News


డెబిట్‌ కార్డులకు ఇక చెల్లుచీటీ..

Tuesday 20th August 2019
news_main1566276623.png-27879

  • డిజిటల్ లావాదేవీలకు మరింత ప్రోత్సాహం
  • ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌

ముంబై: డెబిట్ కార్డుల వినియోగాన్ని క్రమంగా తప్పించే దిశగా బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) క్రమంగా ప్లాస్టిక్ కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్ విధానాలను మరింతగా ప్రోత్సహించాలని భావిస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యోచిస్తోంది. సోమవారం జరిగిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ సంస్థల వార్షిక సదస్సు ఫిబాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్ కుమార్ ఈ విషయాలు తెలిపారు. "డెబిట్ కార్డులను పూర్తిగా తొలగించాలని మేం భావిస్తున్నాం. కచ్చితంగా ఇది సాధ్యమేనని విశ్వసిస్తున్నాం" అని ఆయన చెప్పారు. డెబిట్ కార్డుల రహిత దేశంగా భారత్‌ను మార్చడానికి తమ 'యోనో' వంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలు ఉపయోగపడగలవన్నారు. అసలు కార్డు అవసరమే లేకుండా యోనో ప్లాట్‌ఫాం ద్వారా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, చెల్లింపులు కూడా జరపవచ్చని ఆయన చెప్పారు.  ప్రస్తుతం దేశీయంగా 90 కోట్ల పైగా డెబిట్‌ కార్డులు, 3 కోట్ల పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. రాబోయే అయిదేళ్లలో వర్చువల్ కూపన్ల వాడకం గణనీయంగా పెరుగుతుందని, ప్లాస్టిక్ కార్డుల వాడకం పరిమిత స్థాయికి తగ్గిపోతుందని రజనీష్ కుమార్ చెప్పారు. 
    మరోవైపు, కేంద్రం గతేడాది ప్రకటించిన '59 నిమిషాల్లోనే రుణ మంజూరీ పథకం'పై చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ వాహనాలకు.. ముఖ్యంగా కార్లకు కూడా ఈ రుణాలను వర్తింపచేసే అంశాన్ని బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. రూ. 25 కోట్ల దాకా టర్నోవరు ఉండే వ్యాపారవేత్త ఈ పథకం కింద కేవలం 59 నిమిషాల్లోనే రూ. 5 కోట్ల దాకా రుణాలకు సూత్రప్రాయంగా ‍ఆమోదం పొందవచ్చని రజనీష్ కుమార్ వివరించారు. 



You may be interested

రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌

Tuesday 20th August 2019

న్యూఢిల్లీ:- బాండ్లు, కమర్షియల్‌ పేపర్‌కు సంబంధించి రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ విఫలమైంది. ఎన్‌సీడీ, కమర్షియల్‌ పేపర్స్‌కు సంబంధించి వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. ఇటీవల కాలంలో వివిధ చెల్లింపుల్లో విఫలమవుతూ వస్తున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీకి దాదాపు రూ.90,000 కోట్ల రుణభారముంది. 

బ్యాంక్‌ షేర్ల పతనం..పాజిటివ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Tuesday 20th August 2019

రూపీ విలువ డాలర్‌ మారకంలో తగ్గడంతో పాటు ప్రభుత్వం ప్రకటించనున్న ఉద్దీపన ప్యాకేజీ ఆలస్యం కానుండడంతో దేశియ మార్కెట్‌లు మంగళవారం నష్టాలో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 9.58 సమయానికి 197.50 పాయింట్లు నష్టపోయి 28042.15 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.46 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.42 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.37 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.

Most from this category