News


బడ్జెట్‌ను మించిపోయిన బిలియనీర్ల సంపద

Tuesday 21st January 2020
Markets_main1579575557.png-31059

  • 1 శాతం కుబేరుల వద్దే అత్యధిక ఐశ్వర్యం
  • దేశీయంగా 70% సామాన్యులతో పోలిస్తే 4 రెట్లు అధికం
  • ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ నివేదిక

దావోస్‌:  పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ .. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ పరిమాణాన్ని (2018-19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా 'టైమ్‌ టు కేర్‌' పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలీయనీర్ల దగ్గర ఉంది. "అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి" అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 21 నుంచి జరగనున్న డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గోనున్నారు. 
నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు..
- టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు. 
- మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన  మొత్తం బడ్జెట్‌ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ. 
- సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు.
- అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్‌ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ.  
- వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది.  

కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్న యువత ..
2020-30 దశాబ్దాన్ని.. చేసిన హామీలను పూర్తి చేసే దశాబ్దిగా మార్చేందుకు కొత్త నాయకత్వం, కొత్త విధానాలు అవసరమని నేటి తరం యువత భావిస్తోంది.  డబ్ల్యూఈఎఫ్‌, యాక్సెంచర్ సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సుమారు 5,000 మంది సీఈవోలు, యువత ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. సర్వే శ్వేతపత్రం ప్రకారం.. విశ్వసనీయత, కొత్త ఆవిష్కరణలు, సంస్థాగతంగా పటిష్టమైన పనితీరు ప్రదర్శనకు అనువైన పరిస్థితులకు పెద్దపీట వేస్తున్న కంపెనీలు ముందుకు సాగనుండగా, వీటిని పట్టించుకోని సంస్థలు వెనుకబడనున్నాయి. బాధ్యతాయుతమైన నాయకత్వానికి సంబంధించి కొన్ని అంశాలను ఇందులో ప్రస్తావించారు. వీటి ప్రకారం.. నాయకత్వం వహించేవారు రోజువారీగా సంస్థ పనితీరును మెరుగుపర్చడంతో పాటు దీర్ఘకాలంలో మరింత విలువ జోడించేలా నవకల్పనలపై నిరంతరం కృషి చేస్తుండాలి. అలాగే, నిలకడైన, బాధ్యతాయుతమైన విధానాల ద్వారా సంబంధిత వర్గాలందరి విశ్వసనీయతను పొందాల్సిన అవసరం ఉంది. 

సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్‌..
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయులకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్‌ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్‌ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్‌ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలియజేసేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర అయిదు అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్‌ అగ్రస్థానంలో ఉంది. 



You may be interested

వాహన పరిశ్రమకు మంచిరోజులు..

Tuesday 21st January 2020

2020పై ఆశావహంగా సియామ్‌ కోల్‌కతా: అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ 2020పై గంపెడాశలు పెట్టుకుంది. ఈ ఏడాది మళ్లీ పుంజుకోగలమని వాహన సంస్థల సమాఖ్య సియామ్ అంచనా వేస్తోంది. దేశీయంగా వాహనాల వినియోగం ఇప్పటికీ తక్కువగానే ఉన్న నేపథ్యంలో.. పలు విదేశీ సంస్థలు భారత్‌ మార్కెట్లో ప్రవేశించేందుకు ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలవని భావిస్తోంది. సియామ్ డిప్యుటీ డైరెక్టర్‌ సుగతో సేన్ ఈ విషయాలు వెల్లడించారు. "గడిచిన 20 ఏళ్లలో

తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు

Tuesday 21st January 2020

- 32 శాతం పెరిగిన నికర లాభం  న్యూఢిల్లీ: ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 32 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.441 కోట్లకు పెరిగిందని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,300 కోట్ల నుంచి రూ.3,738 కోట్లకు ఎగసిందని పేర్కొంది. బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. గత

Most from this category