News


మూడేళ్లలో ఇతర విత్తనాలదే మెజారిటీ!

Friday 10th May 2019
news_main1557471282.png-25653

  • పత్తి విత్తనాల వాటా 40 శాతానికి తగ్గుతుంది
  • వరి, కూరగాయల సీడ్స్‌పై దృష్టి పెడుతున్నాం
  • ఏటా 15-20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం
  • సరైన అవకాశం వస్తేనే విలీనాలు, టేకోవర్లు
  • కావేరీ సీడ్స్‌ సీఎండీ వి.భాస్కరరావు

సాక్షి, బిజినెస్‌ ప్రతినిధి: దేశంలో పత్తి పంట సంతృప్త స్థాయికి చేరుకుంటోందని, అందుకే తాము పత్తితో పాటు ఇతర విత్తనాల ఉత్పత్తిని విస్తరించేలా ప్రణాళికలు వేసుకుంటున్నామని హైదరాబాద్‌ కేంద్రంగా కొనసాగుతున్న విత్తన తయారీ దిగ్గజం కావేరీ సీడ్‌ కంపెనీ లిమిటెడ్‌ తెలియజేసింది. ప్రస్తుతం తాము ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్న విత్తనాల్లో పత్తి వాటా 55 శాతం ఉండగా... ఇతర విత్తనాల వాటా 45 శాతంగా ఉందని తెలియజేసింది. ‘‘ఇతర విత్తనాల వాటా పెంచుకోవాలని ప్రణాళికలు వేస్తున్నాం. కూరగాయలతో సహా వరి, జొన్న వంటి విత్తనాల మార్కెట్లో వాటా పెంచుకోవటానికి వేగంగా ముందుకెళుతున్నాం. ఈ చర్యలతో వచ్చే మూడేళ్లలో మా ఆదాయంలో వాటి వాటా 60 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టరు వి.భాస్కరరావు తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంఘటిత రంగంలో ఉన్న విత్తన సంస్థలు ఏటా రూ.15,000 కోట్ల విలువైన విత్తనాలను విక్రయిస్తున్నాయని, దీన్లో తమకు 8 నుంచి 10 శాతం వాటా ఉందని చెప్పారాయన. వచ్చే మూడేళ్లలో ఈ వాటాను 15 శాతానికి చేర్చాలన్న లక్ష్యం విధించుకున్నట్లు తెలియజేశారు. కూరగాయల విత్తనాలపై ఎక్కువగా  ఫోకస్‌ పెడుతున్నామని, దీన్ని 60--70 చోట్ల పరీక్షిస్తున్నామని చెప్పారాయన. ‘‘ఇప్పటికైతే మా విత్తన విక్రయాల్లో కూరగాయల వాటా 2 శాతమే. కానీ వచ్చే రెండేళ్లలో ఇది 10 శాతానికి చేరుతుందని భావిస్తున్నాం’’ అని చెప్పారాయన. గురువారం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు మిథున్‌ చంద్‌తో కలిసి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. తమ విదేశీ ఎగుమతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని, బంగ్లాదేశ్‌ వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలకూ ఎగుమతులు పెరుగుతున్నాయని చెప్పారాయన. 
15- 20 శాతం కాంపౌండిగ్‌ వృద్ధి
వచ్చే ఐదేళ్లూ తాము 15 నుంచి 20 శాతం చక్రగతిన వృద్ధి చెందుతామని కంపెనీ ఈడీ మిథున్‌ చంద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘విత్తన పరిశ్రమ ఏటా 10-12 వాతం చక్రగతిన వృద్ధి చెందుతోంది. మేం ఎప్పుడూ పరిశ్రమ సగటు కన్నా ముందంజలోనే ఉంటున్నాం. ఆ నమ్మకంతోనే 15-20 శాతం వృద్ధిని అంనా వేస్తున్నాం’’ అని చెప్పారాయన. ప్రస్తుతం దేశంలో సంఘటిత రంగంలో విక్రయిస్తున్న విత్తనాల్లో మూడో వంతు పత్తి విత్తనాలేనని చెప్పారాయన. వచ్చే ఐదేళ్లలో తమ విక్రయాల్లో వరి, కూరగాయల విత్తనాలను 15 శాతానికి చేర్చాలన్నది లక్ష్యమని, ప్రస్తుతం పత్తి స్థానాన్ని జొన్న పంట ఆక్రమిస్తోందని, అందులో కూడా తాము ముందంజలోనే ఉన్నామని ఆయన వివరించారు. ‘‘పత్తికి సంబంధించినంత వరకూ గుజరాత్‌లో మాదే అగ్రస్థానం. మహారాష్ట్రలోనూ ముందంజలో ఉన్నాం. ఇంకా రాజస్థాన్‌ వంటి చోట్ల కూడా విక్రయాలు పెరుగుతున్నాయి’’ అని తెలియజేశారు. విలీనాలు, టేకోవర్లకు తాము వ్యతిరేకం కాదంటూ... ‘‘ఏటా మా కంపెనీ 200- 250 కోట్ల మిగులు నగదును ఆర్జిస్తోంది. దీన్ని వాటాదారులకు డివిడెండ్‌ రూపంలో ఇవ్వటానికో, బైబ్యాక్‌లకో వెచ్చిస్తున్నాం. మంచి అవకాశాలు వస్తే విలీనాలు, టేకోవర్లకు కూడా ఆ డబ్బును వెచ్చించడానికి మేం సిద్ధమే’’ అని వివరించారు. దేశవ్యాప్తంగా విత్తనాలు పండించడానికి 65,000 ఎకరాలను లీజుకు తీసుకున్నామని, విత్తనం తయారీ నుంచి ప్యాకింగ్‌ వరకూ ఎక్కడా ఔట్‌సోర్సింగ్‌ అనేది లేకుండా తమ సొంత ప్లాంటుల్లోనే జరుగుతుందని ఆయన తెలియజేశారు. తమకు సొంతంగా పరిశోధన, అభివృద్ధి నిమిత్తం 600 ఎకరాలున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పత్తి విత్తనాల విక్రయానికి లైసెన్స్‌ను రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించగా... ఆ రద్దు తొలగిపోయిందని, దానివల్ల ప్రభావం తక్కువ కనక తామే ఆ విషయాన్ని పెద్దగా ప్రచారం చేయటం లేదని చెప్పారు. You may be interested

రుణాలకు డిమాండ్‌ లేదు...డిపాజిట్లలో వృద్దీ లేదు!

Friday 10th May 2019

ఆర్థిక మందగమన సంకేతాలు! ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందనడానికి బ్యాంకింగ్‌ తాజా రుణ, డిపాజిట్‌ గణాంకాలు అద్దం పడుతున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు... - 2019 ఏప్రిల్‌ 26తో ముగిసిన పక్షం రోజులను చూస్తే (2018 ఇదే కాలంతో పోల్చి) రుణ వృద్ధి కేవలం 13 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో ఇది రూ.96.21 లక్షల కోట్లు (రూ.85.17 లక్షల

మెరవని ఏషియన్‌ పెయింట్స్‌

Friday 10th May 2019

ఒక్కో షేర్‌కు రూ.7.65 తుది డివిడెండ్‌  న్యూఢిల్లీ: ఏషియన్‌ పెయింట్స్‌  గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసికంలో రూ.487 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో సాధించిన నికర లాభం(రూ.496 కోట్లు)తో పోల్చితే 2 శాతం క్షీణించిందని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.4,532 కోట్ల​ నుంచి 12 శాతం వృద్ధితో రూ.5,075 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.3,753

Most from this category