News


రిలయన్స్‌ రిటైల్‌ @ రూ. 2.4 లక్షల కోట్లు

Friday 27th December 2019
news_main1577417496.png-30464

  • డిమార్ట్‌ కంటే డబుల్‌ 
  • షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా విలువ మదింపు 

న్యూఢిల్లీ: రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.2.4 లక్షల కోట్లు(3,400 కోట్ల డాలర్లు) అని అంచనా. రిలయన్స్‌ రిటైల్‌ వాటాదారుల కోసం రిలయన్స్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన షేర్ల మార్పిడి స్కీమ్‌ ఆధారంగా చూస్తే, రిలయన్స్‌ రిటైల్‌ విలువ రూ.2.4 లక్షల కోట్లుగా తేలుతుంది. దేశంలో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌  చెయిన్‌, డిమార్ట్‌ను ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ మార్కెట్‌ విలువ(రూ.1.20 లక్షల కోట్లు)కు ఇది దాదాపు రెట్టింపు విలువ. ఇంగ్లాండ్‌లో అతి పెద్ద సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ టెస్కో విలువ (3,200 కోట్ల డాలర్లు)కంటే కూడా అధికం కావడం విశేషం. షేర్ల మార్పిడి స్కీమ్‌లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్‌ రిటైల్‌ షేర్లకు గాను ఒక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ను పొందవచ్చని రిలయన్స్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. 

షేర్ల మార్పిడి స్కీమ్‌ ఎందుకంటే.., 
రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ తన ఉద్యోగులకు 2006, 2007 సంవత్సరాల్లో స్టాక్‌ ఆప్షన్స్‌ ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఈ ఆర్‌ఎస్‌యూ(రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు)ను   ఈక్విటీ షేర్లుగా మార్చుకున్నారు.  ఈక్విటీ షేర్లు పొందిన ఉద్యోగులు వీటిని నగదుగా మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారని రిలయన్స్‌ రిటైల్‌ వివరించింది. ఈ కంపెనీని ఇప్పటికిప్పుడు స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేసే ఆలోచన ఏదీ లేదని, అందుకే ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించింది. దీంట్లో భాగంగా ప్రతి నాలుగు రిలయన్స్‌ రిటైల్‌ షేర్లకు ఒక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ను కేటాయిస్తామని పేర్కొంది. రిలయన్స్‌ రిటైల్‌లో 99.95 శాతం వాటా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌కు ఉందని, మిగిలిన 0.05 శాతం వాటా ఉద్యోగుల వద్ద ఉందని వివరించింది.  ఈ షేర్ల మార్పిడి స్కీమ్‌కు ఆమోదం పొందడం కోసం వచ్చే నెల 23న ఈక్విటీ వాటాదారుల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపింది. 

పదివేలకు పైగా రిటైల్‌ స్టోర్స్‌...
దేశవ్యాప్తంగా 10,901 స్టోర్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ ఆదాయం ఈ ఏడాది మార్చితో ముగిసిన సంవత్సరానికి 89 శాతం వృద్ధితో రూ.1.3 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 169 శాతం ఎగసి రూ.5,550 కోట్లకు చేరింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీ... స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ కాని కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు పరోక్ష అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. గురువారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ రూ.1,516 వద్ద ముగిసింది. ఈ ధర వద్ద ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.9.6 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీని ఐదేళ్లలోపు స్టాక్‌ మార్కె‍ట్లో లిస్ట్‌ చేస్తామని ఈ ఏడాది ఆగస్టులోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. 
 



You may be interested

2019: ఐపీఓ నిధుల సమీకరణ. అంతంతే !

Friday 27th December 2019

మందగమనం ప్రభావం  ఈ ఏడాది 60 శాతం తగ్గిన ఐపీఓ నిధులు  మెరుగుపడ్డ  ఓఎఫ్‌ఎస్‌  అధ్వానంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడి  ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది.

'మిల్లీమీటర్‌' స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు

Friday 27th December 2019

వచ్చే ఏడాదే వేలానికి అవకాశం ధరపై ట్రాయ్‌తో చర్చించనున్న టెలికం శాఖ మార్చి-ఏప్రిల్‌లో విక్రయించే స్పెక్ట్రంనకు ఇది అదనం న్యూఢిల్లీ: 5జీ సర్వీసుల కోసం మరింత స్పెక్ట్రంను అందుబాటులోకి తేవడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కీలకమైన 24.75-27.25 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో స్పెక్ట్రంను విక్రయించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని వీలైతే వచ్చే ఏడాదే వేలం వేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ధర, వేలం విషయంలో పాటించాల్సిన ఇతరత్రా

Most from this category