News


పీఎంసీ బ్యాంకులో రూ.40,000కు ఉపసంహరణ పరిమితి

Tuesday 15th October 2019
news_main1571113554.png-28886

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) ఖాతాదారులు, డిపాజిట్‌ దారులకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట ఉపసంహరణ పరిమితి ప్రస్తుతం రూ.25,000 ఉండగా, దీన్ని రూ.40,000కు ఆర్‌బీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రుణాల విషయంలో బ్యాంకు యాజమాన్యం అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలను అమలు చేస్తున్నట్టు ఆర్‌బీఐ గత నెల 23న ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత ఒక్కో ఖాతా నుంచి రూ.1,000 ఉపసంహరణకే అనుమతించింది. తర్వాత ఈ పరిమితిని క్రమంగా పెంచుతూ ఇప్పుడు రూ.40,000 చేసింది. బ్యాంకు వద్ద అందుబాటులో ఉన్న నిధుల లభ్యత, చెల్లింపుల సామర్థ్యాన్ని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో బ్యాంకు ప్రస్తుత కస్టమర్లలో 77 శాతం మంది తమ పూర్తి డబ్బులను వెనక్కి పొందేందుకు వీలు కలుగుతుందని ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకులో మోసపూరిత లావాదేవీలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను తన అడ్మినిస్ట్రేటర్‌ నియమించినట్టు తెలిపింది. ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్‌, అలాగే, ఆర్‌బీఐ నియమించిన ముగ్గురు సభ్యుల అడ్వైజరీ కమిటీ కార్యకలాపాల విషయంలో బ్యాంకు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్టు పేర్కొంది. పీఎంసీ బ్యాంకు తన మొత్తం రూ.8,800 కోట్ల లోన్‌బుక్‌లో ఒ‍క్క హెచ్‌డీఐఎల్‌కే 70 శాతం వరకు అక్రమంగా రుణాలు ఇచ్చినట్టు వెలుగు చూసిన విషయం గమనార్హం. 
రూ.3,830 కోట్ల ఆస్తులు సీజ్‌: ఈడీ
పీఎంసీ బ్యాంకు మనీ లాండరింగ్‌ కేసులో రూ.3,830 కోట్ల ఆస్తులను సీజ్‌ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రకటించింది. హెచ్‌డీఐఎల్‌, కంపెనీ డైరెక్టర్లు, పీఎంసీ బ్యాంకు అధికారులు, ఇతరుల ఆస్తులను మదింపు చేసే పనిలో ఉన్నట్టు తెలిపింది. 



You may be interested

9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు

Tuesday 15th October 2019

రుణ మేళాలో బ్యాంకుల జోరు... డిపాజిట్లకు బీమా పెంపు పరిశీలన కేంద్ర ఆర్థిక శాఖా ప్రకటన న్యూఢిల్లీ: పండుగుల సీజన్‌లో మార్కెట్లో రుణ వితరణ పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... అక్టోబర్‌ 1 నుంచి 9 వరకు తొమ్మిది రోజుల్లో బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ సోమవారం

బలహీన చైనా ఆర్థిక డేటా..నష్టాల్లో చమురు

Tuesday 15th October 2019

చైనా ఆర్థిక డేటా సెప్టెంబర్‌ నెలకు సంబంధించి బలహీనంగా వెల్లడికావడం,  యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు పెరగడంతో చమురు ధరలు మంగళవారం సెషన్‌లో కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.76 శాతం నష్టపోయి బారెల్‌ 58.90 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.63 శాతం నష్టపోయి 53.25 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడంతో పాటు యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా టారీఫ్‌లు పెంచుకోవడం వంటి

Most from this category