News


భారీగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Wednesday 11th March 2020
news_main1583912715.png-32407

వరుసగా మూడో రోజు ధరల కోత
9 నెలల కనిష్టానికి పెట్రోల్‌ లీటర్‌ 
2019 జనవరి స్థాయికి డీజిల్‌ రేటు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనంకావడంతో దేశీయంగా పెట్రో ఉత్పత్తుల రేట్లు దిగివస్తున్నాయి. గత రెండు రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గుతూ వస్తున్న ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తాజాగా మరోసారి ధరల్లో కోత పెట్టాయి. ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్‌ లీటర్‌ రూ. 2.69 శాతం తగ్గింది. దీంతో 70.29కు చేరింది. ఇక డీజిల్‌ ధరలో సైతం లీటర్‌కు రూ. 2.33 మేర కోత పడటంతో రూ. 63ను తాకింది. ఈ బాటలో ముంబై మార్కెట్లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 76కు చేరగా, డీజిల్‌ రూ. 65.97 పలుకుతోంది. కోల్‌కతాలో పెట్రోల్‌ రేటు దాదాపు రూ. 73కాగా.. డీజిల్‌ రూ. 65.34కు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్‌ రూ. 73కాగా.. డీజిల్‌ రూ. 66.5ను తాకింది. వెరసి మూడు రోజుల వరుస తగ్గింపు కారణంగా పెట్రోల్‌ ధర 9 నెలల కనిష్టానికి చేరింది. ఇంతక్రితం 2019 జులైలో పెట్రోల్‌ ధరలు ఈ స్థాయిలో నమోదుకాగా.. డీజిల్‌ ధరలు 2019 జనవరిలో మాత్రమే ఈ ధర పలికినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. మంగళవారం సైతం పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌ ధరలను పీఎస్‌యూ కంపెనీలు రూ. 0.30, 0.25 చొప్పున తగ్గించాయి.

ఎందువల్లనంటే
ప్రపంచంలోనే చమురు ఉత్పత్తికి అతిపెద్ద దేశాలుగా నిలుస్తున్న రష్యా, సౌదీ అరేబియా మధ్య గత వారం వివాదం తలెత్తింది. కొన్నేళ్లుగా బలహీనపడుతున్న చమురు ధరలకు అండగా రష్యాసహా ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తూ వస్తున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న అంచనాలతో మరోసారి ఉత్పత్తిలో కోతలను మరింత పెంచేందుకు సౌదీ అరేబియా ప్రతిపాదించింది. ఇందుకు రష్యా అంగీకరించకపోవడంతో సౌదీ అరేబియా ఉన్నపళాన చమురును బ్యారల్‌కు 6-8 డాలర్ల చొప్పున తక్కువకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఏప్రిల్‌కల్లా ఉత్పత్తిని రికార్డ్‌ స్థాయిలో 12.3 మిలియన్‌ బ్యారళ్లకు పెంచనున్నట్లు తెలియజేసింది. దీంతో వరుసగా రెండు రోజుల్లో చమురు ధరలు 35 శాతం పతనమయ్యాయి. తదుపరి 10 శాతంవరకూ రికవరీ అయినప్పటికీ మూడు రోజుల క్రితం ధరలతో పోలిస్తే తక్కువలోనే ట్రేడవుతున్నాయి. దీంతో దేశీయంగా చమురు అవసరాల కోసం దిగుమతి చేసుకునే విదేశీ చమురు చౌక అయినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ రేట్లలో కోతలను అమలు చేస్తున్నట్లు తెలియజేశాయి.

పక్షం రోజులకు ఒకసారి
దేశీయంగా చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ల రేట్లను సగటున 15 రోజులకు ఒకసారి మదింపు వేస్తుంటాయి. తద్వారా దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ తదితరాల ధరలను సవరిస్తుంటాయి. ఈ అంశంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ సైతం ప్రధాన పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు తెలియజేశారు. You may be interested

ఈక్విటీ ఎంఎఫ్‌ పెట్టుబడులు @ రూ.10,795.81కోట్లు

Wednesday 11th March 2020

వరుసగా మూడోనెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకి ఈ ఫిబ్రవరిలో రూ.10,795.81 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతూ రావడం వరసగా ఇది 3వ నెల. అలాగే గడిచిన 11నెలల్లో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో పెట్టుబడుల ప్రవాహం పెరిగినట్లు యాంఫీ గణాంకాలు చెబుతున్నాయి. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు కరోనా వ్యాప్తి భయాలు తోడవడంతో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు

ఎంసీఎల్‌ఆర్‌ తగ్గించిన ఎస్‌బీఐ

Wednesday 11th March 2020

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్‌‌ఆర్‌‌ (మార్జినల్‌‌ కాస్ట్‌‌ బేస్డ్‌‌ లెండింగ్‌‌ రేట్స్‌‌)ను తగ్గించింది. వివిధ కాల వ్యవధి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌పై 15 బేసిస్‌ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు బ్యాంక్‌ ప్రకటించింది. ఈ మార్చి 10 నుంచే కొత్త రేట్ల అమల్లోకి వస్తాయి. తగ్గించిన ఎంసీఎల్‌ఆర్‌ ప్రకారం.... ఒక ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతానికి తగ్గింది. అంతకు ముందు ఇది 7.85శాతం

Most from this category