News


పీఎన్‌బీ నష్టాలు రూ.4,750 కోట్లు

Wednesday 29th May 2019
news_main1559110116.png-25976

  • తగ్గిన క్యూ4, వార్షిక నష్టాలు 
  • నీరవ్‌, చోక్సీల బకాయిలకు పూర్తి కేటాయింపులు
  • ‘మొండి’ రికవరీలకు ప్రాధాన్యం 
  • బ్యాంక్‌ ఎమ్‌డీ సునీల్‌ మెహతా వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మరింతగా తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.13,417 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత క్యూ4లో రూ.4,750 కోట్లకు తగ్గినట్లు పీఎన్‌బీ తెలిపింది. మొండి బకాయిలకు, నీరవ్‌ మోదీ రుణాలకు కూడా తగినంతగా కేటాయింపులు జరిపినప్పటికీ నికర నష్టాలు మూడోవంతుకు పైగా తగ్గాయని పీఎన్‌బీ ఎమ్‌డీ సునీల్‌ మెహతా తెలిపారు. మొత్తం ఆదాయం రూ.12,946 కోట్ల నుంచి రూ.14,725 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 
తగ్గిన ఏడాది నష్టాలు...
పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.12,283 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,975 కోట్లకు తగ్గాయని మెహతా పేర్కొన్నారు. ఇక ఆదాయం రూ.57,608 కోట్ల నుంచి రూ.59,515 కోట్లకు పెరిగిందని తెలియజేశారు. గత క్యూ4లో ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వానికి షేర్లు జారీ చేసి రూ.5,908 కోట్లు సమీకరించామని తెలిపారు.
పటిష్ట ఫండమెంటల్స్‌...
నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీల మోసాల కారణంగా 2017-18 క్యూ4లో ఈ బ్యాంక్‌కు రూ.13,417 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. బ్యాంక్‌ చరిత్రలో ఇవే అత్యధిక నష్టాలు. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో ఇదే మాకు అతి పెద్ద సవాల్‌. నీరవ్‌ మోదీ బకాయిలకు పూర్తి కేటాయింపులు జరిపాం. బకాయిల ప్రక్షాళనకు పలు చర్యలు తీసుకున్నాం. ఫలితంగా ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో మంచి స్థాయికి చేరింది’’ అని సునీల్‌ మెహతా వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రొవిజనల్‌ కవరేజ్‌ రేషియో 74.50 శాతానికి పెరిగిందన్నారు. ఈ నిష్పత్తి పెరిగినా, నికర వడ్డీ మార్జిన్‌ 2.42 శాతం నుంచి 2.59 శాతానికి చేరిందని, నిర్వహణ లాభం గత క్యూ4లో రూ.2,861 కోట్లు కాగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2017-18) రూ.12,995 కోట్లకు చేరిందని చెప్పారు. నిర్వహణ లాభం మంచి వృద్ధిని సాధించడం.. తమ బ్యాంక్‌ పటిష్టమైన ఆర్థిక స్థితిగతులకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 
మెరుగపడిన రుణ నాణ్యత... (బాక్స్‌ ఐటెమ్‌)
పీఎన్‌బీ  రుణ నాణ్యత మెరుగుపడింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.18.38 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ4లో 15.50 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 11.24 శాతం నుంచి 6.56 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.86,620 కోట్ల నుంచి రూ.78,473 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.48,684 కోట్ల నుంచి రూ.30,038 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా రూ.16,203 కోట్ల నుంచి రూ.9,154 కోట్లకు తగ్గాయి. ఇక తాజా మొండి బకాయిలు రూ.30,377 కోట్ల నుంచి రూ.5,130 కోట్లకు తగ్గాయి.
‘మొండి’ రికవరీలు మరింత పెరుగుతాయ్‌...
మొండిబకాయిల రికవరీపై ప్రధానంగా దృష్టి పెడతామని సునీల్‌ మెహతా చెప్పారు. కార్యకలాపాల హేతుబద్ధీకరణ, కీలకం కాని ఆస్తుల విక్రయం కూడా ప్రాధాన్యతా అంశాలేనని చెప్పారు. కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు రావచ్చని పేర్కొన్నారు.  
2017-18లో రూ.9,666 కోట్లుగా ఉన్న మొండి బకాయిల రికవరీలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపై రూ.20,000 కోట్లకు పెరిగాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీలు మరింతగా పెరగగలవని ధీమా వ్యక్తం చేశారు. ఇతర బ్యాంక్‌లను పీఎన్‌బీలో విలీనం విషయమై తమ వద్దకు ఇప్పటివరకైతే ఎలాంటి ప్రతిపాదన రాలేదని, సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తామని తెలిపారు. 



You may be interested

అరబిందో లాభం రూ.585 కోట్లు

Wednesday 29th May 2019

10 శాతం పెరుగుదల అమెరికా వ్యాపారంలో భారీ వృద్ధి హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (మార్చి క్వార్టర్లో) రూ.585 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2017-18) నమోదైన రూ.528 కోట్లతో పోలిస్తే సుమారు 10 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు, ఆదాయం దాదాపు 30 శాతం వృద్ధితో రూ.4,049 కోట్ల నుంచి

సన్‌ఫార్మా లాభం రూ.636 కోట్లు

Wednesday 29th May 2019

ఒక్కో షేర్‌కు రూ.2.75 డివిడెండ్‌ రూ.1,391 కోట్ల పెట్టుబడులు సన్‌ ఫార్మా ఎమ్‌డీ దిలీప్‌ సింఘ్వి వెల్లడి న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం, సన్‌ ఫార్మా స్యూటికల్స్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి- మార్చి క్వార్టర్‌లో తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.1,343 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.636 కోట్లకు తగ్గిందని సన్‌ ఫార్మా తెలిపింది. ఆదాయం రూ.6,711 కోట్ల

Most from this category