News


పరిశ్రమలు మళ్లీ మైనస్‌

Friday 13th December 2019
news_main1576207333.png-30197

  • అక్టోబర్‌ పారిశ్రామిక
  • ఉత్పత్తి గణాంకాల నిరాశ
  • వృద్ధిలేకపోగా - 3.8 శాతం క్షీణత
  • వరుసగా మూడు నెలల నుంచీ ఇదే ధోరణి

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్‌, మైనింగ్‌ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది.  గురువారం  విడుదలైన గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను చూస్తే...

తయారీ రంగం: సూచీలో దాదాపు 60 శాతంపైగా వెయిటేజ్‌ ఉన్న ఈ రంగంలో -2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో ఈ విభాగం 8.2 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌  నుంచి)లో అక్టోబర్‌ వరకూ చూస్తే, వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 0.5 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 18 నిరాశాకరమైన ఫలితాలను ఇచ్చాయి. కంప్యూటర్‌, ఎలక్రా‍్టనిక్‌, ఆప్టికల్‌ ప్రొడక్ట్స్ ఉత్పత్తిలో తీవ్ర క్షీణత -31.3 శాతం నమోదయ్యింది. మోటార్‌ వాహన విభాగంలో ఏకంగా - 27.9 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. 
విద్యుత్‌:- ఈ విభాగం కూడా 10.8 శాతం వృద్ధి బాట నుంచి (2018 అక్టోబర్‌లో) -12.2 శాతం క్షీణతలోకి జారింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో వృద్ధి 6.8 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. 
మైనింగ్‌:- ఈ విభాగంలో 7.3 శాతం వృద్ధి రేటు - 8 శాతం క్షీణత (2019 అక్టోబర్‌)లోకి పడింది. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ తీసుకున్నా ఈ విభాగం 3.9 శాతం వృద్ధిబాట నుంచి -0.4 శాతం క్షీణతలోకి జారింది. 
‍క్యాపిటల్‌ గూడ్స్‌:- ఇక భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి, డిమాండ్‌కు ప్రతిబింబమైన ఈ రంగంలో భారీగా -21.9 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగం భారీగా 16.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 
రసాయనాలు:- ఈ విభాగంలో భారీగా 31.8 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఇనుము, అల్యూమినియం వంటి బేస్‌ మెటల్స్‌ చక్కటి వృద్ధి (9.4 శాతం) తీరును నమోదుచేసుకున్నాయి. 

ఏడు నెలల్లో...
ఏప్రిల్‌తో ప్రారంభం నుంచీ అక్టోబర్‌ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత ఆగస్టు(-1.4 శాతం), సెప్టెంబర్‌(-4.3 శాతం), అక్టోబర్‌ (-3.8 శాతం) నెలల్లో  క్షీణత నమోదయ్యింది. అయితే సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో క్షీణ రేటు కొంత తగ్గడం గమనార్హం. 

అదుపు తప్పిన ధరలు

  • నవంబర్‌లో 5.54 శాతం
  • మూడేళ్ల గరిష్టం

న్యూఢిల్లీ: వినియోగ ధరలు అదుపుతప్పాయి. సంబంధిత సూచీ నవంబర్‌లో మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి చేరింది. అంటే 2018 నవంబర్‌తో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో నిత్యావసరాల వినియోగ వస్తువుల బాస్కెట్‌ ధర మొత్తంగా 5.54 శాతం పెరిగిందన్నమాట. 2016 జూలై (6.07 శాతం) తరువాత ధరల పెరుగుదల తీవ్రత ఇంత స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 2.33 శాతం. అక్టోబర్‌లో కూడా రిటైల్‌ ద్రవ్యోల్బణం భారీగా 4.62 శాతం నమోదయ్యింది. అంటే వరుసగా రెండు నెలల్లోనూ రిటైల్‌ ధరలు అదుపు తప్పాయన్నమాట.  రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 శాతాన్ని మించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి (ఆర్‌బీఐ) కేంద్రం నుంచి నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్‌ 2’ లేదా ‘మైనస్‌ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగువదిశలో 4 శాతం దాటకూడదన్నమాట. కాగా కూరగాయల ధరలు నవంబర్‌లో ఏకంగా 36 శాతం పెరిగాయి. 



You may be interested

విలీన బాటలో ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, డిష్‌టీవీ

Friday 13th December 2019

విలీన బాటలో ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌, డిష్‌టీవీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భావం 4 కోట్ల చందాదారులతో 62 శాతం మార్కెట్‌వాటా ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్‌ డీల్‌ విషయమై ఒక అంగీకారానికి

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు.. మీ స్ట్రాటజీ ఏంటి?

Friday 13th December 2019

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఐపీవోలో ఒక్కో షేరును రూ.37కు జారీ చేయగా, లిస్టింగ్‌లోనే 50 శాతం లాభాలను ఇచ్చింది. బీఎస్‌ఈలో రూ.55.90 వద్ద ముగిసింది. ఐపీవోలో షేర్లు అలాట్‌ అయిన ఇన్వెస్టర్లు ప్రస్తుత ధరలో అమ్మేసుకోవాలా? ఐపీవోలో షేర్లు దక్కని వారు ప్రస్తుత ధరలో కొనుగోలు చేసుకోవచ్చా..? లేక వేచి చూడాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..   దీర్ఘకాలం కోసం అయితే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు షేరును హోల్డ్‌ చేసుకోవచ్చని

Most from this category