News


మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌!

Wednesday 6th November 2019
news_main1573010870.png-29380

  • విస్తరణలో సైతం తగ్గని పెయింట్ల కంపెనీలు
  • ఏటా రెండంకెల వృద్ధి; పల్లెలకూ ప్రీమియం రంగులు
  • రూ.50,000 కోట్లకు పరిశ్రమ; భారీగా పెరిగిన షేర్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇల్లయినా, కార్యాలయమైనా అద్దంలా మెరవాలని అంతా అనుకుంటారు. అందుకే కొత్త కొత్త రంగులతో భవనానికి నూతన రూపు తెస్తుంటారు. యజమానులు తమ ఇంటికైనా, ఆఫీసుకైనా గతంలో 6–8 సంవత్సరాలకు ఒకసారి పెయింట్‌ వేయించేవారు. ఇప్పుడు 4–5 ఏళ్లకే వేయిస్తున్నారట. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌ విషయంలో అయితే తరచూ రంగులు మారుస్తున్న కస్టమర్లు పెరుగుతున్నారనేది కంపెనీల మాట. కస్టమర్ల ‘కలర్‌ఫుల్‌’ ఆలోచనలతో పెయింట్‌ కంపెనీలు కళకళలాడుతున్నాయి. ఏటా రెండంకెల వృద్ధి సాధిస్తూ పల్లెల్లో సైతం విస్తరిస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు అంత బాగా లేకున్నా లిస్టెడ్‌ పెయింట్‌ కంపెనీల షేర్ల ధర ఏడాదిలో 65 శాతం దాకా పెరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
గ్రామాలకూ పెద్ద బ్రాండ్లు...
ఇపుడు ప్రధాన బ్రాండ్లు గ్రామీణ ప్రాంతాలకూ చొచ్చుకుపోయాయి. మొత్తం పరిశ్రమలో వినియోగం పరంగా పట్టణాల వాటా 60 శాతం కాగా, మిగిలినది గ్రామీణ ప్రాంతాలది. ఈ మధ్య గ్రామాల్లోనూ ప్రీమియం రంగులు వాడుతుండటం విశేషం. వినియోగం పెరుగుతుండటంతో ప్రధాన కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి. ఏటా విస్తరణ, మార్కెటింగ్‌కు రూ.300–500 కోట్ల దాకా వెచ్చిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటి వరకు రూ.10,000 కోట్ల దాకా పెట్టుబడులు వచ్చాయి. దిగ్గజ సంస్థలు పరిశోధన, అభివృద్ధికి టర్నోవరులో 1 శాతం దాకా వ్యయం చేస్తున్నాయి. 
రీ–పెయింటింగ్‌ ఎక్కువ...
డెకొరేటివ్‌ విభాగం మార్కెట్‌ విలువ రూ.40,000 కోట్లు. ఇందులో ఆయిల్‌ ఆధారిత పెయింట్లు 20 శాతం, వాటర్‌ బేస్డ్‌ 80 శాతం. ‘‘ఇపుడు త్వరగానే పెయింట్లు మారుస్తున్నారు. బెడ్‌ రూమ్స్, లివింగ్‌ రూమ్స్‌కైతే తరచూ మారుస్తున్నారు. డెకొరేటివ్‌ విభాగంలో వాడుతున్న రంగుల్లో 80 శాతం పాత గృహాలకు రీ-పెయింటింగ్‌ కోసమే. కొత్త గృహాల వాటా 20 శాతమే. నూతన గృహాల్లో వ్యక్తిగత ఇళ్ల వాటా 80 శాతం, గృహ సముదాయాల వాటా 20 శాతం ఉంటుంది’’ అని జేఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ జేఎండీ ఏ.ఎస్‌.సుందరేశన్‌ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. కాగా దేశంలో పెయింట్స్‌ పరిశ్రమ రెండు దశాబ్దాలుగా రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. 2010కి ముందు వరకు ఏటా 12–15 శాతం వృద్ధి సాధించగా 2011 నుంచి ఇది 8–12 శాతానికి చేరిందని ‘టెక్నో పెయింట్స్‌’ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. మరోవంక మార్కెట్‌ పర్యావరణ అనుకూల రంగుల వైపు మళ్లుతోంది. వొలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌ (వీఓసీ) వంటి రసాయనాలు లేని, లేదా అతి తక్కువ వీఓసీ ఉన్న పెయింట్లు వస్తున్నాయి. బ్యాక్టీరియాను దరిచేరనీయని, ఎక్కువ కాలం మన్నే రంగులను ప్రధాన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. 
ఇదీ పెయింట్స్‌ మార్కెట్‌...
దేశంలో పెయింట్స్‌ విపణి విలువ రూ.50,000 కోట్లు. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా రూ.40,000 కోట్లు. జాతీయ స్థాయిలో 10 వరకు బ్రాండ్లు పోటీపడుతుండగా... ప్రాంతీయ కంపెనీలు 100 వరకూ ఉన్నాయి. వినియోగం పరంగా దక్షిణ, పశ్చిమ భారత్‌ 55 శాతం, ఉత్తరాది 25, తూర్పు భారత్‌ 20 శాతం కైవసం చేసుకున్నాయి. You may be interested

టెక్‌ మహీంద్రా లాభం రూ.1,124 కోట్లు

Wednesday 6th November 2019

6 శాతం వృద్ధి  5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు ఆదాయం  రూ.671 కోట్లతో బార్న్‌ గ్రూప్‌ కొనుగోలు  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా  ఎమ్‌డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630

భారీగా తగ్గిన బంగారం

Wednesday 6th November 2019

గత రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అనూహ్యంగా పతనమయ్యింది. ఔన్సు పసిడి ధర ఒక్కసారిగా 27 డాలర్లు పతనమై 1,483 డాలర్లకు పడిపోయింది. కొద్దిరోజులుగా అమెరికా-చైనాల తొలిదశ వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్న వార్తలు హోరెత్తడంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపినప్పటికీ, బంగారం స్థిరంగా 1,500 డాలర్లపైన ట్రేడవుతూ పలువురు బులియన్‌ విశ్లేషకుల్ని ఆశ్చర్యపర్చింది. సాధారణంగా రిస్క్‌తో కూడిన ఈక్విటీల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంటే, రక్షణాత్మక పెట్టుబడిగా భావించే

Most from this category