News


రైతుల కోసం ‘కిసాన్‌ రైల్‌’

Sunday 2nd February 2020
news_main1580614016.png-31413

బడ్జెట్‌లో ప్రతిపాదించిన కేంద్ర ఆర్థిక మంత్రి
- రైల్వేకు రూ. 70 వేల కోట్ల కేటాయింపు
- ట్రాక్‌ల పక్కన పెద్దఎత్తున సోలార్‌ ప్లాంట్లు
- పీపీపీ విధానంలో 150 పాసింజర్‌ రైళ్లు
- పర్యాటక ప్రాంతాలను కలుపుతూ మరిన్ని తేజస్‌ రైళ్లు
- 2023 నాటికి ముంబై, అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు
- 27 వేల కి.మీ. మేర ట్రాక్‌ల విద్యుదీకరణ

న్యూఢిల్లీ: రైతులకు సహకారం కోసం ‘కిసాన్‌ రైల్‌’ను ఏర్పాటు చేస్తామని, ఇందులో రిఫ్రిజిరేటర్‌ కోచ్‌లు ఉంటాయని శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. త్వరగా పాడైపోయే పదార్థాలను తరలించడానికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి దేశ వ్యాప్తంగా ఆటంకాలు లేని జాతీయ సప్లయ్‌ చెయిన్‌ నిర్మాణాన్ని పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, గూడ్స్‌ రైళ్లకు కూడా రిఫ్రిజిరేటర్‌ కోచ్‌లను అనుసంధానిస్తామన్నారు. భారతీయ రైల్వేకు కేంద్ర బడ్జెట్‌లో రూ. 70,000 కోట్లు కేటాయించారు. ఇక రైల్వే విస్తరణ ప్రణాళికలను కొనసాగించేందుకు మూలధన వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో రూ. 1.61 లక్షల కోట్లకు పెంచారు. గత బడ్జెట్‌లో ఇది రూ. 1.56 లక్షల కోట్లుగా ఉంది. దీంతో ఈ ఏడాది ఇది మూడు శాతం పెరిగింది. రైల్వేకు మొత్తం బడ్జెట్‌ మద్దతును చూస్తే రూ. 5,21,608 కోట్లుగా ఉంది.    
కొత్త లైన్లకు రూ. 12 వేల కోట్లు
మౌలిక సదుపాయాల అభివృద్ధి కోణంలో కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 12,000 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. గేజ్‌ మార్పునకు రూ. 2,250 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ. 700 కోట్లు, ఇంజిన్లు, బోగీలు ఇతర రోలింగ్‌ స్టాక్‌నకు రూ. 5,786.97 కోట్లు, సిగ్నలింగ్‌, టెలికామ్‌ వ్యవస్థకు రూ. 1,650 కోట్లు కేటాయించారు. ప్రయాణికుల సదుపాయాల కల్పనకు రూ. 2,725.63 కోట్లు కేటాయించారు. సరుకు రవాణా 1,265 మెట్రిక్‌ టన్నులుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 3.4 శాతం అధికం. ప్రయాణికులు, సరుకు రవాణా ఇతర మార్గాల నుంచి ఆదాయాన్ని రూ. 2.25 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గత బడ్జెట్‌ సవరించిన అంచనాల మేరకు ఇది రూ. 2.06 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది 9.6 శాతం పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల నుంచి రూ. 61 వేల కోట్లు, సరుకు రవాణా నుంచి రూ. 1.47 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 
లైన్ల పక్కన భారీ సోలార్‌ ప్రాజెక్టులు
నెట్‌వర్క్‌ కోసం సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా ట్రాక్‌ల పక్కన రైల్వేకు చెందిన భూమిలో పెద్ద ఎత్తున సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని బడ్జెట్‌లో మంత్రి ప్రతిపాదించారు. అలాగే పీపీపీ విధానంలో 150 పాసింజర్‌ రైళ్ల ఏర్పాటు, నాలుగు స్టేషన్ల పునరాభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. ప్రసిద్ధ పర్యాటక స్థలాలను కలపడానికి మరిన్ని తేజస్‌ తరహా రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. రూ. 18,600 కోట్లు ఖర్చయ్యే 148 కి.మీటర్ల బెంగళూరు సబర్బన్‌ రవాణా ప్రాజెక్టును బడ్జెట్‌లో ప్రతిపాదించారు.  మెట్రో తరహాలో టికెట్‌ రేట్లు ఉంటాయన్నారు. ఈ ప్రాజెక్టుకు 20 శాతం ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, ప్రాజెక్టు ఖర్చులో 60 శాతం వరకూ బయట నుంచి సహాయం సమకూరుస్తామని పేర్కొన్నారు.
2023 నాటికి హైస్పీడ్‌ రైల్‌
ముంబై, అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ 2023కి పూర్తవుతుందని మంత్రి నిర్మల తెలిపారు. అలాగే చెన్నై, బెంగళూరు మధ్య రైల్‌ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు. 550 స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పించామని, అలాగే మానవరహిత క్రాసింగ్స్‌ను జీరో స్థాయికి తెచ్చామని చెప్పారు. 27 వేల కిలోమీటర్ల ట్రాక్‌ల విద్యుదీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక రెవెన్యూ ఖర్చులో జీతాలను రూ. 92,993.07 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 6 వేల కోట్లు ఎక్కువగా ఉంది. 
 You may be interested

మోదీ.. అర్జునుడేనా..?

Sunday 2nd February 2020

ఆర్థిక భారతం.. ఓ పద్మవ్యూహం దారుణంగా పడిపోయిన వృద్ధిరేటు.. నన్నెలా ఛేదిస్తారో చూస్తానంటూ సైంధవుడిలా సవాలు విసురుతోంది!!. ఎన్ని చర్యలు తీసుకున్నా దారికి రాని మందగమనం.. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ లాంటి కురువీరులను గుర్తుకుతెస్తోంది. ఎంత ప్రయత్నించినా కట్టడికాని ద్రవ్యలోటు... ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడి వంటి చక్రవ్యూహ సూత్రధారుల్ని  స్ఫురణకు తెస్తోంది. వెరసి.. అభేద్యమైన పద్మవ్యూహం లాంటి బంధంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కు పోయింది. 5 శాతానికి పతనమైన

ఎల్‌ఐసీ లిస్టింగ్‌- మెగా ఐపీవో

Sunday 2nd February 2020

సౌదీ అరామ్‌ కో తరహా రికార్డులకు చాన్స్‌  లిస్టయితే మార్కెట్‌ విలువలో ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ వెనక్కి తొలి ఏడాది ప్రీమియం రూ. 1.42 లక్షల కోట్లు కేపిటల్‌ మార్కెట్లో పెట్టుబడుల విలువ రూ. 28.74 లక్షల కోట్లు రూ. 31.11 లక్షల కోట్లను అధిగమించిన ఏయూఎం  ప్రస్తుతం ప్రభుత్వానికి 100 శాతం వాటా కొన్ని దశాబ్దాలుగా బీమాకు మారుపేరుగా నిలుస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తద్వారా సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. దేశీ బీమా రంగంలో 70 శాతం

Most from this category