STOCKS

News


టెల్కోల చార్జీలకు రెక్కలు!

Wednesday 16th October 2019
news_main1571197893.png-28909

  •  ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావంటున్న కంపెనీలు
  • టారిఫ్ పెరిగితే తప్ప కష్టం
  • ఎయిర్‌టెల్‌ ఎండీ విఠల్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (భారత్‌, దక్షిణాసియా విభాగం) గోపాల్ విఠల్ పేర్కొన్నారు. "ఈ టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని మా నమ్మకం. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మేం ఎప్పుడూ ఇదే మాట మీద ఉన్నాం" అని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. మరోవైపు, ఇంటర్‌కనెక్షన్ యూసేజ్ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీల వసూలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. "టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది" అని విఠల్ పేర్కొన్నారు. మరోవైపు, తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని చెప్పారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్ ఇండియా కల సాకారం కాగలదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని విఠల్ చెప్పారు.

ట్రాయ్‌పై జియో విమర్శలు...
ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌పై రిలయన్స్ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్‌టెల్‌ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ఇతర నెట్‌వర్క్‌ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ.. దీన్ని పొడిగించే అవకాశాలపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేయడం తాజాగా వివాదాస్పదమైంది. ఇప్పటికే ఐయూసీ కారణంగా పోటీ సంస్థలకు రూ. 13,500 కోట్ల పైగా కట్టామంటున్న జియో.. ఇకపై ఆ భారాన్ని వినియోగదారులపైనే మోపాలని నిర్ణయించుకుంది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల మేర ఐయూసీ చార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ట్రాయ్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. 



You may be interested

స్వదేశీ బ్రాండ్లకే మనోళ్లు మొగ్గు..!

Wednesday 16th October 2019

స్వదేశీ బ్రాండ్లకే భారత వినియోగదారుల మొగ్గు  బీసీజీ సంస్థ సర్వేలో వెల్లడి  ముంబై: భారత వినియోగదారుల్లో దాదాపు సగం మంది విదేశీ బ్రాండ్ల కంటే స్వదేశీ బ్రాండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ, బీసీజీ వెల్లడించింది. భారత వినియోగదారులు ఆహారం, వ్యక్తిగత సంరక్షణ కేటగిరీల్లో స్వదేశీ బ్రాండ్లకే మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీజీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజకీయంగా జాతీయత వాదం బలం పుంజుకుంటున్న వేళ, దేశీ వస్తువులనే కొనుగోలు

హీరో లెక్ట్రో... కొత్త ఈ-సైకిల్‌

Wednesday 16th October 2019

టౌన్‌మాస్టర్‌@ రూ.30,999 3 గంటలు చార్జింగ్‌...30-40 కి.మీ. ప్రయాణం న్యూఢిల్లీ: హీరో సైకిల్స్‌కు చెందిన లెక్ట్రో ఈ-మొబిలిటీ సొల్యూషన్స్‌ కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టౌన్‌మాస్టర్‌ పేరుతో అందిస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ధర రూ.30,999 అని లెక్ట్రో ఈ-మొబిలిటీ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ అదిత్య ముంజాల్‌ పేర్కొన్నారు.  ఈ బైక్‌ను చార్జింగ్‌ చేయడానికి ప్రత్యేకంగా చార్జింగ్‌ స్టేషన్లు అవసరం లేదని, సాధారణ ప్లగ్‌తోనే చార్జింగ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మూడు గంటలు

Most from this category