STOCKS

News


టెల్కోలపై సుప్రీం కన్నెర!

Saturday 15th February 2020
news_main1581735682.png-31806

(అప్‌డేటెడ్‌...)

  • ధిక్కరణ చర్యలుంటాయని కంపెనీ అధిపతులకు హెచ్చరిక
  • టెల్కోల అధినేతలకు సుప్రీం కోర్టు హెచ్చరిక
  • ఏజీఆర్‌ బాకీల ఉత్తర్వుల ఉల్లంఘనపై సీరియస్‌
  • టెలికం శాఖ అధికారి తీరుపై ఆగ్రహం; నోటీసు
  • సుప్రీంకోర్టును మూసేద్దామా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • మార్చి 17లోగా బకాయిలు కట్టేయాలని స్పష్టీకరణ
  • కట్టకపోతే అంతా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు


న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయీల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్‌)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్‌ డెస్క్‌ ఆఫీసర్‌ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు, డాట్‌ డెస్క్‌ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్‌ ఆఫీసర్‌ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్‌ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, టాటా టెలీసర్వీసెస్‌ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్‌ నోటీసులపై తగు న్యాయస్థానాలను ఆశ్రయించాలంటూ గెయిల్‌ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటీషన్‌లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 55,000 కోట్ల బకాయీల్లో సుమారు రూ.10,000 కోట్లు .. వారం రోజుల్లో డిపాజిట్‌ చేస్తామంటూ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

వివాదమిదీ...
లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటీషన్లను జనవరి 16 కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్‌ డెస్క్‌ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. ఇందులో రూ. 92,642 కోట్లు లైసెన్సు ఫీజులు కాగా, రూ. 55,054 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలు. 


చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా..
దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్‌కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్‌ ఆఫీసర్‌ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. "సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్‌కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు" అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్‌ ఆఫీసర్‌ తీరుపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, "ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్‌ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్‌ను డిస్మిస్‌ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. ఈ న్యాయవ్యవస్థ, ఈ దేశం, ఈ వ్యవస్థ ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది" అని మిశ్రా వ్యాఖ్యానించారు. 


టెల్కోలేమీ మా దగ్గరకు రాలేదు: ఎస్‌బీఐ
ఏజీఆర్‌ బాకీలు కట్టేందుకు అవసరమైన మొత్తాన్ని రుణంగా ఇవ్వాలంటూ టెలికం సంస్థలేవీ తమ దగ్గరకు రాలేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ తెలిపారు. డబ్బు సమకూర్చుకుని, కట్టాల్సిన బాధ్యత టెల్కోలపైనే ఉంటుందన్నారు. ఇప్పటికే ఆయా సంస్థలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకునే ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. టెలికం రంగం నుంచి ఎస్‌బీఐకి రుణాల రూపంలో దాదాపు రూ.29,000 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఒకవేళ అవి నిర్దేశిత బాకీలు గానీ చెల్లించకపోయిన పక్షంలో ఇతరత్రా మరో రూ. 14,000 కోట్లు వసూలు కావాల్సి ఉంటుందన్నారు. టెలికం రంగంలో తమ బ్యాంక్‌కు సంబంధించి రూ. 9,000 కోట్ల మేర స్థూల మొండిబాకీలు ఉన్నాయని రజనీష్‌ కుమార్‌ చెప్పారు. వీటికి పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిపామన్నారు. 


ఇక.. రెండే సంస్థలు మిగలవచ్చు.. విశ్లేషకులు
టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్‌ సంస్థ కామ్‌ ఫస్ట్‌ డైరెక్టర్‌ మహేష్‌ ఉప్పల్‌ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోరు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. 


అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ
సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా..  శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువడిన వెంటనే టెలికం శాఖ..సర్కిళ్లు, జోన్లవారీగా టెల్కోలకు డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. 


వొడా–ఐడియా షేరు పతనం
సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్‌ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. అటు ఎన్‌ఎస్‌ఈలో 22 శాతం పతనమై రూ.3.50 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్‌ వేల్యుయేషన్‌ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4.38 శాతం, ఎస్‌బీఐ 2.41 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.77 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.5 శాతం క్షీణించాయి. గురువారమే వెల్లడైన క్యూ3 ఫలితాల్లో రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించిన వొడాఫోన్‌ ఐడియాకు తాజా తీర్పు అశనిపాతంగా మారింది. You may be interested

జనాభా 130 కోట్లు .. పన్ను కట్టింది1.46 కోట్లు

Saturday 15th February 2020

కానీ ఏటా విదేశాలకు వెళుతున్న 3 కోట్ల మంది రూ.5 కోట్ల ఆదాయం దాటింది 8,600 మందే వారిలో రూ.కోటి దాటిన ప్రొఫెషనల్స్‌ 2,200 మొత్తం రిటర్న్లు వేసిన వారి సంఖ్య 5.78 కోట్లు 2018-19 ఆదాయ పన్ను రిటర్నుల్లో ఎన్నెన్ని చిత్రాలో... సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్ల ఖరీదైన కార్లు అమ్ముడుపోయాయి. రూ.కోటికి తక్కువ కాని ఫ్లాట్లు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో మూడు కోట్ల మందికిపైగా పర్యాటకం, వ్యాపారాల

ఫండ్స్‌ వలకు చిక్కిన స్మాల్‌ క్యాప్స్‌

Friday 14th February 2020

లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంలో చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక రంగ మందగమనం, ఎన్నో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో రాణించేవి లార్జ్‌క్యాప్‌ కంపెనీలే కనుక విదేశీ ఫండ్స్‌, దేశీయ ఫండ్స్‌ ఇన్నాళ్లూ ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో నాణ్యమైన స్టాక్స్‌లోనే ఎక్స్‌పోజర్‌కు మొగ్గు చూపించాయి. కానీ, ఆర్థిక వృద్ధి క్షీణత బోటమ్‌ అవుట్‌ అయిందన్న అంచనాలతో, ఇక మీదట చిన్న, మధ్య స్థాయి కంపెనీలు

Most from this category