News


‘ఓలా’లా...!

Wednesday 13th November 2019
news_main1573614457.png-29541

  • ‘కిచిడీ’ ద్వారా భారీగా ఆహార వ్యాపారంలోకి
  • మరిన్ని సొంత ఫుడ్‌ బ్రాండ్లపై కసరత్తు...
  • క్లౌడ్‌ కిచెన్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ ట్రక్కుల ఏర్పాటు

బెంగళూరు: ట్యాక్సీ సేవల్లో దూసుకెళ్తున్న ఓలా... ఇకపై నోరూరించే వంటకాలతో ఆహార ప్రియులను ఆకర్షించనుంది. రాబడులు పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా సంస్థ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టింది. తాజాగా ఆహార వ్యాపార విభాగంలో భారీగా విస్తరిస్తోంది. దీనికోసం సొంత ఫుడ్‌ బ్రాండ్స్‌నూ ప్రవేశపెడుతోంది. స్విగీ, జొమాటో వంటి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌లో వీటిని లిస్ట్‌ చేయడంతో పాటు సొంతంగా రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లు, ఫుడ్‌ ట్రక్కులు, చిన్నపాటి కియోస్క్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. భోజనం మొదలుకుని బిర్యానీలు, డెసర్ట్‌లు.. ఇలా అన్ని రకాల ఆహారాలకు సంబంధించి ప్రత్యేక బ్రాండ్స్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు.. పట్టణాల్లో కస్టమర్లకు మరింత చేరువ కావాలనేది ఓలా వ్యూహం. "గతంలో హోటళ్లలో భోజనం చేయడమనేది ఎప్పుడో ఒకసారిగా ఉ‍ండేది. ప్రస్తుతం ఇది రోజువారీ వ్యవహారంగా మారిపోతోంది. కాబట్టి ఆహార వ్యాపారం, సరఫరా వంటివి కూడా దానికి అనుగుణంగానే మారాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పేరొందిన ఫుడ్‌ బ్రాండ్స్‌ కొన్నే ఉన్నాయి. అందుకే ఈ రంగంలో భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించాం" అని ఓలా ఫుడ్‌ విభాగం సీఈవో ప్రణయ్‌ జీవ్‌రాజ్‌కా పేర్కొన్నారు. తమ ఆహార బ్రాండ్స్‌తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు.
'కిచిడీ ఎక్స్‌పెరిమెంట్‌' ...
ఆహార వ్యాపార విభాగంలోకి విస్తరించే క్రమంలో 'కిచిడీ ఎక్స్‌పెరిమెంట్‌' పేరిట ఓలా సొంత బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె వంటి నగరాల్లో కిచిడీ వంటకంలో సుమారు 16 వెరైటీలు అందిస్తోంది. కస్టమర్ల అభిప్రాయాలకు అనుగుణంగా మరిన్ని వెరైటీలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. రుచికరమైన కిచిడీని వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారనే ఉద్దేశంతో ముందుగా దీన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. ఓలాకు ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో 50 దాకా కిచెన్స్‌ ఉన్నాయి. వచ్చే ఏడాది కాలంలో కార్యకలాపాలను 80పైగా నగరాలకు విస్తరించాలని ఓలా నిర్దేశించుకుంది. 

రాణించని ఫుడ్‌పాండా...
ఇతర వ్యాపారాల్లోకి విస్తరించే వ్యూహంలో భాగంగా.. ఫుడ్‌ డెలివరీ సేవలందించే ఫుడ్‌పాండాకు చెందిన భారత వ్యాపార విభాగాన్ని 2017 డిసెంబర్‌లో ఓలా కొనుగోలు చేసింది. దీనిపై 200 మిలియన్‌ డాలర్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించింది. ఫుడ్‌ డెలివరీ సేవలందిస్తున్న ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో.. భారీగా వ్యయాలు చేసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో దీన్నుంచి ఫలితాలు రాబట్టలేకపోయింది. ఫుడ్‌ డెలివరీ సేవలతో పాటు.. మరింత రుచికరమైన ఆహారానికి కూడా డిమాండ్‌ ఉంన్న సంగతిని ఈ క్రమంలోనే గుర్తించింది. అందుకే డెలివరీతో పాటు ఆహార వ్యాపారంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. 

