News


రూ.102 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టుల గుర్తింపు

Wednesday 1st January 2020
news_main1577848981.png-30572

(అప్‌డేటెడ్‌...)

  • ఐదేళ్లలో అమలు
  • 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: మౌలిక రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులను ‘నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు కూడా ఉండడం గమనార్హం. ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కేవలం నాలుగు నెలల్లోనే 70 భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించి రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టులను విద్యుత్‌, రైల్వేస్‌, అర్బన్‌ ఇరిగేషన్‌, మొబిలిటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో గుర్తించినట్టు చెప్పారు. మరో రూ.3లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా వీటికి తోడవుతాయన్నారు. గత ఆరేళ్లలో కేంద్రం, రాష్ట్రాలు మౌలిక రంగంపై చేసిన రూ.51 లక్షల కోట్లకు ఇది అదనమని పేర్కొన్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రాజెక్టుల్లో కేంద్రం, రాష్ట్రాల నుంచి చెరో 39 శాతం, ప్రైవేటు రంగం నుంచి 22 శాతం ఉంటాయన్నారు. ఇంధన రంగంలో రూ.25 లక్షల కోట్ల ప్రాజెక్టులు రానున్నాయని, రోడ్ల నిర్మాణంలో రూ.20 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రానున్నట్టు మంత్రి సీతారామన్‌ వివరించారు. 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (రూ.356 లక్షల కోట్లు) అవతరించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఇంధన, రోడ్లు, రైల్వేకు పెద్దపీట...
కేంద్రం గుర్తించిన ప్రాజెక్టుల్లో ఇంధనం, రోడ్లు, రైల్వే రంగాలకు అగ్ర ప్రాధాన్యం లభించింది. ఇంధన రంగంలో రూ.24.54 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుండగా, ఇందులో రూ.11.7 లక్షల కోట్లు విద్యుత్‌ ప్రాజెక్టులకు వెళ్లనున్నాయి. పట్టణ మౌలిక సదుపాయాలకు రూ.16.29 లక్షల కోట్లు, టెలికం ప్రాజెక్టులకు రూ.3.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్‌, గ్రామీణ మౌలిక ప్రాజెక్టులకు చెరో రూ.7.7 లక్షల కోట్లు దక్కనున్నాయి. ‘‘జాతీయ మౌలిక సదుపాయాల పైపులైన్‌ (ఎన్‌ఐపీ) కింద గుర్తించిన రూ.102 లక్షల కోట్ల ప్రాజెక్టుల్లో రూ.42.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.32.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు తయారీ దశలో, 19.1 లక్షల కోట్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి 22 శాఖలు, 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అమలవుతాయి’’ అని మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగం సమన్వయంతో ఎన్‌ఐపీ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులతో ఉపాధి కల్పన, జీవన సౌఖ్యం కలగడంతోపాటు, మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రావడం వల్ల సమగ్ర వృద్ధికి వీలు పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తొలి విడత వార్షిక అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమావేశం వచ్చే ఏడాది ద్వితీయ భాగంలో ఉంటుందని తెలిపారు. 

ఎన్‌ఐపీలో రంగాల వారీ ప్రాజెక్టులు
రంగం ప్రాజెక్టుల విలువ(రూ.లక్షల కోట్లు)
ఎనర్జీ 24.54
రోడ్లు 19.63
రైల్వే  13.68
పోర్టులు 1
విమానాశ్రయాలు 1.43
టెలికం 3.2
ఇరిగేషన్‌ 7.7
పట్టణ మౌలిక సదుపాయాలు 16.29
గ్రామీణ మౌలిక సదుపాయాలు  7.7
పారిశ్రామిక మౌలిక సదుపాయాలు 3.07
సోషల్‌ ఇన్‌ఫ్రా  3.56You may be interested

బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు

Wednesday 1st January 2020

ఈబీఆర్‌ ఆధారిత రేటును పావు శాతం తగ్గించిన ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ను సవరిస్తున్న ఇండియన్ బ్యాంక్‌ ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. రుణాలకు సంబంధించి ఎక్స్‌టర్నల్ బెంచ్‌ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను (ఈబీఆర్‌) 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) మేర తగ్గించింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.  కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.90

కొత్త ఏడాది తొలి రోజు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?

Wednesday 1st January 2020

నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడింగ్‌  దేశీ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాది తొలి రోజు(బుధవారం) అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా గత రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్ర నష్టంతో 12,243 వద్ద ముగిసింది.  సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా బుధవారం న్యూఇయర్‌ హాలీడే సందర్భంగా సింగపూర్‌లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ట్రేడ్‌కాదు. మరోవైపు మంగళవారం ఒడిదొడుకుల మధ్య దేశీ

Most from this category