News


మళ్లీ మార్కెట్లోకి లాంబ్రెటా!

Tuesday 15th January 2019
news_main1547535172.png-23596

  • 2020 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఆవిష్కరణ
  • భారత మార్కెట్‌ కోసం సూపర్‌ లాంబ్రెటాపై కసరత్తు
  • ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి

దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం రెట్రో ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగి.. కనుమరుగైపోయిన పాత బ్రాండ్స్‌ ఒక్కొక్కటిగా మళ్లీ తిరిగొస్తున్నాయి. ఇటీవలే జావా మోటార్‌ సైకిల్‌ రీఎంట్రీ ఇవ్వగా .. తాజాగా సుమారు మూడు దశాబ్దాల తర్వాత స్కూటర్‌ బ్రాండ్‌ లాంబ్రెటా కూడా పునరాగమనానికి సిద్ధమవుతోంది. లాంబ్రెటా తయారీ సంస్థ ఇన్నోసెంటి ఈ విషయం తెలియజేసింది. 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో లాంబ్రెటా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నమూనాను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా ఉక్కుతో తయారు చేసే సూపర్‌ లాంబ్రెటాను డిజైన్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుత లాంబ్రెటాతో పోలిస్తే పరిమాణంలో మరింత పెద్దగా ఉండే సూపర్‌ లాంబ్రెటా డిజైనింగ్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎక్స్‌పోలో ప్రదర్శించబోయే లాంబ్రెటా ఎలక్ట్రిక్‌ ప్రస్తుతం మిలన్‌లో రూపుదిద్దుకుంటోంది. ప్రత్యర్థి సంస్థ పియాజియో వెస్పా ఎలట్రికా స్కూటర్‌కు పోటీగా దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఇన్నోసెంటి ఉంది. లాంబ్రెటా ఉత్పత్తులను గతంలో స్కూటర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌) భారత్‌లో విక్రయించేది. అప్పట్లో లాంబ్రెటా స్కూటర్స్‌ను విజయ్‌ సూపర్‌ పేరుతో, త్రిచక్రవాహనాలను విక్రమ్‌ పేరుతో ఉత్పత్తి చేసింది. 1997లో లాంబ్రెటా స్కూటర్స్‌ తయారీని పూర్తిగా నిలిపివేసిన ఎస్‌ఐఎల్‌ ఆ తర్వాత పూర్తిగా త్రిచక్ర వాహనాల ఉత్పత్తికే పరిమితమైంది. స్కూటర్‌ ఇండియాతో ట్రేడ్‌మార్క్‌ వివాదాలను పరిష్కరించుకుంటున్న ఇన్నోసెంటి మళ్లీ ఇన్నాళ్లకు లాంబ్రెటాను అందుబాటులో తేబోతోంది.
లోహియా ఆటోతో జట్టు..
భారత్‌లో లాంబ్రెటాల తయారీ కోసం నోయిడా కేంద్రంగా పనిచేసే లోహియా ఆటోతో ఇన్నోసెంటి జట్టు కట్టింది. ప్లాంటుపై కసరత్తు కూడా జరుగుతోంది. ముంబైకి దగ్గర్లో... పుణె పారిశ్రామిక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆటోమొబైల్‌ దిగ్గజాలైన టాటా మోటార్స్, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మెర్సిడెస్‌ బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ మొదలైన వాటి ప్లాంట్లు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. భారత్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో ఇటు దేశీ మార్కెట్‌తో పాటు అటు పొరుగుదేశాలు, ఆఫ్రికా మార్కెట్‌కి కూడా అవసరమైన స్థాయిలో స్కూటర్లు తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది.
ప్రీమియం మార్కెట్‌..
విలాసవంతమైన లాంబ్రెటా స్కూటర్లతో ప్రీమియం సెగ్మెంట్‌ కస్టమర్ల దృష్టిని ఆకర్షించాలని ఇన్నోసెంటి భావిస్తోంది. ఇటాలియన్‌ డిజైన్‌లోని సృజనాత్మకతతో యువ కస్టమర్లకు చేరువ కావాలని యోచిస్తోంది. అయితే, అప్పట్లో బజాజ్‌ చేతక్, వెస్పాలతో పోటీలో చాలా దూరంలో ఉండిపోయిన లాంబ్రెటాకు ఇది సాధ్యపడుతుందా? అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కానీ, ఇన్నోసెంటి టార్గెట్‌ చేసుకుంటున్న ప్రీమియం విభాగంలో ప్రస్తుతం గణనీయంగా వ్యాపార అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించగలిగే ఫీచర్స్‌ లాంబ్రెటాలో పుష్కలంగా ఉంటాయంటున్నాయి. ఇందుకు జావాకి వచ్చిన బుకింగ్సే ఉదాహరణ అని చెబుతున్నాయి. వింటేజ్‌ బ్రాండ్‌గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా మంచి సక్సెస్‌ సొంతం చేసుకుందని పేర్కొన్నాయి. పెరుగుతున్న ఆదాయాలతో ప్రీమియం సెగ్మెంట్‌లో శక్తిమంతమైన వాహనాల అమ్మకాలు మెరుగ్గానే ఉంటున్నాయి. మైలేజీ మొదలైన వాటితో సంబంధం లేకుండా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను రోజువారీ పనులపై తిరిగేందుకు ఉపయోగించే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంటోంది. మరోవైపు, జావా అనేది మోటార్‌సైకిల్‌ విభాగానికి చెందినది కావడంతో దాన్ని లాంబ్రెటాతో పోల్చి చూడటం సరికాకపోవచ్చని మరికొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలే మళ్లీ భారత్‌లో ప్రవేశించిన మరో ఇటాలియన్‌ బ్రాండ్‌ వెస్పా ధోరణులే ఇందుకు నిదర్శనమని చెబుతున్నాయి. వెస్పా క్రమక్రమంగా అమ్మకాలు పెంచుకుంటున్నప్పటికీ.. ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో మార్కెట్‌లో పట్టు సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీమియం సెగ్మెంట్‌లో అడుగుపెట్టాలనుకుంటున్నా లాంబ్రెటా పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి.You may be interested

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లాభం 34 శాతం డౌన్‌

Tuesday 15th January 2019

18 శాతం తగ్గిన ఆదాయం న్యూఢిల్లీ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 34 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.154 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.101 కోట్లకు తగ్గిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.494 కోట్ల నుంచి 18 శాతం తగ్గి రూ.405 కోట్లకు చేరిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు సమస్యలు

ఈ-కామర్స్ నిబంధనలతో ఆఫ్‌లైన్ రిటైలర్లకు లబ్ధి

Tuesday 15th January 2019

 రూ. 12,000 కోట్ల దాకా పెరగనున్న ఆదాయాలు న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థల నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ఆఫ్‌లైన్ రిటైలర్లకు (బీఎం రిటైల్ స్టోర్స్‌) గణనీయంగా ప్రయోజనం చేకూరనుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో బీఎం రిటైల్‌ స్టోర్స్ ఆదాయం 150-200 బేసిస్ పాయింట్ల మేర పెరగొచ్చని, విలువపరంగా చూస్తే ఇది సుమారు రూ. 10,000-12,000 కోట్ల మేర ఉండొచ్చని పేర్కొంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఈ-కామర్స్

Most from this category