News


యస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ రుణ సదుపాయం

Friday 20th March 2020
news_main1584676291.png-32584

-అత్యవసరాల కోసం అందుబాటులో రూ. 60వేల కోట్లు
- డిపాజిట్లపై ఖాతాదారులకు అడ్మినిస్ట్రేటర్ భరోసా 
- చెల్లింపులకు తగినన్ని నిధులు ఉన్నాయని వెల్లడి

మారటోరియంపరమైన ఆంక్షలు తొలగి, పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభించిన యస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరమైన పక్షంలో తోడ్పాటునిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. సుమారు రూ. 59,000 కోట్ల మేర రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. డిపాజిట్‌దారులకు చెల్లింపులు జరపడంలో సమస్యలు తలెత్తకుండా యస్‌ బ్యాంక్‌కు ఇది తోడ్పడుతుంది. అయితే, దీనిపై యస్‌ బ్యాంక్‌ సాధారణంగా కంటే ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2004లో గ్లోబల్ ట్రస్ట్‌ బ్యాంక్‌ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా ఆర్‌బీఐ ఇదే తరహా రుణ సదుపాయం కల్పించింది. అటుపై 16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. అప్పట్లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకును ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేశారు. గడిచిన కొన్నాళ్లుగా విత్‌డ్రాయల్స్‌ కన్నా డిపాజిట్లే అధికంగా ఉన్నాయని, యస్ బ్యాంక్ ఇప్పటిదాకానైతే రుణ సదుపాయం వినియోగించుకోలేదని .. అసలు ఆ అవసరం కూడా రాకపోవచ్చని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఖాతాదారుల సొమ్ము భద్రంగానే ఉందని యస్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్‌ ప్రశాంత్ కుమార్ మరోసారి భరోసానిచ్చారు. బ్యాంకు వద్ద తగినన్ని నిధులు ఉన్నాయని, బైటి వనరులపై ఆధారపడాల్సిన అవసరం లేదని తెలిపారు. 
    రుణ వితరణలో లొసుగులు,  మొండిబాకీలు, నిధుల కొరతతో సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌పై మార్చి 5న ఆర్‌బీఐ మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు పెట్టుబడులు పెట్టడంతో బుధవారం నుంచి యస్ బ్యాంక్ కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. 

పూరి జగన్నాథుని డిపాజిట్లు ఎస్‌బీఐలోకి మళ్లింపు
పూరి జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన రూ. 389 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాను ఎస్‌బీఐకి బదలాయించినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. ఈ ఎఫ్‌డీపై రూ. 8.23 కోట్ల మేర వడ్డీ జమైనట్లు వివరించింది. మరో రూ. 156 కోట్ల రెండు ఎఫ్‌డీలను ఈ నెలాఖరులోగా బదలాయించనున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్‌కు యస్‌ బ్యాంక్ లేఖ రాసింది. 

ఈడీ విచారణకు అనిల్ అంబానీ
యస్ బ్యాంక్ ప్రమోటరు రాణా కపూర్‌ తదితరులపై మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఆయన్ను దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.  అంబానీ గ్రూప్‌నకు చెందిన తొమ్మిది కంపెనీలు యస్ బ్యాంక్ నుంచి రూ. 12,800 కోట్ల మేర రుణాలు తీసుకున్నాయి. ఈ రుణాలు మొండిపద్దులుగా మారే పరిస్థితులున్నాయి. బడా కార్పొరేట్లకు యస్ బ్యాంక్ ద్వారా రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు రూ. 4,300 కోట్ల పైగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు,  మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రకు ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. వాస్తవానికి మార్చి 18నే ఆయన రావాల్సి ఉన్నప్పటికీ పా‍ర్లమెంటు సమావేశాల కారణంతో హాజరు కాలేదు.You may be interested

ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

Friday 20th March 2020

- అదనంగా వెయ్యి డాలర్లు - ఫేస్‌బుక్‌ వెల్లడి  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్‌ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్

సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌!

Friday 20th March 2020

కోలుకున్న ప్రపంచ మార్కెట్లు అమెరికా, యూరప్‌ ఇండెక్సులు 1-2% అప్‌ ఆసియా మార్కెట్లు 1-3 శాతం లాభాల్లో నామమాత్ర నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో నామమాత్ర నష్టంతో 8,207 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,211 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే

Most from this category