STOCKS

News


ఆర్‌బీఐ మరోసారి వడ్డీ రేట్లు తగ్గిస్తే మంచిది : నిర్మల సీతారామన్

Monday 29th July 2019
Markets_main1564386778.png-27379

ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్‌బీఐ మరో సారి వడ్డీ రేట్లు తగ్గింపు అవసరమని తాను భావిస్తున్నానని, ఆటోమొబైల్ రంగంలో తిరోగమనంతో సహా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మల సీతారామన్  ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆమె మాటల్లోనే..

అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తున్నాం..
అంతర్జాతీయంగా డిమాండ్‌ ఆందోళనలున్నాయి. ఐఎంఎఫ్‌(ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌), ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ తమ అంచనాలను తగ్గించుకున్నాయి. ఈ  పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తున్నాం. సమయానికి ప్రభుత్వం వైపు నుంచి సరియైన చర్యలుంటాయి. అంతర్జాతీయంగా వ్యతిరేక పవనాలున్నప్పటికి ఇండియా బాగానే రాణిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగించినప్పటికి దేశియ వృద్ధి రేటు అంచనాలు 7 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా చూడగలిగాం. ఈ అంచనాలు కూడా ఐఎంఎఫ్‌ వేసినవే. 

ఎఫ్‌పీఐలను టార్గెట్‌ చేయలేదు..
ప్రభుత్వం విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) లను ఉద్దేశ పూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం 2 కోట్లు, 5 కోట్లకు పైగా  ఆదాయాల కోణం నుంచి సర్‌చార్జిని పెంచాలనుకున్నాం. అయితే ఇది ట్రస్టులుగా నమోదు చేయబడిన ఎఫ్‌పిఐలపై ప్రభావం చూపింది. ట్రస్టులుగా నమోదు చేసుకున్న ఎఫ్‌పిఐలు కంపెనీలుగా రావాలనుకుంటే సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మే-జూన్ నెలల్లో దేశంలోకి ఎఫ్‌పిఐ ప్రవాహం చాలా ఎక్కువగా ఉందని, ఈ సర్‌చార్జ్ కారణంగా తీవ్రంగా పడిపోలేదని తెలియడం ప్రోత్సహిస్తున్నప్పటికీ, వీరినే లక్ష్యంగా చేసుకోలేదని ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.  సర్‌చార్జీ విషయంపై పునరాలోచన చేస్తే ఎఫ్‌పిఐలకు మాత్రమే రాబడుల్ని చూస్తున్నారా? అప్పుడు దేశీయ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి? ఈ ఇరువురి మధ్య వ్యత్యాసం చూపడం వలన ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలన్ని వెలువడతాయి. కాబట్టి సర్‌చార్జీల పునరాలోచన విషయాన్ని  ప్రస్తుతానికి పక్కన పెడదాం.
   ఎఫ్‌ఐఐలను టార్గెట్‌ చేశామనే వాదనా తీసుకొచ్చారు. నా ఉద్దేశంలో ఇది అసలు వాదన కూడా కాదు. 2 కోట్లు, 5 కోట్ల ఆదాయానికి మించిన వారిపై మాత్రమే సర్‌చార్జీలను విధించాలనే ఉద్దేశంతో దీనిని ప్రతిపాదించాం. ఒక వేళ ట్రస్టీలుగా నమోదయితే ఇండియాలో ఎటువంటి నియమాలున్నాయో వాటిని పాటించాల్సిందేగా.  ఎఫ్‌ఐఐలు సర్‌చార్జినీ తప్పించుకోవాలంటే ట్రస్టులను కార్పోరేట్స్‌గా నమోదుచేసుకుంటే సరిపోతుంది. ఈ మార్పిడి శ్రమతో కూడుకున్నదా లేక  మారినప్పటికి పన్నులు తటస్థం‍గా ఉండవు కదా అనే వాదనలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. వీరిని టార్గెట్‌ చేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదు. ఒక వేళ మార్పిడి ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా వాటిని ప్రభుత్వం వింటుంది.

రేట్ల కోత చాలా మంచింది...
ఆర్బిఐ రేట్ల కోత ఇంకోసారి ఉండాలని కోరుకుంటున్నాను. రేటు తగ్గింపు దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది. ఇప్పటికే ఆర్బిఐ దాదాపు 75 బిపిఎస్ (బేసిస్ పాయింట్స్) రేట్ కట్ చేసిన విషయం తెలిసిందే. ఇంకోసారి రేట్ల కోత కోసం ఆశతో వేచిచూడాలి. 

