STOCKS

News


‘దివాన్‌’... దివాలా!

Thursday 21st November 2019
news_main1574307262.png-29744

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డు రద్దు
అడ్మినిస్ట్రేటర్‌ నియామకం

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు మాజీ ఎండీ ఆర్‌ సుబ్రమణియకుమార్‌ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్‌) నియమించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలను (హెచ్‌ఎఫ్‌సీలు) దివాలా చర్యల కోసం ప్రతిపాదించే అధికారాన్ని ఆర్‌బీఐకి కట్టుబెడుతూ కేంద్ర సర్కారు గత వారంలో ఆదేశాలు తీసుకురాగా, వెంటనే ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘పాలనా సంబంధిత ఆందోళనలు, రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేసింది’’అని ఆర్‌బీఐ తన ప్రకటనలో వివరించింది. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కథ ఇదీ..
హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను రాజేష్‌ కుమార్‌ వాధ్వాన్‌ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి  వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. దివాన్‌ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌గాను ఆ తర్వాత దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌గాను పేర్లు మార్చుకుంది. దేశీయంగా 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఏకంగా రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మళ్లించిందంటూ 2019 జనవరిలో కోబ్రాపోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. అయితే, జూన్‌లో జరపాల్సిన రుణ చెల్లింపు విషయంలో డిఫాల్ట్‌ కావడంతో సంస్థపై సందేహాలు తలెత్తాయి.  2018 మార్చిలో ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు రూ. 10,167 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది జులై 6 నాటి గణాంకాల ప్రకారం ఇవి రూ. 6,188 కోట్లకు పడిపోయాయి. మొత్తం రుణభారం రూ. 83,873 కోట్లు కాగా.. ఇందులో బ్యాంకులకు చెల్లించాల్సినది రూ. 38,342 కోట్లుగా అంచనా. 

 

హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో ఒకానొక అగ్రగామి సం‍స్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ చాలా స్వల్ప వ్యవధిలోనే ఆర్థిక కష్టాల్లో నిండా కూరుకుపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ సంస్థ డెట్‌ పేపర్లను గడువు తేదీన చెల్లింపులు జరపలేదన్న కారణంతో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ విక్రయించడంతో కంపెనీలో ఏదో జరుగుతోందన్న వార్తలు గుప్పుమన్నాయి. అప్పుడే షేరు ధర భారీగా నష్టపోయింది. కానీ, కంపెనీ ప్రమోటర్లు అంతా పారదర్శకమేనని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ ఏడాది జనవరిలో కోబ్రాపోస్ట్‌ కథనం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలో అక్రమాల గుట్టును వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రమోటర్లు ఏం లేదని నమ్మబలికే ప్రయత్నం చేసినప్పటికీ.. సుమారు రూ.20,000 కోట్లు దారిమళ్లించినట్టు ఇటీవలే ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెలుగు చూసింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మొత్తం మీద రూ.లక్ష కోట్లకు పైగా రుణ బకాయిలతో ఉంది. ఇందులో బ్యాంకుల వాటాయే 38 శాతం. కాగా, మిగిలిన మొత్తం డెట్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కంపెనీలు, డిపాజిట్‌ దారులకు చెల్లించాల్సినది. ప్రభుత్వరంగ బ్యాంకులు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఎక్కువగా రుణాలు ఇచ్చి ఉన్నాయి. ఒక్క ఎస్‌బీఐకే రూ.10,000 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. 

