News


టెల్కోలకు 'సుప్రీం' షాక్‌

Friday 25th October 2019
news_main1571973763.png-29121

  • ఏజీఆర్‌పై ప్రతికూల తీర్పు
  • రూ. 92వేల కోట్లు రాబట్టుకోవడానికి 
  • కేంద్రానికి అనుమతి 
  • ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై పెనుభారం

న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్‌) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్‌ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్‌ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటీషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్‌ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి.  

వివాదం...
కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 

కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్‌ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటీషన్‌ వేసే అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. ప్రైవేట్‌ టెల్కోలపై ప్రస్తుత తీర్పు పెనుభారం మోపుతుందని భారతి ఎయిర్‌టెల్‌ తెలిపింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తక్షణమే దీని ప్రభావాలను సమీక్షించాలని, టెలికం పరిశ్రమను సంక్షోభం నుంచి బైటపడేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. 

తీవ్ర నిరాశపర్చింది: సీవోఏఐ
సుప్రీం కోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దెబ్బతో ఇక టెలికం రంగం ఎప్పటికైనా కోలుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంటుందని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ వ్యాఖ్యానించారు. డిజిటల్‌ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. 



You may be interested

ఐటీసీ లాభం రూ.4,173 కోట్లు

Friday 25th October 2019

37 శాతం వృద్ధి  6 శాతం వృద్ధితో రూ.12,759 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్‌ బోర్డ్స్‌, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నష్టాలు రూ.1,062 ‍ కోట్లు

Friday 25th October 2019

31 శాతం వృద్ధితో రూ.8,540కోట్లకు ఆదాయం  -రుణ భారం రూ.19,842 కోట్లు  న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్‌

Most from this category