News


వాణిజ్య పోరుతో భారత్‌కు లాభం

Friday 24th May 2019
news_main1558683001.png-25909

  • అమెరికా, చైనాకు ఎగుమతులు పెంచుకునే అవకాశం
  • విశ్లేషకులు, పరిశ్రమవర్గాల అంచనా

న్యూఢిల్లీ: అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని భారత్‌ తనకు అనుకూలంగా మల్చుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రెండు దేశాలకు దుస్తులు, వ్యవసాయోత్పత్తులు, వాహనాలు, యంత్రాలు మొదలైన వాటిని ఎగుమతి చేసే అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధంలో చైనా నుంచి దిగుమతయ్యే యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులను అమెరికా టార్గెట్ చేసింది. అలాగే అమెరికా నుంచి దిగుమతయ్యే సోయాబీన్ తదితర వ్యవసాయోత్పత్తులు, ఆటోమోటివ్ ఉత్పత్తులను చైనా లక్ష్యంగా చేసుకుని సుంకాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాలకు ఆయా ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకునే అవకాశాలు భారత్‌ పరిశీలించాలని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల డిమాండ్‌కు తగ్గ స్థాయిలో సరఫరా చేయగలిగే సత్తా చైనా తర్వాత భారత్‌కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. 
    మరోవైపు, వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 2018లో 11.2 శాతం, చైనాకు 31.4 శాతం పెరిగాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. వాణిజ్య యుద్ధాల వల్ల తమపై ప్రతికూల ప్రభావమేదీ లేదని ప్రజలకు చూపించుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నందున.. భారత సంస్థలకు మరిన్ని అవకాశాలు ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక, రెండు దేశాలకు వ్యవసాయోత్పత్తుల ఎగుమతి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు భారత్ ప్రయత్నించాలని అగ్రి ఎకనామిక్స్ నిపుణుడు చీరాల శంకరరావు చెప్పారు. 2017-18 గణాంకాల ప్రకారం చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 89.71 బిలియన్ డాలర్లుగా ఉండగా, అమెరికాతో 74.5 బిలియన్ డాలర్లుగా ఉంది.

కానీ.. జీఎస్పీ ప్రయోజనాలు రద్దు చేస్తే చైనాకే లాభం
చైనాతో అమెరికా కొనసాగిస్తున్న సుదీర్ఘ వాణిజ్య యుద్ధం వల్ల అమెరికన్‌ కంపెనీలు దిగుమతుల కోసం జీఎస్పీ హోదా ఉన్న దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది!!. ఒకవేళ భారత్‌కు గనక జీఎస్పీ హోదా రద్దు చేస్తే... అది అంతిమంగా చైనాకే లబ్ధి చేకూరుస్తుంది. జీఎస్పీ కూటమిలోని అమెరికన్‌ కంపెనీలు, వాణిజ్య సంఘాలు ఒక నివేదికలో ఈ హెచ్చరిక చేశాయి. జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌కు (సాధారణ ప్రాధాన్య వ్యవస్థ) సంక్షిప్త రూపం జీఎస్పీ.  ఈ హోదా ఉన్న దేశాల్లో భారత్‌, థాయిలాండ్‌, కంబోడియా, టర్కీ, ఇండోనేషియా వంటివి ఉన్నాయి. ‘‘జీఎస్పీ దేశాల నుంచి దిగుమతులు చేసుకోవటం వల్ల అమెరికన్‌ కంపెనీలు 2019 మార్చిలో 105 మిలియన్‌ డాలర్లు ఆదా చేయగలిగాయి. 2018 మార్చి నెలలో చూస్తే ఇది 77 మిలియన్‌ డాలర్లు మాత్రమే. ఇక 2019 తొలి త్రైమాసికంలో అమెరికన్‌కంపెనీలు ఏకంగా 285 మిలియన్‌ డాలర్లు ఆదా చెయ్యగలిగాయి. ఇది 2018 తొలి త్రైమాసికంతో పోలిస్తే 63 మిలియన్‌ డాలర్లు అధికం’’ అని ఆ నివేదిక వెల్లడించింది. 
వేల రకాల వస్తువుల్ని సుంకాలు లేకుండా అమెరికాకు దిగుమతి చేసుకోవటానికి, తద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి అమెరికా ప్రభుత్వం ఈ జీఎస్పీని ప్రవేశపెట్టింది. అయితే, భారత జీఎస్పీ గుర్తింపును తొలగించాలని అనుకుంటున్నట్టు ఈ ఏడాది మార్చి 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో, అలా చేస్తే అది చైనాకే లాభమంటూ జీఎస్పీ  కూటమి ఇచ్చిన నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

 You may be interested

62 శాతం తగ్గిన ఇండస్‌ఇండ్‌ లాభం

Friday 24th May 2019

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెగ  రూ.7,550 కోట్లకు మొత్తం ఆదాయం ఒక్కో షేర్‌కు రూ.7.50 డివిడెండ్‌ న్యూఢిల్లీ: ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 62 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.953 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.360 కోట్లకు తగ్గిందని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు

తగ్గిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టాలు

Friday 24th May 2019

రెండేళ్ల కనిష్టానికి నికర మొండి బకాయిలు  రూ.15,285 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నికర నష్టాలు(స్టాండ్‌అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో తగ్గాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.3,102 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.991 కోట్లకు తగ్గాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల

Most from this category