News


టీవీ ధరలు దిగివస్తాయ్‌

Thursday 19th September 2019
news_main1568864100.png-28416

  • 3-4 శాతం వరకు తగ్గే అవకాశం
  • ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకం ఎత్తివేత
  • కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌
  • దీంతో దేశీయంగా పెరగనున్న తయారీ

న్యూఢిల్లీ: దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ తయారీ ఖర్చులు 3 శాతం వరకు తగ్గుతాయి. అలాగే, ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానళ్ల తయారీలో వినియోగించే చిప్‌ ఆన్‌ ఫిల్మ్‌, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ (పీసీబీఏ), సెల్‌ (గ్లాస్‌బోర్డు/సబ్‌స్ట్రేట్‌)పైనా దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తు‍్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. డిమాండ్‌ తగ్గిన నేపథ్యంలో దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని పరిశ్రమ కొంత కాలంగా కోరుతోంది. 15.6 అంగుళాలు అంతకుమించి పరిమాణంతో కూడిన ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీ ప్యానళ్లలో ఓపెన్‌ సెల్‌లపై ప్రస్తుతం 5 శాతం దిగుమతి సుంకం అమల్లో ఉండగా, ఇకపై ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రముఖ జపనీస్‌ కంపెనీ ప్యానాసోనిక్‌ మాత్రం ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించింది. 3-4 శాతం వరకు ధరలు తగ్గుతాయని ప్రకటించింది. ఎల్‌ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60-70 శాతం ఓపెన్‌సెల్‌ ప్యానళ్లకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దేశంలోని టీవీ తయారీ కంపెనీలు చాలా వరకు వీటిని దిగుమతి చేసుకుంటున్నాయి. 2017 జూన్‌లో టీవీ ప్యానెళ్లపై కేంద్రం ఈ దిగుమతి సుంకాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. దేశీయ టీవీ మార్కెట్‌ పరిమాణం రూ.22,000 కోట్లుగా ఉంటుంది.
సానుకూల ఫలితాలు...
కేంద్రం నిర్ణయం సానుకూలమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ గతేడాది భారత్‌లోని తన టీవీల తయారీ యూనిట్‌ను మూసేసి, వియత్నాంకు తరలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఓపెన్‌ సెల్‌ ప్యానళ్లపై కస్టమ్స్‌ డ్యూటీయే. దేశీయంగా తగ్గిన వినియోగ డిమాండ్‌ టీవీ సెట్లపైనా ప్రభావం చూపిస్తోంది. ఒకవైపు మందగమనం, మరోవైపు పెరిగిన పోటీ, పెద్ద టీవీలపై జీఎస్టీ రేటు ప్రతికూలతలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తయారీదారులకు ఉపశమనం ఇచ్చేదే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
పరిశ్రమ హర్షాతిరేకం...
సరిగ్గా పండుగల సీజన్‌కు ముందు టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం పరిశ్రమను సంతోషానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయం టీవీల తయారీ వ్యయాన్ని తగ్గించడంతోపాటు దేశీయ తయారీని పెంచేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘పరిశ్రమ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. టీవీ తయారీపై ఒత్తిళ్లను ఇది తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసినట్టయితే పరిశ్రమలో డిమాండ్‌ పుంజుకుంటుంది. గతేడాది టీవీల అమ్మకాలు ఫ్లాట్‌గా నమోదైన తర్వాత సరైన సమయంలో ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. టీవీల తయారీ వ్యయంలో అధిక భాగం ఓపెన్‌ సెల్స్‌పైనే వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పరిశ్రమ వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయగలదు. ధరలు 3-4 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది’’ అని ప్యానాసోనిక్‌ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీష్‌ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం టీవీల ధరలను మరింత అందుబాటు తీసుకొచ్చేందుకు 32 అంగుళాలపైన టీవీలపై జీఎస్టీ రేటును ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలని మనీష్‌ శర్మ కోరారు. అయితే, పండుగల సమయానికి రేట్ల తగ్గింపు అందుబాటులోకి రాకపోవచ్చన్నారు. పండుగల కోసం ఇప్పటికే స్టాక్స్‌ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. నూతనంగా దిగుమతి చేసుకునే వాటిపైనే దీని ప్రభావం 3 శాతం వరకు ఉంటుందన్నారు. 
మేకిన్‌ ఇండియాకు ఊతం...
ప్రభుత్వ నిర్ణయం భారత్‌లో తయారీని పెంచుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా పేర్కొంది. ‘‘ఇది ఎంతో సానుకూల పరిణామం. ఇది భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా)కి ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తుంది’’ అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా డైరెక్టర్‌ యూంచల్‌పార్క్‌ అన్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తొలగించడం భారత్‌లో టీవీల తయారీని పెంచాలన్న తమ ప్రయత్నాలకు సాయపడుతుందని సోనీ ఇండియా సైతం అభివర్ణించింది. ‘‘ప్రభుత్వ మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి సోనీ ఇండియా చాలా కాలంగా కట్టుబడి ఉంది. టీవీ ఓపెన్‌సెల్‌ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని ఉపసంహరించడం స్థానిక తయారీకి బలమైన ఊతమిస్తుంది. ఈ దిశగా మేం మరిన్ని చర్యలు తీసుకునేందుకు వీలు పడుతుంది’’ అని సోనీ ఇండియా ఎండీ సునీల్‌ నయ్యర్‌ తెలిపారు. పరిశ్రమ ఈ నిర్ణయం కోసం ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నట్టు హయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌బ్రగంజ అన్నారు. వృద్ధిని ప్రోత్సహించే ఏ చర్య అయినా స్వాగతించతగినదేనన్నారు. 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో పెరిగిన అంబానీ వాటా

Thursday 19th September 2019

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో  ప్రమోటర్‌ అనిల్‌ అంబానీ వాటా మరింతగా పెరిగింది. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ పెట్రోలియమ్‌ ట్రస్ట్‌ నియంత్రణలోని రిలయన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ హోల్డింగ్స్‌ కంపెనీ ఈ నెల 13న 2.71 శాతం వాటాకు సమానమైన 17.18 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ముకేశ్‌ అంబానీ వాటా 48.87 శాతానికి పెరిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే రెండో అతి

67 శాతం తగ్గిన ఎన్‌సీడీ నిధులు

Thursday 19th September 2019

పెరిగిన డిఫాల్ట్‌లు తగ్గిన ఇన్వెస్టర్ల విశ్వాసం  న్యూఢిల్లీ:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల ద్వారా కంపెనీల నిధుల సమీకరణ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టు కాలానికి ఎన్‌సీడీల ద్వారా కంపెనీలు రూ.21,048 కోట్లు సమీకరించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎన్‌సీడీల ద్వారా నిధుల సమీకరణ రూ.7,000 కోట్లకు తగ్గిందని సెబీ వెల్లడించింది. వివిధ కంపెనీలు చెల్లింపుల్లో విఫలం కావడం,

Most from this category