News


మరింతగా అప్పుల ‘చమురు’!

Wednesday 5th June 2019
news_main1559729177.png-26109

  • భారీ రుణ భారంలో చమురు మార్కెటింగ్‌ సంస్థలు
  • మార్చినాటికి ఏకంగా రూ.1.62 లక్షల కోట్ల రుణాలు
  • భారీ మూలధన వ్యయాలతో పెరిగిన రుణాలు
  • ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించకపోవటంతో ఇంకాస్త...

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) రుణాలపై ఆధారపడడం రానురాను మరింత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌నే (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) ఉమ్మడి రుణాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడింటి రుణాలూ ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల గరిష్ట స్థాయి 1.62 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఏడాది క్రితం ఉన్న రూ.1.25 లక్షల కోట్ల రుణాలతో పోలిస్తే ఇవి ఏకంగా 30 శాతం పెరిగిపోయాయి. ముఖ్యంగా వీటిల్లో ఒక్క ఐవోసీ రుణాలే 2019 మార్చి నాటికి రూ.92,712 కోట్లు కావడం గమనార్హం. ఆ తర్వాత బీపీసీఎల్‌ రుణాలు రూ.42,915 కోట్లు, హెచ్‌పీసీఎల్‌ రుణ భారం రూ.26,036 కోట్లు చొప్పున ఉన్నాయి. ఈ మూడు కంపెనీలూ కలసి కొత్తగా రూ.36,402 కోట్ల మేర రుణాలను సమీకరించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మూలధన విస్తరణ కార్యక్రమాలకు తోడు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో రాకపోవడమే రుణ భారం పెరిగేందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ), కిరోసిన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.33,900 కోట్ల మేర సబ్సిడీ ఓఎంసీలకు రావాల్సి ఉంది. ద్రవ్యలోటు సర్దుబాటు కోసమని ఓఎంసీల సబ్సిడీల చెల్లింపులను ప్రభుత్వం వాయిదా వేయడం​గమనార్హం. 
భారీ విస్తరణ కార్యక్రమాలు...
అయితే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ... 2014 ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే ఉందని చెప్పాలి. అప్పట్లో చమురు ధరలు చారిత్రక గరిష్ఠాలకు చేరిన సమయం కావడంతో ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.76 లక్షల కోట్ల స్థాయికి పెరిగిపోయింది. ‘‘బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలతో పోలిస్తే ఐవోసీ భారీగా మూలధన వ్యయ ప్రణాళికలను అమలు చేస్తోంది. హెచ్‌పీసీఎల్‌కు ఎక్కువ శాతం మార్కెటింగ్‌ కార్యకలాపాలు కావడంతో నగదు ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, మోస్తరు విస్తరణ ప్రణాళికలను అమల్లో పెట్టింది. బీపీసీఎల్‌కు మాత్రం చమురు వెలికితీత, ఉత్పత్తితో పాటు పట్టణ గ్యాస్‌ పంపిణీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి’’ అని ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు. 
రావాల్సిన బకాయిలు
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లింపుల్లో జాప్యం చేయడం కారణంగానే ఓఎంసీలకు ఒక్కోదానికి మార్చి నెలలో రూ.5,000- 10,000 కోట్ల వరకు రుణం పెరిగినట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నివేదిక పేర్కొంది. ‘‘మా రుణభారం ఇప్పటి వరకైతే రూ.81,000 కోట్లకు పెరిగింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి రూ.19,000 కోట్ల మేర బకాయిలు రాకపోవడం వల్లే. ఇందులో ఎల్‌పీజీకి సంబంధించి ప్రత్యక్ష నగదు బదిలీ రూ.13,883 కోట్లుగా ఉంటే, కిరోసిన్‌ సబ్సిడీ రూ.3,395 కోట్ల మేర ఉంది. మిగిలిన రూ.2,000 కోట్లు పీఎంయూవై డిపాజిట్‌’’ అని ఈ నెల 17న ఇండియన్‌ ఆయిల్‌ డైరెక్టర్‌ ఏకే శర్మ పేర్కొనడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వానికి అధిక డివిడెండ్‌ చెల్లించాల్సి రావడం, మధుర రిఫైనీరికి సంబంధించి ఎంట్రీ ట్యాక్స్‌ సైతం ఇండియన్‌ ఆయిల్‌ రుణ భారం పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి.  

 
 You may be interested

‘ఎయిర్‌ట్రాఫిక్‌’పై ఏఏఐ, బోయింగ్‌ జట్టు

Wednesday 5th June 2019

పదేళ్ల రోడ్‌మ్యాప్‌ కోసం కుదిరిన ఒప్పందం ఏడాదిన్నరలో సిద్ధం కానున్న రోడ్‌మ్యాప్‌ న్యూఢిల్లీ: భారత్‌లో విమానాల నిర్వహణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో (ఏఏఐ) కలిసి పదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు వైమానిక దిగ్గజం బోయింగ్‌ తెలియజేసింది. ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు తాము సాంకేతిక సహకారం అందించేలా ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రణాళిక 18 నెలల్లో సిద్ధం కావచ్చని, అమెరికా ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌

ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలి

Wednesday 5th June 2019

ఆర్‌బీఐతో అంతర్గత విచారణ జరపాలి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కుంభకోణంపై ఎస్‌ఎఫ్‌ఐవో సూచన నష్టాల రికవరీకి చర్యలపై ప్రణాళిక న్యూఢిల్లీ: దాదాపు రూ. 90,000 కోట్ల రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో తీవ్ర నేరాల విచారణ సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు వేగవంతం చేసింది. మోసాల్లో పాలుపంచుకున్న ఆడిటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, లోపాలను గుర్తించడంలో జాప్యానికి గల కారణాలను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ అంతర్గతంగా విచారణ జరపాలని సూచించింది. ఉన్నతాధికారులు కుమ్మక్కై

Most from this category