ఆటో రంగ సమస్యలపై ఆలోచిస్తున్నాం..
ఆటో రంగం గురించి,  దీని డిమాండ్ సరళి గురించి, ఒక రకమైన తిరోగమనం గురించి ఆలోచిస్తున్నాం. ఈ రంగం సంక్షొభంలో ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయినప్పటికి ఇది తిరిగి పుంజుకోడానికి చేయూతనిస్తాం. జనవరి 1, 2020 నుంచి భారత్‌ స్టేజ్‌ VI అమలులోకి రానుంది. అందువలన కొనుగోలుదారులు అప్పటి వరకు వేచి ఉండాలనే దృక్పథంలో ఉన్నారు. జనవరి 1 తర్వాత నుంచి ఈ బీఎస్‌ VI వాహనాల విక్రయాలు పెరగడానికి ఈ రంగం ఎటువంటి రాయితీలు ప్రకటిస్తుందో చూడాలి.   ఈ రంగం జిడిపి వృద్ధి, ఉపాధి కల్పనలో గణనీయంగా దోహదపడుతోంది. ఈ రంగానికి చేయూతనివ్వడానికి ఏం చేయగలమో పరిశీలిస్తాం. 

మందగమనాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్నాం..
ఆర్థిక మందగమనాన్ని ఒకే దశలో తగ్గించలేకపోవచ్చు. ఇది ప్రతి పరిశ్రమకు అనుగుణంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా మనం ఏర్పాటు చేసుకున్న ఆర్థిక క్రమశిక్షణను పాటించడం చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం అటువైపే అడుగులు వేసింది. బడ్జెట్‌లో తీసుకొచ్చిన అంశాలాధారంగా పరిశ్రమలు ప్రభుత్వం ఉద్ధేశాన్ని అర్థం చేసుకుంటాయని అనుకుంటున్నా. కార్పొరేట్ పన్నులో సమస్యలను పరిష్కరించాం. అది కూడా ఆర్థిక క్రమశిక్షణలో భాగంగానే చేశాం. ఇచ్చిన కమిట్‌మెంట్లను కొనసాగించడం, ఇంతకుముందు చెప్పిన వాటిని నెరవేర్చడం, ఇండియాలో వ్యాపారాన్ని మరింత తేలికగా చేయడం వంటి ఈ ప్రభుత్వ ఉద్దేశాలను పరిశ్రమలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నా. 
   ఒత్తిడిలో ఉన్న రంగాలకు ప్రోత్సాహకాలను ఇచ్చి ఆ రంగాలు తిరిగి పుంజుకునేలా చేయడమే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానం. గత పదవీకాలంలో టెక్స్‌టైల్స్‌, పుట్‌వేర్‌ రంగంలో ఇటువంటి ప్రయత్నాన్ని చూశారు. ఈ పదవీకాలంలో కూడా  ఆ రంగాలకు మద్దతును స్థిరంగా కొనసాగిస్తున్నాం. మా ‍ప్రభుత్వ మొదటి 100 రోజుల్లో మా ఉద్దేశాలను చాలా స్పష్టంగా ప్రకటించాం. ఎగుమతుల ఆధారిత రంగాలకు, అధికంగా ఉద్యోగ కల్పన చేసే రంగాలకు, మధ్యస్థ, చిన్న పరిశ్రమ ఆధారిత రంగాలకు మా మద్దతు ఉంటుం‍ది. చిన్న, మధ్య తరహా రంగాలకు బ్యాంక్‌లు ద్వారా రుణాలు అందించి​కూడా మద్దతు ఇస్తున్నాము. ఎన్‌బీఎఫ్‌సీ (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) సంక్షోభానికి మా ప్రతిస్పందనగా బడ్జెట్లో చాలా అంశాలు కనిపించాయి.  చిన్న, మధ్యతరహా పరిశ్రమల లిక్విడిటీ అవసరాలను తీర్చడానికి ఎన్‌బీఎఫ్‌సీ కీలకమైంది. స్థూల, విస్తృత కోణంలో ఎస్‌ఎంఈలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్న సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. 

