News


పెట్రోల్‌ బంకుల నిబంధనలు సరళతరం

Thursday 24th October 2019
news_main1571886483.png-29089

  • చమురుయేతర సంస్థలూ ఏర్పాటు చేయొచ్చు
  • ప్రైవేట్, విదేశీ సంస్థలకు అవకాశాలు
  • ఇంధన రిటైలింగ్‌లో సంస్కరణలు
  • కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశీ ఇంధన రిటైలింగ్‌ రంగంలో భారీ సంస్కరణలకు ప్రభుత్వం తెరతీసింది. చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ నిబంధనలను సడలించింది. దీంతో.. అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఇంధనాల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు తోడ్పాటు లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ (సీసీఈఏ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. "వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయాలన్న లక్ష్య సాధనకు, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ కొత్త పాలసీ తోడ్పడనుంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుంది. మరిన్ని రిటైల్‌ అవుట్‌లెట్స్‌ రాకతో పోటీ పెరిగి, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి" అని సీసీఈఏ సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జావదేకర్‌ తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న ఇంధన మార్కెటింగ్‌ నిబంధనలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2002లో అమల్లోకి వచ్చినవి. తాజాగా అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీటిని ప్రభుత్వం సవరించింది. ప్రస్తుత మార్పులతో పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల విక్రయానికీ ఊతం లభించనుంది.

ప్రధానాంశాలు...
పెట్రోల్‌ బంకులపై సీసీఈఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై విడుదల చేసిన ప్రకటనలో ప్రధానాంశాలు..
- పెట్రోల్‌ బంకు లైసెన్సులు పొందే సంస్థలు .. కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోగా కొత్త తరం ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, బయోఫ్యూయల్స్‌లో ఏదో ఒకదానికి అవుట్‌లెట్‌ లేదా ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
- రూ. 250 కోట్ల నికర విలువ గల కంపెనీలు .. పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌కి అనుమతులు పొందవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంధన రిటైలింగ్‌ లైసెన్సు పొందాలంటే హైడ్రోకార్బన్స్‌ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్, పైప్‌లైన్స్‌ లేదా ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్స్‌ వంటి వాటిపై రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటోంది. ఇంధనాల మార్కెటింగ్‌పై ఆసక్తి ఉన్న కంపెనీలకు.. ఈ నిబంధన ప్రతిబంధకంగా ఉంటోంది.
- ఇంధన విక్రయ కార్యకలాపాలు ప్రారంభించిన రిటైలర్లు.. అయిదేళ్లలోగా మొత్తం అవుట్‌లెట్స్‌లో అయిదు శాతం అవుట్‌లెట్స్‌ను నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

కమిటీ సిఫార్సులివీ..
పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన విక్రయాల అనుమతులకు సంబంధించిన నిబంధనల సమీక్ష కోసం గతేడాది అక్టోబర్‌లో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ప్రముఖ ఆర్థికవేత్త కిరీట్‌ పారిఖ్, చమురు శాఖ మాజీ కార్యదర్శి జీసీ చతుర్వేది, ఐవోసీ మాజీ చైర్మన్‌ ఎంఏ పఠాన్, ఐఐఎం అహ్మదాబాద్‌ డైరెక్టర్‌ ఎరాట్‌ డిసౌజా, పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్‌ జిందాల్‌ తదితరులు ఇందులో ఉన్నారు. బంకులు ఏర్పాటు చేయాలంటే.. ఇంధన రంగంలో రూ. 2,000 కోట్ల పెట్టుబడులు తప్పనిసరన్న నిబంధనను ఎత్తివేయాలంటూ ఈ కమిటీ సిఫార్సు చేసింది. అదే సమయంలో బంకులు ఏర్పాటు చేసే సంస్థలు తాము నిబంధనలు పాటించని పక్షంలో బ్యాంకు గ్యారంటీని ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకునేందుకు అంగీకారం తెలపాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే నిర్దేశిత గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 5 శాతం బంకులు ఏర్పాటు చేయాలన్న నిబంధన పాటించకపోతే.. ఒక్కో బంకుకు రూ. 3 కోట్ల మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ షరతు నుంచి మినహాయింపు కోరుకునే సంస్థలు ముందుగానే ఒక్కో దానికి రూ. 2 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 

దిగ్గజాల ఎంట్రీకి మార్గం..
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు భారత ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం కానుంది. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ ఎస్‌ఏ, సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో, బ్రిటన్‌ దిగ్గజం బీపీ, ప్యూమా ఎనర్జీ తదితర సంస్థలు భారత్‌లోని ఇంధన రిటైలింగ్‌ రంగంపై ఆసక్తిగా ఉన్నాయి. దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌తో కలిసి టోటల్‌ .. 2018 నవంబర్‌లోనే సుమారు 1,500 పెట్రోల్, డీజిల్‌ విక్రయాల అవుట్‌లెట్స్‌ ఏర్పాటు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. పెట్రోల్‌ బంకుల కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో అటు బీపీ కూడా జట్టు కట్టింది.  ప్యూమా ఎనర్జీ రిటైల్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా, ఆరామ్‌కో ఇంకా చర్చల్లో ఉంది. 

ప్రభుత్వ సంస్థల హవా..
ప్రస్తుతం ఇంధన విక్రయాల్లో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌)లదే హవా ఉంటోంది. వీటికి దేశవ్యాప్తంగా మొత్తం 65,554 అవుట్‌లెట్స్‌ ఉన్నాయి.  27,981 బంకులతో ఐవోసీ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో హెచ్‌పీసీఎల్‌ (15,584), బీపీసీఎల్‌ (15,078) ఉన్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌) రాయల్‌ డచ్‌ షెల్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలు కూడా మార్కెట్లో ఉన్నప్పటికీ.. వీటికి పరిమిత స్థాయిలోనే కార్యకలాపాలు ఉన్నాయి. రిలయన్స్‌కి 1,400 అవుట్‌లెట్స్‌ ఉండగా, నయారాకు 5,344, షెల్‌కు కేవలం 160 బంకులు ఉన్నాయి. 

 



You may be interested

ఇన్ఫీపై సెబీ విచారణ

Thursday 24th October 2019

సీఈవో మీద ఆరోపణలపై దృష్టి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కోణంలోనూ దర్యాప్తు విచారణకు మేనేజ్‌మెంట్‌ను పిలిచే అవకాశం న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ విలీనం

Thursday 24th October 2019

పునరుద్ధరణకు రూ. 68,751 కోట్ల ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపు, వీఆర్‌ఎస్‌ పథకం ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం

Most from this category