News


టెలికం నుంచి ఆర్‌కామ్ నిష్క్రమణ

Wednesday 19th September 2018
news_main1537338811.png-20375

  • ఇక రియల్టీ వ్యాపారంపైనే దృష్టి
  • ఏజీఎంలో చైర్మన్ అనిల్‌ అంబానీ వెల్లడి

ముంబై: ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) మొత్తానికి ఆ వ్యాపారం నుంచే పూర్తిగా వైదొలగనుంది. ఇకపై భవిష్యత్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. మంగళవారం జరిగిన ఆర్‌కామ్‌ 14వ వార్షిక సాధారణ సమావేశంలో .. రిలయన్స్‌ గ్రూప్‌ (అడాగ్‌) చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అన్నింటికన్నా ముందుగా ఆర్‌కామ్‌కు ఉన్న రూ. 40,000 కోట్ల రుణభారాన్ని పరిష్కరించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ’ టెలికం రంగం భవిష్యత్‌ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రంగంలో ఇక కొనసాగరాదని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాయి. భవిష్యత్‌లో రిలయన్స్‌ రియల్టీ ఈ సంస్థకు వృద్ధి చోదకంగా ఉండనుంది’ అని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. ముంబై శివార్లలో ఉన్న 133 ఎకరాల ధీరుభాయ్‌ అంబానీ నాలెడ్జ్‌ సిటీ (డీఏకేసీ) గురించి ప్రస్తావిస్తూ.. ఈ సైట్‌ ద్వారా దాదాపు రూ. 25,000 కోట్ల మేర విలువను సృష్టించేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.

అన్న ముకేశ్‌కు థాంక్స్‌..
కంపెనీ రుణభారానికి మరికొద్ది నెలల్లో తగు పరిష్కార మార్గం లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టెలికం ఇన్‌ఫ్రా, ఫైబర్‌ వ్యాపారాలను రిలయన్స్‌ జియోకి విక్రయించే ప్రక్రియ తుది దశలో ఉందని.. ఇలాగే ఇతరత్రా విభాగాల విక్రయం తదితర చర్యలతో నిధులు సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నామని అనిల్‌ అంబానీ చెప్పారు. స్పెక్ట్రం షేరింగ్, ట్రేడింగ్‌కు సంబంధించి టెలికం శాఖ నుంచి తుది అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అప్పట్లో అవిభాజ్య రిలయన్స్‌ గ్రూప్‌ను టెలికం రంగం వైపు నడిపించడంతో పాటు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న ఆర్‌కామ్‌ అసెట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న పెద్దన్న ముకేశ్‌ అంబానీకి అనిల్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ’వ్యక్తిగతంగా నాకు, ఆర్‌కామ్‌కు, .. మార్గనిర్దేశనం చేసి, తోడ్పాటు అందించిన నా సోదరుడు ముకేశ్‌ భాయ్‌ అంబానీకి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇది సరైన సమయం’ అని అనిల్‌ పేర్కొన్నారు. టెలికం రంగంలో సృజనాత్మక విధ్వంసం జరుగుతోందని.. సాముదాయిక గుత్తాధిపత్యానికి దారి తీసిందని అనిల్‌ చెప్పారు. తర్వాత రోజుల్లో ఇది ద్విదాధిపత్యం (రెండే కంపెనీల ఆధిపత్యం), అటు పైన పూర్తి గుత్తాధిపత్యానికి కూడా దారితీయొచ్చని అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. రిలయన్స్‌ సామ్రాజ్యం విభజన అనంతరం టెలికంతో పాటు కొన్ని విభాగాలు అనిల్‌ అంబానీకి, రిఫైనరీ తదితర వ్యాపార విభాగాలు ముకేశ్‌ అంబానీకి లభించిన సంగతి తెలిసిందే. ముకేశ్‌ అంబానీ తాజాగా మళ్లీ రిలయన్స్‌ జియోతో.. టెలికం రంగంలోకి ప్రవేశించారు.

రిలయన్స్‌ రియల్టీ..
మొబైల్‌ వ్యాపార విభాగాన్ని జియోకి విక్రయించేసిన తర్వాత ఆర్‌కామ్‌ ప్రస్తుతం ఎంటర్‌ప్రైజ్, డేటా సెంటర్స్, అండర్‌సీ కేబుల్స్‌ మొదలైన వ్యాపార విభాగాల ద్వారా 35,000 సంస్థలకు సర్వీసులు అందిస్తోందని అనిల్‌ అంబానీ చెప్పారు. వీటన్నింటి నుంచి వైదొలగడంతో పాటు బ్యాంకులకు రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా ఆర్‌కామ్‌ కట్టుబడి ఉందని.. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆర్‌కామ్‌కు అనుబంధ సంస్థగా ఏర్పాటైన రిలయన్స్‌ రిటైల్‌.. నవీ ముంబైలోని డీఏకేసీని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కంపెనీకి ముప్ఫై లక్షల చ.అ.ల బిల్టప్‌ స్పేస్‌ ఉందని.. దీన్ని బహుళజాతి సంస్థలకు లీజుకివ్వనున్నామని అనిల్‌ చెప్పారు. తొలి ఏడాది నుంచే వీటిపై ఆదాయాలు రాగలవన్నారు.

మంగళవారం బీఎస్‌ఈలో ఆర్‌కామ్‌ షేరు 6 శాతం క్షీణించి రూ. 16.15 వద్ద ముగిసింది.You may be interested

లాంగ్‌టర్మ్‌ కోసం పది సిఫార్సులు

Wednesday 19th September 2018

వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో మంచి రాబడినిచ్చే బలమైన స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రికమండేషన్లు-  1. డా. రెడ్డీస్‌ ల్యాబ్‌: తొలి త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించింది. నిర్వాహక సామర్ధ్య మెరుగుదలకు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. రాబోయే కాలంలో బయోసిమిలర్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ నుంచి కొత్తగా 20 ఉత్పత్తుల లాంచింగ్‌ ఉండవచ్చు. కంపెనీ వ్యాపారం

హైదరాబాద్‌లో ఫెనటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌

Wednesday 19th September 2018

లైసెన్స్‌డ్‌ స్పోర్ట్స్‌ మర్చండైస్‌ విక్రయంలో ఉన్న ఫెనటిక్స్‌ భారత్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ వద్ద దీనిని నెలకొల్పింది. సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ నుంచి గతేడాది పొందిన సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడితో చేపట్టిన విస్తరణలో భాగంగానే భారత్‌లో ప్రవేశించామని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మ్యాట్‌ మాడ్రిగల్‌ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు రమణ తూము, సతీష్‌ ఉమాలే, జాన్‌ బెయిలీతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

Most from this category