా ప్రజావేగుల నుంచి ఫిర్యాదు వెళ్లింది. సోమవారం బైటికొచ్చిన ఈ వార్తలతో ఇన్ఫీ షేరు మంగళవారం భారీగా పతనమైంది. అటు అమెరికాలో క్లాస్ ‍యాక్షన్ దావా వేయనున్నట్లు రోజెన్‌ లా ఫర్మ్‌ అనే న్యాయసేవల సంస్థ ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించినట్లు సంస్థ చైర్మన్ నందన్ నీలేకని వెల్లడించారు. 



You may be interested

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,527 కోట్లు

Thursday 24th October 2019

13 శాతం వృద్ధి  3 లక్షల కోట్లు దాటిన ఆర్డర్‌ బుక్‌  ఈ క్యూ2లో 20 శాతం పెరిగిన ఆర్డర్లు  న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,230 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.2,527 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.31,087

పెట్రోల్‌ బంకుల నిబంధనలు సరళతరం

Thursday 24th October 2019

చమురుయేతర సంస్థలూ ఏర్పాటు చేయొచ్చు ప్రైవేట్, విదేశీ సంస్థలకు అవకాశాలు ఇంధన రిటైలింగ్‌లో సంస్కరణలు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశీ ఇంధన రిటైలింగ్‌ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెరతీసింది. చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తోడ్పాటు లభించనుంది. ప్రధాని నరేంద్ర

Most from this category