News


కోటక్‌ ఖాతాలో యస్‌ బ్యాంక్‌ !

Wednesday 18th December 2019
news_main1576641176.png-30280

యస్‌ బ్యాంక్‌ విలీనం  
కోటక్‌ బ్యాంకే కరెక్టన్న ఎస్‌బీఐ అధిపతి 
ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ 
విలీన వ్యాఖ్యలను కొట్టిపారేసిన కోటక్‌, యస్‌బ్యాంక్‌లు 

ముంబై: యస్‌బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకే కరెక్టని ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌లు  అభిప్రాయపడ్డారు. అయితే విలీన ప్రయత్నాలు అసలే లేవని యస్‌బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు స్పష్టం చేశాయి. 

కోటక్‌కే ఆ సత్తా...
యస్‌బ్యాంక్‌ను కొనుగోలు చేయగల సత్తా ఉదయ్‌ కోటక్‌కే ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. యస్‌బ్యాంక్‌ను టేకోవర్‌ చేయడానికి భారీగా నిధులు అవసరమని, ఆ సత్తా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కే ఉందని వివరించారు. ఇక్కడ జరిగిన టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా ఎకనామిక్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. కాగా ఇదే అభిప్రాయాన్ని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ అమితాబ్‌ చౌధురి వ్యక్తం చేశారు. తమ బ్యాంక్‌  ఇప్పటికింకా చిన్నదేనని, పెద్ద బ్యాంక్‌గా వృద్ధి చెందే ప్రయత్నాలు చేస్తున్నామని, పెద్ద బ్యాంక్‌గా మారినప్పుడే ఇతర బ్యాంక్‌లను కొనుగోలు చేయగలమని ఆయన పేర్కొన్నారు. 
ఊసుపోని ఊహాగానాలు
ఈ కొనుగోలు వార్తలు ఊసుపోని ఊహాగానాలని యస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రవ్‌నీత్‌ గిల్‌ కొట్టిపడేశారు. విలీన​‍ప్రయత్నాలు ఏమీ లేవని తెగేసి చెప్పారు. కాగా విలీన వ్యాఖ్యలు ఆయా వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమేనని, తమకెలాంటి సంబంధం లేదని కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ చీఫ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ రోహిత్‌ రావు పేర్కొన్నారు. 
భారతీయుల నియంత్రణలోనే....
విదేశీయుల పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ, భారతీయుల నియంత్రణలోనే ఆర్థిక రంగం ఉండాలని కోరుకుంటున్నానని ఇదే సమావేశంలో పాల్గొన్న ఉదయ్‌ కోటక్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లోని కంపెనీల్లో వాటాలను విదేశీ సంస్థలకు విక్రయించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

యస్‌బ్యాంక్‌ చీఫ్‌గా రవ్‌నీత్‌ గిల్‌ పగ్గాలు చేపట్టి మొండి బకాయిల గుర్తిపు ప్రక్రియను మరింత వేగిరం చేశారు. దీంతో ఈ బ్యాంక్‌ నిధులన్నీ అంతే వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు నిధుల సమీకరణ ప్రయత్నాలు ఫలప్రదం కావడం లేదు. దీంతో ఈ బ్యాంక్‌ను చేజిక్కించుకోనే యత్నాలు ఊపందుకుంటున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే టేకోవర్‌ వార్తలను యస్‌బ్యాంక్‌ ఎప్పిటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇక పుష్కలమైన నిధులతో కోటక్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చిన్నా, చితకా బ్యాంక్‌లను టేకోవర్‌ చేసి మరింత పెద్ద బ్యాంక్‌గా అవతరించడానికి కోటక్‌ బ్యాంక్‌ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. 



You may be interested

12,200 సమీపంలో నిఫ్టీ ప్రారంభం

Wednesday 18th December 2019

క్రితం రోజు రికార్డు గరిష్టస్థాయిని సృష్టించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం తిరిగి మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 34 పాయింట్లు పెరిగి 12,199 పాయింట్ల స్థాయిని నిఫ్టీ టచ్‌ చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 41,442 పాయింట్ల వద్ద మొదలయ్యింది. 

ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

Wednesday 18th December 2019

పైసా యాప్‌ ఆవిష్కరణ రూ. 1 లక్ష దాకా వ్యక్తిగత రుణాలు, ఉచిత క్రెడిట్ రిపోర్ట్‌లు తదితర సర్వీసులు న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా ఆర్థిక సేవల విభాగంలోకి ప్రవేశించింది. రుణాలు, మ్యూచువల్ ఫండ్స్‌, క్రెడిట్ స్కోర్ రిపోర్టులు అందించేందుకు 'రియల్‌మీ పైసా' పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాం ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో ప్రత్యర్థి సంస్థ షావోమీ ఇటీవలే 'మి క్రెడిట్' పేరుతో ఇలాంటి ఫైనాన్షియల్ సర్వీసులే ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణామం

Most from this category