News


కారు.. కుదేలు..

Wednesday 14th August 2019
news_main1565760554.png-27752

  • జూలైలో 19 శాతం పడిపోయిన అమ్మకాలు 
  • 19 ఏళ్లలో ఇదే భారీ  క్షీణత
  • 15,000 ఉద్యోగాలకు కోత
  • సియామ్‌ గణాంకాల్లో వెల్లడి
  • ప్యాకేజీ కోసం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ మందగించడం ఆటోమొబైల్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. జూలైలో వాహన విక్రయాలు ఏకంగా 18.71 శాతం క్షీణించాయి. గడిచిన 19 ఏళ్లలో ఇంత భారీగా అమ్మకాలు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఆటోమొబైల్‌ రంగంలో ఉద్యోగాల్లో కూడా కోత పడుతోంది. గడిచిన రెండు–మూడు నెలల్లో సుమారు 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారతీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థల సమాఖ్య (సియామ్‌) విడుదల చేసిన గణాంకాల ప్రకారం వివిధ రకాల ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాల విక్రయాలు ఈ ఏడాది జూలైలో మొత్తం 18,25,148 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలైలో వాహనాల అమ్మకాలు 22,45,223 యూనిట్లు. దేశీయంగా గతంలో 2000 డిసెంబర్‌లో చివరిసారిగా ఆటోమొబైల్‌ విక్రయాలు ఏకంగా 21.81 శాతం మేర పడిపోయాయి. ఆ తర్వాత ఇంత భారీ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి.

ప్రభుత్వం తక్షణం ప్యాకేజీ ప్రకటించాలి...
"ప్రభుత్వం తక్షణం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు పరిశ్రమ ప్రయత్నాలన్నీ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా తన వంతుగా ఎంతో కొంత తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది" అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ తెలిపారు. సుమారు 15,000 మంది ఉద్యోగాలు (తాత్కాలిక, క్యాజువర్‌ వర్కర్లు) కోల్పోయారని ఆయన చెప్పారు. ఆటోమోటివ్‌ పరికరాల తయారీ రంగంలో మరో పది లక్షల మంది దాకా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందన్నారు. అమ్మకాలు పడిపోవడంతో సుమారు 300 డీలర్‌షిప్‌లు మూతబడ్డాయని మాథుర్‌ చెప్పారు. 2008-09, ఆ తర్వాత 2013-14లో మందగమనం వచ్చినప్పటికీ.. పరిశ్రమలో కనీసం కొన్ని విభాగాలైనా వృద్ధి నమోదు చేశాయని, ప్రస్తుతం అన్ని విభాగాల పనితీరు అధ్వాన్నంగా ఉందన్నారు. ఆటోమొబైల్‌ పరిశ్రమ నానాటికి కోలుకోలేని విధంగా పతనం అవుతోందని పేర్కొన్నారు. తయారీ జీడీపీలో ఆటోమొబైల్‌ పరిశ్రమ వాటా దాదాపు సగం ఉంటుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3.7 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని మాథుర్‌ వివరించారు. ఈ పరిశ్రమ గానీ పతనమైతే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కూడా మందగిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వాహన కొనుగోలు వ్యయాన్ని తగ్గేలా, అమ్మకాలకు ఊతం లభించేలా కేంద్రం జీఎస్‌టీని తాత్కాలికంగానైనా తగ్గించాలని పరిశ్రమ కోరుతున్నట్లు మాథుర్‌ చెప్పారు. అలాగే, వాహనాల స్క్రాపేజీ పాలసీ ప్రవేశపెట్టడం, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాన్ని పునరుద్ధరించి రుణ లభ్యతను పెంచడం, వాహన రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనను మరికొన్నాళ్లు వాయిదా వేయడం తదితర విజ్ఞప్తులను ప్రభుత్వం ముందు ఉంచినట్లు ఆయన వివరించారు. 

పాసింజర్‌ వాహన విక్రయాలు 31 శాతం డౌన్‌..
- గతేడాది జూలైలో పాసింజర్‌ వాహనాల (పీవీ) అమ్మకాలు 2,90,031 యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది జూలైలో ఏకంగా 30 శాతం పడిపోయి 2,00,790 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది కూడా 19 ఏళ్లలో భారీ క్షీణత. అంతే కాకుండా వరుసగా తొమ్మిది నెలల పాటు పీవీల అమ్మకాలు తగ్గినట్లయింది. చివరిసారిగా 2000 డిసెంబర్‌లో పీవీ అమ్మకాలు 35.22 శాతం పడిపోయాయి. 
- ప్యాసింజర్‌ కార్ల విషయానికొస్తే గత జూలైలో 1,91,979 కార్లు అమ్ముడవగా.. ఈ ఏడాది జూలైలో సుమారు 36 శాతం క్షీణించి 1,22,956 యూనిట్లకు తగ్గాయి. 2000 డిసెంబర్‌లో ఈ క్షీణత 39.86 శాతంగా నమోదైంది. 
- ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్‌ అమ్మకాలు 22.9 శాతం క్షీణించి 5,11,374 యూనిట్లకు తగ్గాయి. అటు పోటీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా విక్రయాలు కూడా సుమారు 11 శాతం తగ్గి 4,55,036 యూనిట్లకు, టీవీఎస్‌ మోటార్‌ అమ్మకాలు 16 శాతం క్షీణించి 2,08,489 యూనిట్లకు పరిమితమయ్యాయి. 
- పీవీ సెగ్మెంట్‌లో మార్కెట్‌ దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు జూలైలో సుమారు 37 శాతం క్షీణించి 96,478 యూనిట్లకు తగ్గాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) 10 శాతం క్షీణతతో 39,010 యూనిట్లు, మహీంద్రా అండ్‌ మహీంద్రా సుమారు 15 శాతం క్షీణతతో 16,830 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగాయి.  



You may be interested

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

Wednesday 14th August 2019

ఆదాయం రూ.26,555 కోట్లు న్యూఢిల్లీ: తగ్గిన  చమురు ధరల ప్రభావం ఓఎన్‌జీసీ లాభాలపై పడింది. అయినప్పటికీ లాభాల క్షీణతను 4 శాతానికి పరిమితం చేసి జూన్‌ క్వార్టర్‌లో రూ.5,904 కోట్లను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,144 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం 2.4 శాతం తగ్గి రూ.26,555 కోట్లకు పరిమితం అయింది. ప్రతీ బ్యారెల్‌ చమురును ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా రూ.66.30 డాలర్లను ఆర్జించింది. అంతక్రితం

పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

Wednesday 14th August 2019

ఓవర్‌నైట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసే లక్ష్యంతో పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (లోగడ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా) నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. ఈ నెల 12న ఆఫర్‌ ప్రారంభం కాగా, ఈ నెల 26 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు వ్యవధిలో గడువు తీరే ఓవర్‌నైట్‌ సెక్యూరిటీల్లో (డెట్‌ సెక్యూరిటీలు, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లు) ఈ పథకం

Most from this category