News


బీఎస్‌ఎన్‌ఎల్‌పై దివాలా పిటీషన్లు!!

Tuesday 5th November 2019
news_main1572925359.png-29349

  • బాకీలు రాబట్టుకునేందుకు వెండార్ల యోచన
  • 19న నిరసన ప్రదర్శన

న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెల్కోలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఓవైపు ప్యాకేజీ ప్రకటించగా.. మరోవైపు.. వాటి నుంచి వేల కోట్ల బాకీలు రాబట్టుకునేందుకు వెండార్లు సిద్ధమవుతున్నారు. బాకీలు వసూలు కాని పక్షంలో ఆ రెండు సంస్థలపై దివాలా పిటీషన్లు వేయాలని వివిధ యంత్ర పరికరాలు సరఫరా చేసిన వెండార్లు యోచిస్తున్నారు. ఈ బాకీలు సుమారు రూ. 20,000 కోట్ల పైగా ఉన్నాయని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్‌ టెలికం కమిటీ చైర్మన్ సందీప్ అగర్వాల్ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎ౾ంటీఎన్‌ఎల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌కి సంబంధించి భారత్‌నెట్‌ ప్రాజెక్టుకు సరఫరా చేసిన ఉత్పత్తుల బాకీలు కూడా ఇందులో ఉన్నాయి. 
    "రెండు సంస్థల నుంచి వెండార్లకు దాదాపు రూ. 20,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. తీసుకున్న రుణాలు కట్టాలంటూ వెండార్లపై బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 19న వెండార్లు అంతా కలిసి నిరసన ప్రదర్శనకు దిగనున్నారు. ఆ తర్వాత 10 రోజుల్లోగా బాకీలు చెల్లించకపోతే బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటీషన్ వేయబోతున్నారు" అని అగర్వాల్ వివరించారు. మరోవైపు, బాకీల అంశంపై స్పందించిన ఎంటీఎన్‌ఎల్ సీఎండీ సునీల్ కుమార్ తమ బకాయీలేమీ భారీగా లేవన్నారు. "వెండార్లకు ఎ౾ంటీఎన్‌ఎల్ చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 400 కోట్లకు మించదు. ఈ మొత్తాన్ని త్వరలోనే చెల్లించేసే స్థితిలోనే సంస్థ ఉంది" అని ఆయన చెప్పారు. 

యూఎస్‌వోఎఫ్‌కు లేఖ...
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ. 2,000 కోట్ల బాకీల వసూలు గురించి భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ నిర్వహించే యూనివర్సల్‌ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌వోఎఫ్‌) అడ్మినిస్ట్రేటర్‌కు అక్టోబర్ 31న టెలికం ఎగుమతుల ప్రోత్సాహక మండలి లేఖ కూడా రాసింది. వెండార్లలో స్టెరిలైట్ టెక్నాలజీస్ (రూ. 500 కోట్లు బాకీ), తేజస్ నెట్‌వర్క్స్‌ (రూ. 314 కోట్లు), హెచ్‌ఎఫ్‌సీఎల్‌ (రూ. 219 కోట్లు), పారమౌంట్ వైర్స్ అండ్ కేబుల్స్ (రూ. 168 కోట్లు) వీఎన్‌ఎల్‌ (రూ. 150 కోట్లు) ఉన్నాయి. పారామౌంట్ సంస్థ దీనిపై కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు లేఖ కూడా రాసింది. "బాకీలు వసూలు కాకపోవడం వల్ల ముడి సరుకు కొనడానికి నిధుల్లేక ప్లాంట్ దాదాపు మూతబడింది. రేటు ఎక్కువ ఇస్తామన్నా మా రుణదాతలు సరఫరా చేయడం లేదు. ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించలేకపోతున్నాం. మా సంస్థ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు" అని ఆందోళన వ్యక్తం చేసింది. సత్వరం బాకీలు వసూలయ్యేలా చూడాలంటూ కోరింది. 

పునరుద్ధరణ ప్యాకేజీకి ఉద్యోగుల మద్దతు...
బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించడాన్ని కొన్ని ఉద్యోగ సంఘాలు, అధికారుల అసోసియేషన్లు స్వాగతించాయి. దీనిపై సోమవారం కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ను కలిసిన ప్రతినిధులు.. ప్యాకేజీ, స్వచ్ఛంద పదవీ విరమణ స్కీమ్‌ మొదలైన వాటి అమలుకు మద్దతు తెలిపారు. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న రెండు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం రూ. 69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 4జీ స్పెక్ట్రం కేటాయింపు, రుణ సమీకరణకు పూచీకత్తు, వీఆర్‌ఎస్‌ తదితర మార్గాల్లో ఈ ప్యాకేజీ అమలు కానుంది. రెండు సంస్థల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంటుందని అంచనా. You may be interested

మొబైల్ నెట్‌లో అట్టడుగున భారత్‌

Tuesday 5th November 2019

బ్రాడ్‌బ్యాండ్‌లో కొంత మెరుగైన ర్యాంకు ఊక్లా సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌ కన్నా భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను విశ్లేషించే ఊక్లా సంస్థ సెప్టెంబర్‌ నెలకు గాను నిర్వహించిన సర్వేలో భారత్‌ 128వ ర్యాంకులో నిల్చింది, శ్రీలంక 81వ ర్యాంకు, పాకిస్తాన్‌ 112వ స్థానం, నేపాల్‌ 119వ ర్యాంకులు దక్కించుకున్నాయి. అయితే, ఫిక్సిడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో మాత్రం ఈ

మెరుగైన రిస్క్‌ టూల్స్‌ను అనుసరించాలి

Tuesday 5th November 2019

తగినంత లిక్విడిటీ కలిగి ఉండాలి ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ ఆదేశం ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) మెరుగైన రిస్క్‌ నిర్వహణ విధానాలను అనుసరించాలని ఆర్‌బీఐ కోరింది. అలాగే, నిర్దేశించిన లిక్విడిటీ కవరేజీ రేషియో (నిధుల నిర్వహణ నిష్పత్తి)కు అనుగుణంగా తగినంత నిధులను కలిగి ఉండాలని ఆదేశించింది. రూ.10,000 కోట్లు, అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగిన ఎన్‌బీఎఫ్‌సీలు, అలాగే, డిపాజిట్లను స్వీకరించని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి నూతన నిబంధనలను ఆర్‌బీఐ ఇటీవలే విడుదల చేసింది.

Most from this category