News


కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు

Thursday 5th December 2019
news_main1575517013.png-30060

  • తనఖా షేర్లపై సెబీనే ఆశ్రయించాలని శాట్ సూచన

న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్‌) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్‌) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్‌ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)ని ఆదేశించింది. కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 


సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్‌ఎస్‌డీఎల్‌ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్‌ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.  



You may be interested

డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష ..

Thursday 5th December 2019

కంపెనీలపై రూ. 15 కోట్ల దాకా జరిమానా వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత

టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంపు..!

Thursday 5th December 2019

జనవరి 1 నుంచి అమలు జైసల్మేర్‌/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్‌ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని, సాధారణంగా మోడల్‌ ప్రాతిపదికన రూ.10,000-15,000 వరకు పెంపు ఉండనుండగా.. ఈసారి ఎంత మేర

Most from this category