News


సుప్రీం తీర్పుతో టెలికాంలో కన్సాలిడేషన్‌!

Friday 25th October 2019
news_main1571995290.png-29143

వొడాఫోన్‌ ఐడియాకు చిక్కులు తప్పవని నిపుణుల అంచనా
ఏజీఆర్‌(అడ్జస్టెడ్‌ గ్రాస్‌ రెవెన్యూ)కు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికం రంగంలో మరింత కన్సాలిడేషన్‌ జరుగుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కన్సాలిడేషన్‌లో చివరకు ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే మిగులుతాయని, వొడాఫోన్‌ ఐడియా భవితవ్యం అనుమానాస్పదంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. వొడాఫోన్‌ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 400 కోట్ల డాలర్లుంటాయని, ఇది కంపెనీవద్ద ఉన్న మొత్తం నగదు రిజర్వుల కన్నా చాలా ఎక్కువని తెలిపారు. దీనికి తోడు కంపెనీ షేరు క్షీణతతో మార్కెట్‌ క్యాప్‌ సైతం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో కంపెనీ మనుగడ ప్రశ్నార్ధకం కావచ్చని నిపుణులు సందేహిస్తున్నారు. వొడాఫోన్‌ ఐడియా ఈ నిధులను ఎలా సమకూర్చుకుంటుందనేది కంపెనీ మనుగడకు కీలకమని బోఫాఎంఎల్‌, ఎస్‌బీఐ క్యాప్‌కు చెందిన అనలిస్టులు చెబుతున్నారు. ఒకవేళ కంపెనీ కనుమరుగైతే టెలికం పరిశ్రమ మరింత బలహీనమవుతుందన్నారు. 
ఏం జరిగింది?
టెల్కోల రాబడి (ఏజీఆర్‌) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులకు సంబంధించి ప్రభుత్వం, టెల్కోల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఏజీఆర్‌ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్‌ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటీషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది.  టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది.

కొత్త టెలికం విధానం ప్రకారం, టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్‌)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్‌ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెల్కోలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది.  ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 
అసలే రుణభారం.. 
నిజానికి తాజా తీర్పుతో ఎయిర్‌టెల్‌ భారీ మొత్తం చెల్లించాల్సి ఉంది. కానీ ఈ మొత్తంలో టెలినార్‌, టాటా టెలిల వాటా కూడా కలిసే ఉంది. ఈ పాత బకాయిలు ఆయా సంస్థలే చెల్లించాల్సిఉంటుంది. అందుకే ఎయిర్‌టెల్‌ పోటీలో నిలుస్తుందని, కానీ వొడాఫోన్‌ మాత్రం ఇలాంటి జరిమానాలకు ఎలాంటి మొత్తాలను  కేటాయించుకోనందున ఇబ్బందులు పడుతుందని అంచనా వేస్తున్నారు. వొడాఫోన్‌ ఐడియా ఇలా బలహీనపడడం క్రమంగా ఎయిర్‌టెల్‌కే ఎక్కువ కలిసివస్తుందని భావిస్తున్నారు. అందుకే తీర్పువచ్చిన రోజు ఎయిర్‌టెల్‌ షేరు భారీగా పతనమైనా వెనువెంటనే కోలుకుంది. కానీ వొడాఫోన్‌ ఐడియా మాత్రం మరింత పతనం చెందింది. తీర్పుపై ఇంతవరకు ఐడియా, ఎయిర్‌టెల్‌ ఎలాంటి కామెంట్‌ చేయలేదు. సుప్రీం కోర్టు తీర్పు రాబోయే 5జీ వేలం సమయంలో టెల్కోలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని, అప్పుడు టెలికం కంపెనీలు నిధులు దొరక్క అల్లాడతాయని ఎక్కువమంది నిపుణుల భావన. ఒకపక్క టెలికం రంగం అధిక రుణభారంతో ఇక్కట్లు పడుతున్న తరుణంలోనే ఈ తీర్పు రావడం అశనిపాతమని అభిప్రాయపడ్డారు. ఈ మొత్తం అంశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క జియో మాత్రమే కనిపిస్తుందన్నారు. 5జీ రేసులో జియోనే గెలుపొందవచ్చని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం టెల్కోలకు కొంత ఊరట నిచ్చేలా చెల్లింపులపై రెండేళ్ల మారిటోరియం విధించవచ్చని కొందరి అంచనా. పైగా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఎలాంటి కాలపరిమితి విధించనందున టెల్కోలకు కొంత సమయం దక్కుతుందని, అప్పటికి ప్రభుత్వం ఏవైనా ఉపశమన చర్యలు కల్పిస్తే టెలికం రంగంలో మూడు కంపెనీలు కొనసాగవచ్చని, లేదంటే రెండే మిగులుతాయని అధికశాతం నిపుణులు భావిస్తున్నారు. 



You may be interested

ఇది సెంటిమెంట్‌ను మార్చే దీపావళి కాదు: యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌

Friday 25th October 2019

-అమితాబ్ చౌదరి, యాక్సిస్ బ్యాంక్ ‘ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నెగిటివ్‌ సెంటిమెంట్‌, పండుగ సీజన్‌ వలన తొలుగుతుందని అనుకోవడం లేదు’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ అమితాబ్‌ చౌదరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌)లు ఆస్తి నాణ్యత సమస్యలను, లిక్విడిటీ కొరతను ఎదుర్కొం‍టున్నాయని, ఈ రంగలో 12-18 నెలల లోపు చెప్పుకోదగ్గ మార్పులను అంచనావేయోద్దని సూచించారు. మిగిలిన ముఖ్యమైన విషయాలు ఆయన

భారతీ ఇన్ఫ్రాటెల్‌ 10శాతం క్రాష్‌..!

Friday 25th October 2019

టవర్ల విలీన ప్రక్రియ వాయిదా ఎఫెక్ట్‌ భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లోకి ఇండస్ టవర్స్‌ను విలీనానికి మరి కొంతకాలం గడువును పొడిగించినట్లు వార్తలు వెలుగులోకి రావడంతో భారతీ ఇన్‌ఫ్రాటెల్ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 10శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.240.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో ఇండస్‌ టవర్స్‌ విలీన గడువును మరో 60రోజుల పాటు పొడిగించేందుకు కమిటీ డైరెక్టర్లు ఆమోదం తెలినట్లు భారతీ ఇన్ఫ్రాటెల్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం

Most from this category