News


పీఎంసీ బ్యాంకుపై ఆంక్షల సడలింపు

Friday 27th September 2019
news_main1569557189.png-28575

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు)పై తన ఆంక్షలను ఆర్‌బీఐ సడలించింది. ఒక్కో ఖాతా నుంచి కేవలం రూ.1,000 వరకే ఉపసంహరణకు లోగడ అవకాశం ఇవ్వగా, తాజాగా ఈ పరిమితిని రూ.10,000కు పెంచింది. దీంతో 60 శాతం మంది కస్టమర్లకు ఉపశమనం లభించినట్టయింది. ఎందుకంటే వీరి ఖాతాల్లో బ్యాలన్స్‌ రూ.10,000లోపే ఉంటుంది. వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) అధికంగా ఉండడం, నిబంధనల ఉల్లంఘనను గుర్తించడంతో ఆరు నెలల పాటు ఈ బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలను విధిస్తూ మూడు రోజుల క్రితం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రతీ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతా లేదా కరెంటు ఖాతా లేదా మరే ఇతర డిపాజిట్‌ అకౌంట్‌ నుంచి రూ.10,000కు మించకుండా ఉపసంహరణకు అనుమతించాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గురువారం నాటి ఆదేశాల్లో పేర్కొంది. 
పీఎంసీ బ్యాంకుపై పోలీసు కేసు
పీఎంసీ బ్యాంకు చైర్మన్‌, డైరెక్టర్లకు వ్యతిరేకంగా కొందరు కస్టమర్లు సంయుక్తంగా గురువారం సెంట్రల్‌ ముంబైలోని సియాన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసినట్టు వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు. పీఎంసీ బ్యాంకు చైర్మన్‌, డైరెక్టర్లు మొత్తం 14మంది పేర్లను వారు అందులో పేర్కొన్నారు. వీరిపై తగిన చర్య తీసుకోవాలని, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకోవడం ద్వారా దేశం వీడిపోకుండా చూడాలని కోరారు. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు కొందరి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, పరిశీలన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి తెలిపారు. 
ప్రతీ రూపాయి భద్రమే: జాయ్‌థామస్‌
డిపాజిట్‌, ఖాతాదారుల ఆందోళనను పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్‌ థామస్‌ తొలగించే ‍ప్రయత్నం చేశారు. బ్యాంకు వద్ద తగినంత లిక్విడిటీ ఉందని, అన్ని రకాల చెల్లింపు బాధ్యతలను నెరవేర్చగలదన్నారు. కస్టమర్‌కు చెందిన ప్రతీ రూపాయి భద్రంగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద ఖాతా అయిన హెచ్‌డీఐఎల్‌ ఒక్కటే ప్రస్తుత సంక్షోభానికి కారణమని, ఆర్‌బీఐ ఆంక్షలకు దారితీసినట్టు తన ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్‌డీఐఎల్‌ ఖాతాకు సంబంధించి ఎన్‌పీఏలను తక్కువగా చూపించడమే సమస్యకు కారణమని వివరించారు. ‘‘మేము చూపించినదానికి, వాస్తవ గణాంకాలు మధ్య అంతరం ఉంది. గత కొంత కాలంxe హెచ్‌డీఐఎల్‌ నుంచి చెల్లింపుల్లో జాప్యం నెలకొనడం సమస్యకు దారితీంది. హెచ్‌డీఐఎల్‌ తన ఆస్తులను విక్రయించే విషయంలో పురోగతిలో ఉంది. అందుకే సమస్య నుంచి త్వరలోనే బయటపడతామని చెబుతున్నాం’’అని థామస్‌ తెలిపారు. తమ టర్నోవర్‌లో సగం హెచ్‌ఐడీఎల్‌ నుంచే వస్తోందని, అందుకే టాప్‌-5లో పీఎంసీ కూడా ఒకటిగా నిలవగలిగినట్టు పేర్కొన్నారు. అయితే, హెచ్‌డీఐఎల్‌కు ఎంత రుణమిచ్చినదీ వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇతర రుణాలన్నీ పూర్తి సురక్షితంగానే ఉన్నాయని, ఏ కస్టమర్‌ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘తగినంత లిక్విడిటీ ఉంది. ప్రతీ రుణానికి సెక్యూరిటీల హామీ ఉంది. కోపరేటివ్‌ బ్యాంకు అయిన పీఎంసీ అన్‌సెక్యూర్డ్‌ రుణాలను ఇవ్వడం లేదు. రుణ కవరేజీ నిష్పత్తి 100-110 శాతంగా ఉంటుంది’’అని జాయ్‌ థామస్‌ వివరించారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోకు సంబంధించి రూ.4,000 కోట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రతీ ఖాతా నుంచి విత్‌డ్రాయల్‌ పరిమితిని రూ.15,000కు పెంచాలని ఆర్‌బీఐని కోరినట్టు వెల్లడించారు. You may be interested

‘సార్టప్‌ ఇండియా’ను వాడుకోండి...

Friday 27th September 2019

ప్రపంచ సవాళ్లకు ఇదో చక్కని పరిష్కార వేదిక... గ్లోబల్‌ సీఈఓలకు ప్రధాని మోదీ సూచన... మోదీ ప్రసంగానికి కార్పొరేట్‌ దిగ్గజాల కితాబు న్యూయార్క్‌: ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లకు ‘స్టార్టప్‌ ఇండియా’ను ఒక పరిష్కార వేదికగా ఉపయోగించుకోవాలని గ్లోబల్‌, అమెరికా దిగ్గజ సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ముఖ్యంగా పోషకాహారం, వర్థాల నిర్వహణ వంటి అంశాల్లో నెలకొన్న సవాళ్లకు స్టార్టప్‌ ఇండియా నుంచి వస్తున్న నవకల్పనలు చేదోడునందిస్తాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి వార్షిక

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రూపంలో విదేశాలకు నల్లధనం తరలింపు

Friday 27th September 2019

అంధేరీలోని ఓ కంపెనీ నిర్వాకం న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల నేపథ్యంలో... ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ అంధేరీ ప్రాంతం నుంచి గత 20 ఏళ్లుగా నడుస్తూ... మిలియన్ల డాలర్లను స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో తనకున్న విదేశీ సంస్థల ద్వారా డిపాజిట్‌ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దర్యాప్తు

Most from this category