భారీ స్థాయిలో క్లౌడ్‌ కిచెన్‌లు..
ఇటీవల క్లౌడ్‌ కిచెన్లు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీలు, ఇన్వెస్టర్లు వీటిపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు ఫాసూస్, బెహ్రూజ్‌ బిర్యానీ వంటి బ్రాండ్స్‌ను రూపొందించిన ముంబై సంస్థ రెబెల్‌ ఫుడ్స్‌కు దేశీయంగా మొత్తం 18 నగరాల్లో 205 క్లౌడ్‌ కిచెన్స్, 1,600 ఆన్‌లైన్ రెస్టారెంట్స్‌ ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో సుమారు 500 క్లౌడ్‌ కిచెన్స్‌ స్థాయికి చేరాలని కంపెనీ నిర్దేశించుకుంది. రెబెల్‌ పోర్ట్‌ ఫోలియోలో మాండరిన్‌ ఓక్, ఓవెన్‌ స్టోరీ, స్వీట్‌ ట్రూత్‌ వంటి ఇతర బ్రాండ్లూ ఉన్నాయి. మరోవైపు, బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్విగ్గీ కూడా హైదరాబాద్‌ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో స్విగ్గీ యాక్సెస్‌ పేరిట తమ క్లౌడ్‌ కిచెన్స్‌ను విస్తరిస్తోంది. స్విగీ ప్లాట్‌ఫాంపై నమోదు చేసుకున్న పలు రెస్టారెంట్లు .. ఇతర ప్రాంతాల్లో తమ శాఖలను ఏర్పాటు చేయలేకపోయినా.. డిమాండ్‌ ఉన్న వంటకాలను అందించేందుకు, కస్టమర్లను సంపాదించుకునేందుకు ఈ క్లౌడ్‌ కిచెన్స్‌ ఉపయోగకరంగా ఉంటున్నాయి. 



You may be interested

అమెజాన్‌లో నకిలీలకు చెక్‌..!

Wednesday 13th November 2019

ప్రాజెక్ట్ జీరో ప్రారంభం న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ అంగళ్లలో బ్రాండెడ్‌ కంపెనీల వస్తువులకు బదులుగా కస్టమర్లకు  నకిలీలు అందుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మంగళవారం ‘ప్రాజెక్ట్ జీరో’ను ప్రారంభించింది. అమెరికా, యూరప్‌, జపాన్‌ వంటి దేశాల్లో విజయవంతంగా అమలుచేసిన ఈ ప్రాజెక్టును తాజాగా భారత్‌లో ప్రారంభించడం ద్వారా తమ ప్లాట్‌ఫాంలో ఇక నుంచి నకిలీల బెడద ఉండబోదని ప్రకటించింది. ఈ అంశంపై అమెజాన్ కస్టమర్ ట్రస్ట్ అండ్‌ పాట్నర్‌ సపోర్ట్‌

మున్ముందు ఎన్‌పీఏలు మిలీనియల్స్‌వేనా?

Wednesday 13th November 2019

ఈ విభాగంలో అత్యధికం అన్‌సెక్యూర్డ్‌ రుణాలే ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ నివేదికలో వెల్లడి ముంబై: మిలీనియల్స్‌ (1980- 2000మధ్య జన్మించినవారు) తీసుకుంటున్న రుణాలు బ్యాంకులకు భవిష్యత్తు మొండి బకాయిలుగా (ఎన్‌పీఏలు) మారనున్నాయా..? గత రెండు సంవత్సరాలుగా బ్యాంకులకు మిలీనియల్స్‌ రుణాలే పెద్ద వ్యాపారంగా ఉండడంతో ఈ ప్రశ్న తలెత్తుతోంది. మిలీనియల్స్‌లో అత్యధికులు అన్‌సెక్యూర్డ్‌ రుణాలనే తీసుకుంటుండడం బ్యాంకులకు ఆందోళన కలిగించేదేనని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే మిలీనియల్స్‌ సంఖ్య

Most from this category