News


ఈసారి 'దావోస్‌'కు భారీ సన్నాహాలు

Monday 11th November 2019
Markets_main1573442540.png-29487

  • జనవరిలో డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు
  • భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు, 
  • రాజకీయ నేతలు, బాలీవుడ్ స్టార్స్‌

న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్ స్టార్స్ పాల్గోనున్నారు. ప్రపంచ దేశాలు సమిష్టిగా, నిలకడగా వృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసారి దావోస్‌ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. డబ్ల్యూఈఎఫ్‌ 50వ వార్షిక సదస్సు కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. గతేడాది జరిగిన సదస్సులో వీరిద్దరూ పాల్గొనలేదు. ఈసారి సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది దిగ్గజ నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. 
    భారత్ నుంచి పేర్లు నమోదైన వారిలో పారిశ్రామిక దిగ్గజాలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదాని, కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్‌, నందన్ నీలేకని, అజయ్‌ పిరమల్‌ తదితరులు ఉన్నారు. మానసిక స్వస్థతపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా ఇందులో పాల్గోనున్నారు. మరోవైపు, అంతర్జాతీయంగా మైకేల్ డెల్‌ (డెల్ సంస్థ), జేమ్స్ డైమన్ (జేపీ మోర్గాన్‌), పునీత్ రంజన్ (డెలాయిట్‌), షెరిల్ శాండ్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌), రాజీవ్ సూరి (నోకియా) మొదలైన వారు హాజరు కానున్నారు. 
    ఆర్థికంగా ఉన్నతవర్గాలు తమకు ద్రోహం చేస్తున్నారనే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని, మరోవైపు గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యాలు నెరవేరడం లేదని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపక చైర్మన్ క్లాస్ ష్వాబ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న దావోస్ సదస్సులో అన్ని వర్గాల శ్రేయస్సు కోసం కొత్త మేనిఫెస్టోను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

ఆ స్విస్ ఖాతాల్లో నిధులు స్విట్జర్లాండ్‌ ఖజానాకు..
క్లెయిమ్ చేసుకోవడానికి చాన్నాళ్లుగా ఎవరూ ముందుకు రాకపోవడంతో భారతీయులకు చెందిన సుమారు పది ఖాతాల్లోని సొమ్ము.. స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఖజానాకు దఖలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మనీని కట్టడి చేసే క్రమంలో నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాల వివరాలను 2015 నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. అవసరమైన ఆధారాలను సమర్పించి ఖాతాలను పునరుద్ధరించుకోవాలని ఖాతాదారులకు సూచిస్తోంది. వీటిలో భారతీయులకు చెందిన ఖాతాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్నింటికి క్లెయిమ్ గడువు ఈ నెల, వచ్చే నెలతో తీరిపోనుంది. లీలా తాలూక్‌దార్‌, చంద్రలతా ప్రాణ్‌లాల్ పటేల్‌, మోహన్‌లాల్‌ మొదలైన వారి పేర్లతో ఈ ఖాతాలు ఉన్నాయి. క్లెయిమింగ్‌కు గడువు తీరిపోయిన పక్షంలో ఆ ఖాతాల్లోని నిధులను స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఖజానాకు బదలాయించడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. సుమారు అరవై ఏళ్ల పాటు ఎవరూ క్లెయిమ్ చేసుకోవడానికి ముందుకు రాని ఖాతాలను నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలుగా స్విస్ బ్యాంకులు పరిగణిస్తాయి. ప్రస్తుతం ఇలాంటివి 3,500 పైగా ఖాతాలు ఉన్నాయి. 

 You may be interested

మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత

Monday 11th November 2019

అక్టోబర్‌లో 20.7 శాతం తగ్గింపు న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. అక్టోబర్‌ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్‌లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్‌పుట్‌ను తగ్గించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహన

అప్పు చేసి కారు కొనచ్చా..?

Monday 11th November 2019

ప్ర: నేను ఇప్పటికే మిడ్, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో 12-13 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన మదుపు వ్యూహమేనా ? -ఇంతియాజ్‌, ఈ మెయిల్‌ ద్వారా  జ: పదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి సాధనాలు. మీరు ఇప్పటికే మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. కాబట్టి స్మాల్‌

Most from this category