ఆర్‌బీఐ కూడా ఏకాభిప్రాయంతో ఉంది..
ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ లిక్విడిటీ సంక్షోభం సమస్యపై చాలా స్పష్టంగా మాట్లాడటం చాలా సంతోషంగా అనిపించింది. ప్రభుత్వంతో పాటు ఆర్‌బిఐ కూడా వ్యవస్థలో లిక్విడిటీ సమస్యలేదనే అంశంపై ఏకాభిప్రాయంతో ఉన్నాయి. లిక్విడిటీ అందుబాటులో ఉండేలా చూస్తామని ఆర్‌బిఐ భరోసా ఇచ్చింది. ఎన్‌బీఎఫ్‌సి వంటి సంస్థలు దీన్ని మరింతగా పెంచి తుది వినియోగదారుకు అందించడం ఇప్పుడు ముఖ్యం.  ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు  క్రెడిట్-అర్హత గల హక్కుదారులకు రుణాలివ్వడం కోసం వెతుకుతున్నాయి. అంతేకాకుండా అలాంటి వారిని పొందడం కష్టంగా అనిపిస్తోంది. ఫలితంగా ద్రవ్య కొరత ఏర్పడుతోంది. సులభంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా ద్రవ్య సంక్షోభం కాదు, కానీ నిజమైన రుణగ్రహీతలకు ద్రవ్యతను అందించే సంక్షోభం.

ట్యాక్స్‌ టెర్రరిజం లేదు...
పన్ను లక్ష్యాలు అసాధ్యమయినవి కావు. ఈ విషయంపై ఆదాయపు పన్ను దినోత్సవ కార్యక్రమంలో కూడా మాట్లాడా. ఈ లక్ష్యాలను స్వయంగా పన్ను శాఖ ‍కూడా అంగీకరించింది. ఇది ట్యాక్స్‌ టెర్రరిజానికి దారితీయదని నా నమ్మకం. సాధ్యమయ్యే చోట వివరణ కోరడం లేదా సమాచారాన్ని పొం‍ది చర్యలను ప్రారంభించడానికి అధిక సమయాన్ని కేటాయిస్తున్నా.  దేశమంతటా తిరిగి అన్ని రకాల వ్యక్తులతో, వివిధ రంగాలతో, సమాజంలోని అన్ని వర్గాలతో కలిసి పన్ను లక్ష్యాలపై అడగాలని రెవెన్యూ కార్యదర్శికి ప్రతిపాదించాను. ఇది కలిసి వస్తుందని భావిస్తున్నా.   ఒక పరిష్కారాన్ని ప్రతి మండలంలోని ప్రజలకు అందించగలిగితే మంత్రిత్వ శాఖలో జవాబుదారీతనం పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను ఆగస్టు 2 నుంచి ప్రారంభించాల్సి ఉంది. కాని, పార్లమెంటు సమావేశాలు పొడిగించినందున దీనిని వాయిదా వేశాం. ఆదాయపు పన్ను అధికారులతో లేదా కస్టమ్స్‌తో వేర్వేరు మండలాలకు వెళతాను,  పన్ను చెల్లింపుదారులందరితో మాట్లాడతాను. ఈలోగా, అధికారులు  ఇ-ప్లాట్‌ఫామ్ ద్వారా వివరణలు లేదా సమాధానాలు పొందాలని ఆదేశాలిచ్చాను. 

 You may be interested

నిఫ్టీ 100 పాయింట్లు క్రాష్‌

Monday 29th July 2019

364 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో మార్కెట్‌ నష్టాల పరంపర కొనసాగతుంది.  సోమవారం మిడ్‌సెషన్‌ కల్లా సెనెక్స్‌ 300 పాయింట్లను, నిఫ్టీ 100 పాయింట్లను కోల్పోయాయి. అటో, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్‌ నష్టాలకు ప్రధాన కారణమవుతోంది. ఇటీవల క్యూ1 ఫలితాలను ప్రకటిస్తున్న దేశీయ కార్పోరేట్‌ కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల

ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

Monday 29th July 2019

- ఈ ఏడాదే 3-4 బ్యాంకులు పబ్లిక్ ఇష్యూకి వచ్చే అవకాశం న్యూఢిల్లీ: ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కొన్నింటిని స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3-4 ఆర్‌ఆర్‌బీల పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 45 దాకా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్యను విలీన ప్రక్రియ

Most from this category