News


మెగా బీమా సంస్థ

Wednesday 19th June 2019
news_main1560926137.png-26406

  • మూడు జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల విలీన ప్రతిపాదన
  • అటుపై న్యూ ఇండియా అష్యూరెన్స్‌తో కలయిక
  • ఎల్‌ఐసీ తరహా దిగ్గజం ఏర్పాటుపై కేంద్రం కసరత్తు
  • ఇక ప్రభుత్వ రంగంలో ఒకే సాధారణ బీమా సంస్థ

న్యూఢిల్లీ: జీవిత బీమాకు సంబంధించి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తరహాలో... ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలన్నింటినీ కలిపి ఒకే దిగ్గజ సంస్థగా ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ గొడుగు కిందికి మిగతా మూడింటినీ తెచ్చే దిశగా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం న్యూ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్, నేషనల్‌ ఇన్సూరెన్స్, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థలు నాలుగూ సాధారణ బీమా సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో న్యూ ఇండియా అష్యూరెన్స్‌ దేశంలోనే అతి పెద్ద జనరల్‌ ఇన్సూరర్‌ కాగా, లిస్టెడ్‌ కంపెనీ కూడా. గతంలో దీన్ని ప్రత్యేకంగా కొనసాగనిస్తూ, మిగతా మూడింటిని కలిపేయడం ద్వారా ప్రభుత్వ రంగంలో రెండు భారీ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. 2019 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఓరియంటల్, నేషనల్, యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌లను కలిపి ఒకటిగా చేసి.. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ను విడిగా ఉంచాలని యోచించింది. ఈ మూడు సంస్థలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు. అయితే, తాజాగా ఈ ప్రతిపాదన మారింది. 
కొత్త ప్రణాళిక ఇలా...
ఇప్పటికే ఈ రంగంలో అనేక ప్రైవేట్‌ కంపెనీలు మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతూ ఉన్నాయి. మళ్లీ ప్రభుత్వ రంగంలో రెండు పెద్ద కంపెనీలు ఏర్పాటు చేస్తే.. ఈ రెండూ ఒకదాని వాటా మరొకటి కొల్లగొట్టే అవకాశం ఉంది. దీంతో గత ప్రతిపాదన పక్కన పెట్టి కొత్తది రూపొందించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం.. ముందుగా అన్‌లిస్టెడ్‌ సంస్థలు మూడింటినీ విలీనం చేస్తారు. ఆ తర్వాత న్యూ ఇండియా అష్యూరెన్స్‌.. ఈ సంస్థను కొనుగోలు చేస్తుంది. ఈ ప్రక్రియలో వాటాల విక్రయ రూపంలో ప్రభుత్వానికి కూడా కొంత లబ్ధి చేకూరనుంది. అయితే, ఇదంతా న్యూ ఇండియా కొనుగోలు సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థూల ప్రీమియం పరంగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మే నెలాఖరు నాటి గణాంకాల ప్రకారం న్యూ ఇండియాకు 16.80 శాతం మార్కెట్‌ వాటా ఉంది. మూడు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల మార్కెట్‌ వాటా 25 శాతంగా ఉంది. నష్టాల్లో ఉన్న పోర్ట్‌ఫోలియోలను సవరించుకోవాలని, క్లెయిమ్‌ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపర్చుకోవాలని కొన్నేళ్లుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలకు సూచిస్తూ వస్తోంది. మరోవైపు మూడు చిన్న సంస్థలను విలీనం చేసి, అవి కాస్త స్థిరపడే దాకా సమయం ఇవ్వడం శ్రేయస్కరమని ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మాజీ చైర్మన్‌ ఆర్‌కే కౌల్‌ అభిప్రాయపడ్డారు. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ భేషుగ్గానే రాణిస్తోందని, అంతర్జాతీయ స్థాయిలో కూడా గణనీయంగా కార్యకలాపాలున్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి సందర్భంలో కార్యకలాపాలకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోవడం సరికాకపోవచ్చన్నారు. 
మూలధన అవసరాలపైనా దృష్టి...
ప్రభుత్వ రంగ బీమా సంస్థల నష్టాలు 2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,012 కోట్లుగా ఉండగా, 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.12,603 కోట్లకు తగ్గాయి. తాజా విలీన యోచన నేపథ్యంలో ఆయా సంస్థల మూలధన అవసరాల అంశంపైనా ప్రభుత్వం దృష్టి పెడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఐఆర్‌డీఏఐ ఇచ్చిన వెసులుబాటుతో ఓరియంటల్, యునైటెడ్, నేషనల్‌ సంస్థలు 2018 మార్చి ఆఖరు నాటికి తప్పనిసరైన 1.50 శాతం సాల్వెన్సీ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. బీమా పాలసీలకు జరపాల్సిన చెల్లింపులకు మించి అదనంగా ఉండే మూలధనం, అసెట్స్‌ విలువను సాల్వెన్సీ నిష్పత్తిగా వ్యవహరిస్తారు. అనూహ్య, అత్యవసర పరిస్థితులేమైనా తలెత్తినా కూడా క్లెయిమ్స్‌ను సెటిల్‌ చేయగలిగేందుకు బీమా సంస్థ దగ్గర ఉన్న నిధుల పరిస్థితులను ఇది సూచిస్తుంది.You may be interested

బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి

Wednesday 19th June 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ ఆర్ధిక సంవత్సరంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వాణిజ్య వాహనమైన బొలెరో అమ్మకాల్లో 12 శాతం వృద్ధిని లక్ష్యించింది. గత ఆర్ధిక సంవత్సరంలో 1.62 లక్షల వాహనాలను, 2018 ఆర్ధికంలో 1.49 లక్షలను విక్రయించామని.. ఏడాదిలో 9 శాతం వృద్ధిని నమోదు చేశామని ఎం అండ్‌ ఎం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌– ఆటోమోటివ్‌ డివిజన్‌) విక్రమ్‌ గార్గా తెలిపారు. మంగళవారం కొత్త బొలెరో క్యాంపర్‌ను

గో ఎయిర్‌ చౌక ధరలు

Wednesday 19th June 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ గో ఎయిర్‌ మినికేషన్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి పలు నగరాలకు టికెట్‌ ధరలను రూ.1,798 నుంచి ఆఫర్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1,798, బెంగళూరు, లక్నో రూ.1,799, కోల్‌కత రూ.1,983, కొచ్చి రూ.2,499, ఢిల్లీకి రూ.2,599 చార్జీ చేస్తారు. బుకింగ్‌ పీరియడ్‌ జూన్‌ 18 నుంచి 23 వరకు ఉంది. జూలై 1 నుంచి సెప్టెంబరు 30లోగా కస్టమర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

Most from this category