News


ఈసారి మళ్లీ లాభాల్లోకి ..

Wednesday 3rd October 2018
news_main1538542466.png-20809

తిరువనంతపురం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని, వృద్ధి బాట పట్టగలమని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకును ముంచేసిన నీరవ్ మోదీ స్కామ్ ఇక ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రూ.13,000 కోట్ల మోదీ స్కామ్‌తో కుదేలైన పీఎన్‌బీ .. ఇంకా ఆ ప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మెహతా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.12,282 కోట్ల నష్టం ప్రకటించిన పీఎన్‌బీ.. జూన్ క్వార్టర్‌లో మరో రూ.940 కోట్ల నష్టం నమోదు చేసింది. బాకీలు రాబట్టుకునేందుకు తీసుకుంటున్న వివిధ చర్యల ఊతంతో 2018-19లో బ్యాంకు మళ్లీ లాభాల్లోకి రాగలదని మెహతా చెప్పారు. పీఎన్‌బీ క్రమంగా వృద్ధి బాట పడుతోందని.. రుణ వృద్ధి ఊపందుకోవడంతో పాటు పరిశ్రమ సగటు స్థాయిని కూడా మించిందని ఆయన వివరించారు. వరద బాధితుల సహాయార్ధం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు రూ. 5 కోట్ల విరాళం అందించిన సందర్భంగా మెహతా ఈ విషయాలు తెలిపారు. ‍
కార్యకలాపాల విస్తరణ కోసం ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా కేంద్రం నుంచి రూ. 5,431 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఇటీవలే ఇచ్చిన రూ. 2,816 కోట్లు.. మూలధనానికి సంబంధించి నియంత్రణ సంస్థల పరమైన నిబంధనల పాటింపునకు ఉద్దేశించినవని మెహతా చెప్పారు. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు కేంద్రం అందించనున్న రూ.65,000 కోట్లలో పీఎన్‌బీకి రూ.8,247 కోట్లు లభించగలవని ఆయన వివరించారు. ‍అక్టోబర్ 30న అసాధారణ సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల నుంచి, ఆ తర్వాత నియంత్రణ సం‍స్థల నుంచి ఆమోదం లభించాక బ్యాంకుకు నిధులు అందనున్నాయని మెహతా పేర్కొన్నారు.



You may be interested

గంటకు 15 డాలర్లు!

Wednesday 3rd October 2018

సియాటిల్: ఆన్‌లైన్‌ రిటైల్ దిగ్గజం అమెజాన్‌.. అమెరికాలోని తమ సిబ్బంది కనీస వేతనాలను పెంచింది. వచ్చే నెల నుంచి గంటకు 15 డాలర్ల (సుమారు రూ.1,050) చొప్పున కనీస వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 3,50,000 మంది ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌, తాత్కాలిక ఉద్యోగులకు దీనితో ప్రయోజనం చేకూరనున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఇప్పటికే గంటకు 15 డాలర్ల వేతనం పొందుతున్నవారికి కూడా తగు స్థాయిలో పెంపు ఉంటుందని తెలిపింది. కంపెనీలో పై

బీమా బ్రోకింగ్‌లోకి 100% ఎఫ్‌డీఐలు?

Wednesday 3rd October 2018

న్యూఢిల్లీ: బీమా రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ప్రస్తుతం బ్రోకింగ్‌, బీమా కంపెనీలు, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్‌ మొదలైన బీమా రంగ వ్యాపార విభాగాల్లోకి 49 శాతం వరకూ మాత్రమే ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. "బీమా బ్రోకింగ్ కూడా ఇతరత్రా ఆర్థిక సేవలు, కమోడిటీ బ్రోకింగ్ సేవల్లాంటిదే. ఇందులో వంద శాతం ఎఫ్‌డీఐలను

Most from this category