News


త్వరలో మారుతీ ఎలక్ట్రిక్ కారు

Wednesday 29th May 2019
Markets_main1559111270.png-25978

  • వచ్చే ఏడాది ప్రవేశపెట్టే అవకాశం
  • ప్రస్తుతం ప్రయోగదశలో 50 ఎలక్ట్రిక్‌ వాగన్‌ఆర్‌లు
  • మారుతీ సుజుకీ చైర్మన్ భార్గవ వెల్లడి

న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తాజాగా చిన్న ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. విద్యుత్ వాహనాల రేట్లు భారీగా ఉండటం, చార్జింగ్‌ సదుపాయాలు తగినంత లేకపోవడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది తొలి విద్యుత్ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2020 నాటికల్లా వాహనం సిద్ధమవుతుందని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ మంగళవారమిక్కడ చెప్పారు. అయితే, ఎలక్ట్రిక్ వెర్షన్‌కు అధిక ధర చెల్లించేందుకు కొనుగోలుదారులు ఎంత మేరకు ఆసక్తిగా చూపుతారన్న దానిపై ఈ కారును పూర్థి స్థాయిలో మార్కెట్లోకి తేవడం ఆధారపడి ఉంటుందని ఆయన తెలియజేశారు. "వ్యాగన్‌ఆర్ ఎలక్ట్రిక్‌ కారు ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. వచ్చే ఏడాదికి సిద్ధమవుతుంది. కానీ, ధర, చార్జింగ్‌ సదుపాయాల పరమైన పరిమితులను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు ఎలక్ట్రిక్ కారును కొనేందుకు ఎంత ఆసక్తిగా ఉన్నారన్న దానిపైనే ఉత్పత్తి, విక్రయాలు ఆధారపడి ఉంటాయి" అని భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుతం మారుతీ సుజుకీ దాదాపు 50 ఎలక్ట్రిక్ వ్యాగన్‌ఆర్‌లను పరీక్షిస్తోంది.
ధర దాదాపు రూ.12 లక్షలు...
ప్రస్తుత ప్రమాణాలు, నియమ నిబంధనలు బట్టి చూస్తే చిన్న కారు ఎలక్ట్రిక్ వెర్షన్ ధర దాదాపు రూ.12 లక్షల దాకా ఉండవచ్చని మారుతీ సుజుకీ ఎండీ కెనిచి అయుకావా ఇటీవల తెలిపారు. వ్యాగన్ఆర్‌ పెట్రోల్ వెర్షన్ రేటు ఇందులో సగమే. పెట్రోల్ వెర్షన్ వ్యాగన్‌ఆర్‌ ధర ఢిల్లీలో రూ. 4.20- 5.70 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. రేటులో భారీ వ్యత్యాసాలున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కారును వాణిజ్యపరంగా మార్కెట్లోకి తెచ్చే అంశంపై మారుతీ మరింతగా అధ్యయనం చేస్తున్నట్లు అయుకావా చెప్పారు. "తయారీ సంస్థల కారణంగానే వ్యాపారాలు నడుస్తాయనుకోవడం అపోహే. కస్టమర్ల ఇష్టాఇష్టాలు బట్టే వ్యాపారం నడుస్తుంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ సగటు చిన్న కారు కస్టమర్ల కొనుగోలు సామర్ధ్యానికి అనేక రెట్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ కారు ధర ఉండవచ్చు" అని భార్గవ పేర్కొన్నారు. సంప్రదాయ ఇంధనాలను ఉపయోగించే వాహనాలపై విధించే 28 శాతం పన్నుతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై కాస్త తక్కువగా 12 శాతమే పన్ను ఉంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం రెండో విడతలో ప్రైవేట్ వినియోగానికి కొనుక్కునే విద్యుత్ కార్ల కొనుగోళ్లపై ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని కేంద్రం దాదాపు నిలిపివేసింది. 
చార్జింగ్ సదుపాయం కీలకం..
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు అత్యంత పెద్ద సవాలు చార్జింగ్‌పరంగానే ఉంటోంది. సాధారణంగా చాలా మంది చిన్న కార్ల ఓనర్లు తమ వాహనాలను ఆరుబయటే పార్క్‌ చేస్తుంటారు. అలాంటి చోట్ల నిరంతరం చార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే తప్ప ఎలక్ట్రిక్ వాహనాల వైపు కొనుగోలుదారులు పెద్ద యెత్తున మళ్లే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని భార్గవ తెలిపారు. "వాహనాలను ఎక్కడ చార్జింగ్ చేసుకుంటారు? చార్జింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలెక్కడ?" అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, దేశీయంగా ప్రైవేట్ ఫోర్ వీలర్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఊపందుకోవాలంటే ఇంకా చాలాకాలం పట్టేస్తుందని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ అసోసియేట్ డైరెక్టర్ పునీత్ గుప్తా అభిప్రాయపడ్డారు. "కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండే సంపన్న దేశాల్లో కూడా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత ఫేమ్ (2023 తర్వాత) పథకం నిలిపివేసినప్పట్నుంచీ కేంద్రం ఏ రకమైన విధానాలు అమలు చేస్తుందన్న దానిపై భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది" అని గుప్తా తెలిపారు. అప్పటికల్లా ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కొంత మేర చార్జింగ్‌పరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాయని, బ్యాటరీ ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే, వాహనాల ధర ప్రస్తుతమున్న 10,000 డాలర్ల స్థాయి నుంచి సగటున 12,500- 13,000 డాలర్ల దాకా పెరగొచ్చని పేర్కొన్నారు. అప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించేకునేందుకు అనువైన వ్యవస్థ ఏర్పడగలదని గుప్తా చెప్పారు. ప్రస్తుతం నియంత్రణ సంస్థలపరమైన నిబంధనలు, అర కొర చార్జింగ్ వసతులు వంటి పరిమితులు అనేకం ఉన్నాయని హ్యుందాయ్ మోటార్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం హెడ్ ఆల్బర్ట్ బీయెర్‌మాన్‌ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా ట్యాక్సీ సేవల సంస్థలు వీటిని కాస్త ఎక్కువగా వినియోగించే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్ యూజర్ల కోసం హ్యుందాయ్ కొత్తగా హైబ్రీడ్ వాహనాలను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తోంది. ముందుగా ఎస్‌యూవీ కోనా ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను ఈ ఏడాది అందుబాటులోకి తేవడంపై దృష్టి పెట్టింది. 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Wednesday 29th May 2019

పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లాభానికి భారీ గండి హైదరాబాద్‌, బిజినెస్‌బ్యూరో: విలువ ఆధారిత ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల కంపెనీ పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సగం మేర తరిగిపోయింది. రూ.585 కోట్ల ఆదాయంపై రూ.24 కోట్ల లాభాన్ని నమోదు చేయగా, షేరువారీ ఆర్జన రూ.1.59గా ఉంది. అంతక్రితం ఏడాది (2017-18) మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.503

అరబిందో లాభం రూ.585 కోట్లు

Wednesday 29th May 2019

10 శాతం పెరుగుదల అమెరికా వ్యాపారంలో భారీ వృద్ధి హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (మార్చి క్వార్టర్లో) రూ.585 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2017-18) నమోదైన రూ.528 కోట్లతో పోలిస్తే సుమారు 10 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు, ఆదాయం దాదాపు 30 శాతం వృద్ధితో రూ.4,049 కోట్ల నుంచి

Most from this category