News


జెట్‌ పునరుద్ధరణ ఇక కలే!

Tuesday 18th June 2019
news_main1560837119.png-26370

  •  వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ వేటలో బ్యాంకులు ఫెయిల్‌
  • దివాలా పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీకి
  • బ్యాంకుల ఏకగ్రీవ నిర్ణయం
  • వచ్చిన ఏకైక బిడ్‌... ఆమోదయోగ్యంగా లేదని ప్రకటన

ముంబై: ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటాలు విక్రయించటంపై బ్యాంకులు చేతులెత్తేశాయి. వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించి రెండు నెలల పాటు ఇన్వెస్టర్‌ కోసం అన్వేషించిన రుణదాతల (బ్యాంకులు) కమిటీ... ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. చివరకు బిడ్డింగ్‌లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్‌ను విక్రయించడం ఇష్టం లేక, దివాలా చట్టం (ఐబీసీ) కింద రూ.8,000 కోట్ల రుణాల వసూలు కోసం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు అవి ప్రకటించాయి. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో 26 సంస్థలతో కూడిన రుణదాతల కమిటీ సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘షరతులతో కూడిన ఒకే ఒక్క బిడ్‌ మాత్రమే రావడంతో ఉన్నత స్థాయి చర్చల అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌కు దివాలా చట్టం కింద పరిష్కారం కోరాలని నిర్ణయించాం’’ అని ఎస్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆశావహ ఇన్వెస్టర్‌ ఈ డీల్‌కు కొన్ని రకాల సెబీ మినహాయింపులు కోరడంతో, ఐబీసీ కిందే మెరుగైన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. 25 ఏళ్ల క్రితం మొదలై ఒక దశలో అతిపెద్ద ప్రైవేటు రంగ విమానయాన సేవల కంపెనీగా ఎదిగిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్‌ 17 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. కార్యకలాపాల నిర్వహణకు కనీస నగదు కూడా లేని పరిస్థితుల్లో, నిధుల సాయానికి బ్యాంకులు అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలు చెల్లించకపోవడంతో సంస్థ విమానాలను కూడా లీజుదారులు తీసుకెళ్లిపోయారు.
23,000 మంది ఉద్యోగులకు కష్టం!
ఎతిహాద్‌-హిందుజా కూటమి ఆసక్తి వ్యక్తీకరించినప్పనటికీ, నిర్మాణాత్మక ప్రతిపాదన ఏదీ సమర్పించలేదని, పైగా భారీ హెయిర్‌కట్‌ (రుణభారంలో నష్టపోయే మొత్తం) తీసుకోవాలని కోరడంతో బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీ మార్గాన్ని ఎంచుకున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ చైర్మన్‌ నరేష్‌ గోయల్‌కు వ్యతిరేకంగా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేయడం, దర్యాప్తు విభాగాలు మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ మొదలుపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, సంస్థ పునరుద్ధరణ దిశగా ఇన్ని రోజులు ఆశలతో ఉన్న వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు బ్యాంకుల నిర్ణయం ఫలితంగా అంధకారంగా మారింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు సంస్థను వీడగా, ఇప్పటికీ చాలా మంది తిరిగి కార్యకలాపాలు మొదలవుతాయన్న ఆశలతో ఉన్నారు. 
బ్యాంకుల చేతికి వెళ్లినా చీకటే
జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉండడంతో చైర్మన్‌ నరేష్‌ గోయల్‌ను బలవంతంగా బయటకు పంపించిన బ్యాంకులు కంపెనీ నియంత్రణను మార్చి 25న తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రుణాన్ని ఈక్విటీగా మార్చుకున్నాయి. అయితే, రూ.1,500 కోట్ల మేర ఈక్విటీ మూలధనాన్ని అందిస్తామని ముందు హామీ ఇచ్చిన బ్యాంకులు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పాటు సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయేందుకు పరోక్షంగా కారణమయ్యాయి. సంస్థలో 24 శాతం వాటా కలిగిన అబుదాబీ సంస్థ ఎతిహాద్‌ సైతం మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు.
అప్పుల భారమే ఎక్కువ
జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణ భారం, ఇతర బాధ్యతలు కలిపి రూ.36,000 కోట్ల మేర ఉన్నాయి. సంస్థ చేతుల్లోని ఆస్తులు కేవలం హీత్రూ విమానాశ్రయంలో స్లాట్లు, జేపీ మైల్స్‌ అనే లాయల్టీ కార్యక్రమంలో మైనారిటీ వాటా మాత్రమే. దేశీయ విమానాశ్రయాల్లో జెట్‌కు ఉన్న స్లాట్లలో చాలా వాటిని ఇప్పటికే కేంద్రం ఇతర కంపెనీలకు కేటాయించేసింది. సంస్థ ఖాతాల్లో ఉన్న విమానాలు కేవలం 16. మిగిలిన 123 విమానాలు లీజుకు తీసుకున్నవి కాగా, అవి రిజిస్ట్రేషన్‌ కోల్పోయాయి. లీజుకిచ్చిన సంస్థలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. You may be interested

ఫేస్‌బుక్‌ నుంచి కొత్త క్రిప్టో కరెన్సీ

Tuesday 18th June 2019

రూపకల్పనకు లిబ్రా పేరిట కన్సార్షియం వీసా, మాస్టర్‌కార్డ్‌, పేపాల్‌తో జట్టు లండన్‌: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ కొత్తగా వివాదాస్పద క్రిప్టో కరెన్సీ చెల్లింపుల విధానాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థల ఆమోదముద్ర గల కొత్త క్రిప్టోకరెన్సీకి సంబంధించిన విషయాలను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. దీని రూపకల్పన కోసం లిబ్రా

టారిఫ్‌లపై దూకుడు వద్దు!!

Tuesday 18th June 2019

ట్రంప్‌కు అమెరికా కంపెనీల సూచన వినియోగదారులపై ధరల భారం కంపెనీల వ్యాపార అవకాశాలకు నష్టం పోటీలో నిలవలేమంటూ ఆందోళనలు వాషింగ్టన్‌: చైనా ఉత్పత్తులన్నింటిపైనా టారిఫ్‌లను 25 శాతానికి పెంచేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరించగా... ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా పరోక్షంగా అమెరికా కంపెనీలు, వినియోగదారులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కడి కంపెనీలు దేశాధ్యక్షుడిని హెచ్చరించాయి. చైనా నుంచి దిగుమతయ్యే 250 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే

Most from this category