News


‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి సెబీ బ్రేకులు

Wednesday 25th December 2019
news_main1577244362.png-30416

  • పూల్‌ అకౌంట్ల ద్వారా లావాదేవీలు ఇక కుదరవు
  • వినియోగం నిలిపివేతకు ప్రతిపాదన
  • ట్రేడింగ్‌, మార్జిన్ల కోసం క్లయింట్ల పెట్టుబడులు తరలింపు
  • తన దృష్టికి రావడంతో సెబీ జాగ్రత్త చర్యలు

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా సెబీ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ పూల్‌ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేయాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. క్లయింట్ల పెట్టుబడులు, సెక్యూరిటీలను ట్రేడింగ్‌ ద్వారా లేదా క్లియరింగ్‌ సభ్యులు మార్జిన్ల కోసం తరలించడం.. తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లపై రుణాలు తీసుకోవడం, సెటిల్‌మెంట్లకు సర్దుబాటు చేయడం వంటి ఘటనలు తన దృష్టికి వచ్చినట్టు సెబీ మంగళవారం విడుదల చేసిన చర్చా పత్రంలో వెల్లడించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలను మధ్యవర్తులైన స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ సభ్యులు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిర్వహించినప్పుడు అవి దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని సెబీ పేర్కొంది. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి నిధులు పూల్‌ అకౌంట్లు లేదా ఎస్క్రో ఖాతాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వీటి మూలాలను అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు తెలుసుకోలేవని సెబీ గుర్తించింది. ‘‘ఫండ్స్‌ యూనిట్లు, నిధులు బ్రోకర్ల ఖాతాల నుంచి రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు లేదా ఏఎంసీల ఖాతాలకు వెళ్లాలి. ఇందుకోసం ఇన్వెస్టర్ల నిధులు మధ్యవర్తుల స్థాయిలో పూలింగ్‌ ఖాతాల్లోకి వచ్చి వెళుతుంటాయి. దీంతో ఆయా నిధుల మూలాలు, ఇన్వెస్టర్ల వివరాలు ఏఎంసీలకు తెలిసే అవకాశం ఉండడం లేదు’’ అని సెబీ పేర్కొంది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను సురక్షితంగా మార్చేందుకు స్టాక్‌బ్రోకర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిధులు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల పూలింగ్‌ను నిలిపివేయాలని ప్రతిపాదించినట్టు సెబీ వెల్లడించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తన క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్‌ అకౌంట్‌కు తరలించి వాటిపై రుణాలు తీసుకోవడం, అనంతరం చెల్లింపుల్లో సమస్య ఏర్పడడం ఇటీవలే జరిగింది. ఈ పరిణామాలతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ ఇదే తరహా రిస్క్‌ లేకుండా చూడాలన్నది సెబీ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడం... 
సెబీ తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా.. క్లయింట్లు, క్లియరింగ్‌ కార్పొరేషన్ల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు స్టాక్‌ ఎక్సేంజ్‌లు వీలు కల్పించాల్సి ఉంటుంది. ‘‘స్టాక్‌ బ్రోకర్ల ద్వారా స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో జరిగే లావాదేవీల కోసం.. ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా గుర్తింపు పొందిన క్లియరింగ్‌ కార్పొరేషన్‌కు నిధులు వెళ్లేందుకు, అలాగే క్లియరింగ్‌ కార్పొరేషన్‌ నుంచి నేరుగా క్లయింట్‌ బ్యాంకు ఖాతాకు నిధులు జమయ్యేందుకు తగిన వ్యవస్థలను స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది’’అని సెబీ తెలిపింది. అదే విధంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల కొనుగోలు, విక్రయం సందర్భాల్లో నేరుగా క్లయింట్ల ఖాతాల్లో వాటి జమ, ఉపసంహరణ ఉండాలని సెబీ ప్రతిపాదించింది. ఒకవేళ స్టాక్‌ ఎక్సేంజ్‌ల బయట జరిగే లావాదేవీలు అయితే, పూలింగ్‌ ఖాతాల వినియోగానికి అవకాశం లేకుండా ఎస్క్రో లేదా నోడల్‌ ఖాతా ద్వారా పెట్టుబడులు, ఉపసంహరణలు జరిగేందుకు అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, పూలింగ్‌ ఖాతాల అవసరం లేకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలు మరింత సాఫీగా జరిగేందుకు సూచనలను సెబీ ఆహ్వానించింది. చర్చా పత్రంపై సూచనల అనంతరం వీటిని సెబీ అమలు చేయనుంది. 

ప్రజావేగులకు ప్రోత్సాహకం...
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసుల్లో తగిన సమాచారంతో ముందుకు వచ్చిన ప్రజావేగులను ప్రోత్సహించే నూతన విధానాన్ని సెబీ రూపొందించింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిషేధ నిబంధనల కింద కనీసం రూ.కోటి రూపాయిల మేర రికవరీకి అవకాశం ఉన్న కేసుల్లో సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. అలాగే, తనకు ఏ రూపంలో సమాచారం వచ్చిందన్నది సెబీ వెల్లడించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ సమాచారం ఇచ్చిన వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతుంది. అయితే, సమాచారం ఇచ్చిన వారు తమ గుర్తింపును చూపించడం తప్పనిసరి. షేరు ధరలను ప్రభావితం చేసే సున్నిత సమాచారాన్ని కంపెనీ వాటాదారులకు వెల్లడించడానికి ముందుగా, ఆ సమచారం తెలుసుకున్న వారు కంపెనీ షేర్లలో లావాదేవీలు నిర్వహించడాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌గా పేర్కొంటారు. 



You may be interested

మారుతీ డిజైర్‌.. టాప్‌ గేర్‌...

Wednesday 25th December 2019

ఏప్రిల్‌-నవంబర్‌లో 1.2 లక్షల కార్ల విక్రయాలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల కాలంలో అత్యధికంగా అమ్ముడైన కారు మోడల్‌గా 'డిజైర్‌' నిల్చింది. ఏప్రిల్‌-నవంబర్ మధ్యకాలంలో ఈ కార్లు 1.2 లక్షల పైగా అమ్ముడైనట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ వెల్లడించింది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో డిజైర్ మార్కెట్ వాటా దాదాపు 60 శాతం దాకా ఉందని పేర్కొంది. డిజైర్‌కు ఆదరణ గణనీయంగా ఉందని, కస్టమర్ల డిమాండ్లకు అనుగుణంగా

2019లో ముకేశ్ అంబానీ సంపాదన ఎంతంటే..!?

Wednesday 25th December 2019

అక్షరాలా రూ. 1.2 లక్షల కోట్లు 2019లో పెరిగిన ముకేశ్ అంబానీ సంపద విలువ ప్రస్తుతం సుమారు రూ. 4.3 లక్షల కోట్లు అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానం న్యూఢిల్లీ: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్ డాలర్లకు చేరింది.

Most from this category