2018 సెప్టెంబర్‌ 21: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ జారీ చేసిన డెట్‌ పేపర్లు రూ.300 కోట్ల విలువైన వాటిని సెకండరీ మార్కెట్లో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ విక్రయించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న ఆరోపణలు వచ్చాయి. 
2019 జనవరి 29: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు వారికి సంబంధించిన షెల్‌ కంపెనీలకు రుణాలు ఇవ్వగా, ఆ నిధులను దేశీయంగా, విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రమోటర్లు వినియోగించినట్టు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘కోబ్రాపోస్ట్‌’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. యథావిధిగా దీన్ని సైతం కంపెనీ ఖండించింది.
జనవరి 30: కోబ్రాపోస్ట్‌ ఆరోపణలు అవాస్తవం, హానికారకమని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రకటించింది. షెల్‌ కంపెనీల ద్వారా నిధుల మళ్లించారన్న ఆరోపణలను కొట్టిపడేసింది.
జనవరి 31: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ఆరోపణలపై విచారణ మొదలు పెట్టిన కార్పొరేట్‌ శాఖ. 
ఫిబ్రవరి 4: కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను విక్రయించడం ద్వారా నిధుల లభ్యతను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఫిబ్రవరి 11: కొన్ని ఖాతాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ. 
ఫిబ్రవరి 13: కంపెనీ సీఈవో హర్షిల్‌ మెహతా రాజీనామా
మార్చి 6: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నుంచి నిధులను దారి మళ్లించేందుకు షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఖండించిన కంపెనీ ఆడిటర్‌. 
మార్చి 7: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన పలు డెట్‌ ఇనుస్ట్రుమెంట్ల రేటింగ్‌ను రేటింగ్‌ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో షేరు ధర మరింతగా క్షీణించింది. 
మే 21: ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల స్వీకరణ, రెన్యువల్‌ను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిలిపివేసింది. అప్పటికే ఉన్న డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడాన్ని కూడా నిలిపివేసింది.
మే 30: 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆడిటెడ్‌ కన్సాలిడేటెడ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ను నిబంధనలకు లోబడి నిర్ణీత సమయంలోపు సమర్పించలేకపోతున్నట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
జూన్‌ 4: రూ.960 కోట్ల మేర బాండ్లపై వడ్డీ చెల్లింపులు, బాండ్ల చెల్లింపుల్లో విఫలమైంది. 
జూన్‌ 5: ఇక్రా, క్రిసిల్‌, కేర్‌, బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ సంస్థలు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన కమర్షియల్‌ పేపర్ల రేటింగ్‌ను డీ (డిఫాల్ట్‌) రేటింగ్‌కు తగ్గించేశాయి. 
జూన్‌ 7: 750 కోట్ల కమర్షియల్‌ పేపర్లకు చెల్లింపుల్లో విఫలమైంది.
అక్టోబర్‌ 10: అన్‌సెక్యూర్డ్‌ క్రెడిటర్లు, డిపాజిట్‌ హోల్డర్లకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఎటువంటి చెల్లింపులు చేయకుండా బోంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.   
నవంబర్‌ 1: నిధుల దారి మళ్లింపునకు ఆధారాలు ఉండడంతో తీవ్ర నేరాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు కార్పొరేట్‌ శాఖ ఆదేశం. 

చెల్లింపుల ప్రణాళిక
రుణ బకాయిల చెల్లింపునకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఓ ప్రణాళికను సిద్ధం చేసింది. రిటైల్‌ రుణ గ్రహీతల నుంచి వచ్చే చెల్లింపులతో ముందుగా  రూ.34,800 కోట్లను తీర్చివేయడం ఇందులో భాగం. 2034-35 నాటికి రిటైల్‌ రుణ గ్రహీతల నుంచి మొత్తం రూ.52,600 కోట్లు తిరిగి రావాల్సి ఉందని కంపెనీ పేర్కొంది. అలాగే, రుణదాతలు కంపెనీలో వాటాలు తీసుకునే విధంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించారు. అయితే, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు ఇందుకు సానుకూలంగా లేకపోవడంతో అది ముందుకు సాగలేదు.
రుణదాతల మధ్య కుదరని అంగీకారం
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విషయంలో రుణదాతలు అందరూ కలసి ముందుకు సాగాలన్నది బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల అభిమతం. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రతిపాదిత పరిష్కార ప్రణాళికపై సంతకం చేవాయి. కానీ, కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు ఈ విషయంలో అభ్యంతరాలున్నాయి. ఇప్పటికే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు వ్యతిరేకంగా కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు బోంబే హైకోర్టును కూడా ఆశ్రయించాయి. నిప్పన్‌ ఇండియా ఏఎంసీ, ఎడెల్‌వీజ్‌, ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌, ఎయిర్‌ ఇండియా ఉద్యోగుల ఇన్సూరెన్స్‌ సొసైటీ తమ బకాయిల వసూలు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాయి. దీంతో రుణదాతల్లో ఏ ఒక్కరూ ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు గాను మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కూడా తమతో కలసి సాగాలని బ్యాంకులు కోరుకుంటున్నాయి. You may be interested

హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

Thursday 21st November 2019

ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసింది. వైర్‌లెస్‌ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సహకారంతో దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సంస్థల నూతన డిజిటల్‌ అవసరాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, 5జీ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని డొమెయిన్‌ ఆధారిత పరిష్కారాలను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం, వాహన, తయారీ, చిల్లర వర్తకం

ఫోర్బ్స్‌ ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌లో ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!

Thursday 21st November 2019

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మేగజీన్‌..  ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019’లో మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్‌ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి

Most from this category