News


ఈ-కామర్స్ నిబంధనలతో ఆఫ్‌లైన్ రిటైలర్లకు లబ్ధి

Tuesday 15th January 2019
Markets_main1547534658.png-23595

  •  రూ. 12,000 కోట్ల దాకా పెరగనున్న ఆదాయాలు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థల నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఆఫ్‌లైన్ రిటైలర్లకు (బీఎం రిటైల్ స్టోర్స్‌) గణనీయంగా ప్రయోజనం చేకూరనుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో బీఎం రిటైల్‌ స్టోర్స్ ఆదాయం 150-200 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చని, విలువపరంగా చూస్తే ఇది సుమారు రూ. 10,000-12,000 కోట్ల మేర ఉండొచ్చని పేర్కొంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఈ-కామర్స్ సంస్థలు తమ వ్యాపార విధానాలను మార్చుకోవాల్సి రానుండటం, ఫలితంగా వాటి ఆదాయాలు మందగించనుండటం ఇందుకు కారణం కాగలవని వివరించింది. విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్ సంస్థలు తమకు వాటాలున్న ఇతర సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంలపై విక్రయించకుండా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు.. ప్రధానంగా పెద్ద సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లపై గట్టిగా ప్రభావం చూపనున్నాయి. కఠినతర నిబంధనల కారణంగా ఈ-కామర్స్ పరిశ్రమ అమ్మకాలు సుమారు 35-40 శాతం మేర (దాదాపు రూ. 35,000- 40,000 కోట్లు) దెబ్బతినొచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి చెప్పారు.
దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌పై ప్రభావం..
ఈ-కామర్స్ కంపెనీల ఆదాయాల్లో అత్యధిక వాటా ఉండే దుస్తులు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఎక్కువగా ప్రభావం పడొచ్చని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ-టెయిలర్స్‌ నష్టపోయే ఆదాయాల్లో కనీసం నాలుగో వంతు వాటానైనా ఆఫ్‌లైన్ రిటైలర్లు అందిపుచ్చుకోగలిగితే వాటి ఆదాయాలు దాదాపు రూ. 10,000-12,000 కోట్ల మేర పెరగొచ్చని సేఠి తెలిపారు. 2014-18 మధ్యకాలంలో ఈ-కామర్స్ వ్యాపారం ఏటా 40 శాతం వృద్ధితో రూ. 1 లక్ష కోట్లకు చేరింది. అదే సమయంలో ఆఫ్‌లైన్ రిటైలర్ల వ్యాపారం కేవలం 13 శాతం వృద్ధితో రూ. 3.2 లక్షల కోట్లకు చేరింది. గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ. 95,000 కోట్ల పైగా విదేశీ పెట్టుబడులు రావడం ఈ-కామర్స్ సంస్థలకు ఊతంగా నిల్చిందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి చెప్పారు. ఆఫ్‌లైన్‌ రిటైలర్లతో పోలిస్తే ఈ-కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన రేట్లతో మార్కెట్లోకి చొచ్చుకుపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కఠిన నిబంధనలతో ఈ సంస్థలు కాస్త ఇబ్బందిపడినా.. దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.You may be interested

మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!

Tuesday 15th January 2019

2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఆవిష్కరణ భారత మార్కెట్‌ కోసం సూపర్‌ లాంబ్రెటాపై కసరత్తు ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్‌ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్‌ సైకిల్‌ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్‌ బ్రాండ్‌ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు

Tuesday 15th January 2019

రుణ హామీ, వడ్డీ సబ్సిడీ కల్పించే యోచనలో కేంద్రం న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలను ప్రోత్సహించే దిశగా కొత్త విధానంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 100 కోట్ల దాకా టర్మ్ రుణాలకు హామీనివ్వడం, రూ. 1,000 కోట్ల దాకా రుణాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీనివ్వడం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. "కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం గానీ.. ఇప్పటికే ఉన్న

Most from this category