News


పాన్‌ షాపుకన్నా అధ్వాన్నంగా తయారైంది!!

Wednesday 10th July 2019
news_main1562741387.png-26946

  • ఇండిగోలో తీవ్రస్థాయిలో గవర్నెన్స్ లోపాలు 
  • జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దండి
  • సెబీకి ప్రమోటరు గంగ్వాల్ లేఖ

న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్‌ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్‌ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు.  "సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి" అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, వాణిజ్య మంత్రి పియుష్ గోయల్‌కు కూడా పంపారు.

వివాదం ఇదీ... 
ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37 శాతం వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్‌)కు 38 శాతం వాటాలు ఉన్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీల విషయంలో ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున అహం దెబ్బతినడంతోనే గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. 

19లోగా వివరణివ్వండి...
రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది.



You may be interested

డౌన్‌గ్రేడ్స్‌ పెరుగుతున్నాయ్‌!

Wednesday 10th July 2019

దేశీయ క్రెడిట్‌ మార్కెట్‌ సవాళ్ల సమయం ఎదుర్కొంటోంది. మార్కెట్లో క్రెడిట్‌ నాణ్యత క్షీణిస్తోందని కేర్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. కేర్‌ రేటింగ్స్‌ మదింపు చేసే ఎంసీఆర్‌(మోడిఫైడ్‌ క్రెడిట్‌ రేషియో) జూన్‌ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠం 0.8కి చేరింది. దీంతో కేర్‌ రేటింగ్స్‌ జరిపే డౌన్‌గ్రేడ్స్‌ వేగం పుంజుకుఉన్నాయి. గతేడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన కంపెనీల సంఖ్య 26 శాతం పెరిగింది. ఇదే సమయంలో

హైదరాబాద్‌ రియల్టీలో వృద్ధి

Wednesday 10th July 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉత్సాహం నెలకొంది. కొత్త గృహాల ప్రారంభాలు, కార్యాలయాల లావాదేవీల్లో వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ (హెచ్‌1) మధ్య కాలంలో నగరంలో కొత్త గృహాల లాంచింగ్స్‌లో 47 శాతం, ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో 43 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 11వ ఎడిషన్‌ అర్ధ సంవత్సర నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ బ్రాంచ్‌

Most from this category