News


ఫార్మాను ఊరిస్తున్న మధ్యప్రాచ్య దేశాలు

Saturday 14th September 2019
news_main1568434959.png-28363

  • టాప్‌-30 మార్కెట్లలో 3 దేశాలకు చోటు
  • జూన్‌ ఎగుమతుల్లో 11 శాతం వృద్ధి
  • ఈ ఏడాది రూ.1,54,000 కోట్ల ఎక్స్‌పోర్ట్స్‌

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఫార్మా రంగ సంస్థలకు మధ్యప్రాచ్య దేశాలు ఊరిస్తున్నాయి. 2018-19 టాప్‌-30 ఎక్స్‌పోర్ట్స్ మార్కెట్లలో మూడు మధ్యప్రాచ్య దేశాలు చోటు సంపాదించాయి. వీటిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 13వ స్థానం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ దేశానికి రూ.1,820 కోట్ల విలువైన ఎగుమతులు భారత్‌ నుంచి జరిగాయి. 2017-18తో పోలిస్తే వృద్ధి ఏకంగా 103 శాతం నమోదైంది. ఇరాన్‌కు 46 శాతం వృద్ధితో రూ.1,267 కోట్లు, టర్కీకి రూ.1,155 కోట్ల విలువైన ఔషధాలను ఇక్కడి కంపెనీలు సరఫరా చేశాయి. మధ్యప్రాచ్య దేశాల్లో ఇక్కడి కంపెనీలకు వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ భాస్కర్‌ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. 
ఆ దేశాల్లో తయారీ ...
మందుల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడకూడదని చాలా దేశాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా తయారీని ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీలనూ ఇస్తున్నాయి. ప్రభుత్వ హెల్త్‌ ప్రాజెక్టుల్లో స్థానిక కంపెనీల నుంచే మందులకు కొనుగోలు చేస్తున్నాయి. తమ వద్ద ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా పలు దేశాలు భారత కంపెనీలను ఆహ్వానిస్తున్నాయని రవి ఉదయ భాస్కర్‌ వివరించారు. దేశీయంగా తయారీపై నియంత్రణ ఉంటుందన్నది ఆ దేశాల ఆలోచన అని చెప్పారు. విదేశాల్లో తయారీ కేంద్రాల స్థాపన ద్వారా భారత సంస్థలు అవకాశాలను అందుకోవచ్చని అన్నారు.
స్వావలంభన దిశగా...
మందుల తయారీకి అవసరమైన రూ.24,500 కోట్ల విలువైన ముడి పదార్థాలను 2018-19లో భారత్‌ దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.17,500 కోట్ల ముడి సరుకు చైనా నుంచే వచ్చింది. ఒకవేళ చైనా నుంచి సరఫరా నిలిచిపోతే భారత పరిస్థితి ఏంటి అన్న అంశంపై ఫార్మెక్సిల్‌ ఒక అధ్యయనం చేపట్టింది. లైఫ్‌స్టైల్‌, కార్డియోవాస్క్యులర్‌, ఆంకాలజీ వంటి ఆరు విభాగాల్లో మందులకు అవసరమైన ముడి పదార్థాలను తయారు చేయగల సత్తా భారత కంపెనీలకు ఉందని నిర్దారించింది. పది రోజుల్లో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని కౌన్సిల్‌ జాయింట్ డైరెక్టర్‌ మురళీ కృష్ణ చెప్పారు. 
నియంత్రణ సంస్థలతో...
ఫార్మెక్సిల్‌ తొలిసారిగా పలు దేశాల ఔషధ నియంత్రణ సంస్థల అధిపతులతో తొలిసారిగా సెప్టెంబరు 19-20 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తోంది. చైనా, బ్రెజిల్‌, వియత్నాం వంటి 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత కంపెనీలు సైతం వీరితో ముఖాముఖి సమావేశమయ్యేందుకు సదస్సు వీలు కల్పిస్తుందని ఫార్మెక్సిల్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌ సీనియర్‌ ఆఫీసర్‌ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. 
తొలి త్రైమాసికం అదుర్స్‌ ...
జూన్‌ త్రైమాసికంలో ఫార్మా ఎగుమతులు 11 శాతం వృద్ధి చెంది రూ.35,000 కోట్లు నమోదు చేశాయి. చైనా 37 శాతం, జపాన్‌ 32, ఉత్తర అమెరికా 30, సీఐఎస్‌ 13, ఎల్‌ఏసీ రిజియన్‌ 12 శాతం వృద్ధి చెందాయి. 169 శాతం వృద్ధితో ఇరాన్‌కు రూ.392 కోట్ల విలువైన సరుకు సరఫరా అయింది. 2019-20లో ఔషధ ఎగుమతులు రూ.1,54,000 కోట్లు నమోదయ్యే అవకాశం ఉందని ఫార్మెక్సిల్‌ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,33,980 కోట్లుగా ఉంది. ఆరోగ్య సేవలపై వ్యయం తగ్గించుకోవడానికి చాలా దేశాలు తక్కువ ధరలో లభించే జనరిక్‌ డ్రగ్స్‌కు మళ్లుతున్నాయి. అలాగే యూఎస్‌ మార్కెట్‌ రికవరీ, ధరలు స్థిరపడడం, చైనా తీసుకుంటున్న నియంత్రణ పరమైన నిర్ణయాలు ఎక్స్‌పోర్ట్స్‌ అధికం కావడానికి దోహదం చేయనున్నాయి. 



You may be interested

ఎగుమతులు.. రివర్స్‌గేర్‌!

Saturday 14th September 2019

ఆగస్టులో 6 శాతం క్షీణత దిగుమతులూ 13.45 శాతం పతనం వాణిజ్యలోటు 13.45 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఆగస్టు ఎగుమతి-దిగుమతులు అద్దం పడుతున్నాయి. ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 6 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక దిగుమతులదీ అదే ధోరణి. 13.45 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది జూలైలో ఎగుమతులు స్వల్పంగా 2.25 శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే... - ఆగస్టులో

బీపీసీఎల్‌.. మళ్లీ ‘విదేశీ’ పరం!

Saturday 14th September 2019

53.3 శాతం వాటా విక్రయించనున్న కేంద్రం  ఆసక్తి చూపుతున్న విదేశీ చమురు దిగ్గజాలు  జాబితాలో సౌదీ ఆరామ్‌కో, బీపీ తదితర కంపెనీలు న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్‌ సం‍స్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ

Most from this category